కోట్ల కుంభకోణం: టీడీపీ నేత వరుపుల పరారీ

Big Scam: TDP Leader Varupula Raja Escape - Sakshi

తూర్పు’ డీసీసీబీలో కోట్ల కుంభకోణం

ప్రత్తిపాడు టీడీపీ ఇన్‌చార్జి వరుపుల రాజాపై సీఐడీ కేసు

అరెస్టుకు ఇంటికి వచ్చిన పోలీసులు

పోలీసులను అడ్డుకున్న టీడీపీ నేతలు

విద్యుత్‌ నిలిపివేసి మాయమైన రాజా

సాక్షి ప్రతినిధి, కాకినాడ/ప్రత్తిపాడు: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌ను కొల్లగొట్టిన అప్పటి డీసీసీబీ చైర్మన్, ప్రత్తిపాడు టీడీపీ ఇన్‌చార్జి వరుపుల రాజా పోలీసుల కళ్లుగప్పి పరారయ్యారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రత్తిపాడులో రాజా ఇంటివద్ద తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఒకపక్క పోలీసులు, మరోపక్క టీడీపీ శ్రేణులు మోహరించారు. అయితే, రాత్రి 8.30 గంటల సమయంలో తాము రాజా ఇంటిలోకి ప్రవేశించే ముందు విద్యుత్‌ సరఫరా నిలిపివేశారని, అదే సమయంలో రాజా పరారయ్యారని పోలీసులు భావిస్తున్నారు.

రాజా చైర్మన్‌గా ఉన్న సమయంలో బినామీ పేర్లతో డీసీసీబీ బ్రాంచిలు, పలు సహకార సంఘాల నుంచి కోట్లు రుణాలు స్వాహా చేశారని సహకార చట్టం 51 ప్రకారం జరిపిన విచారణలో ప్రాథమికంగా నిర్థారణ అయింది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం ఈ కుంభకోణం నిగ్గు తేల్చేందుకు కేసును సీఐడీకి అప్పగించింది. మరోపక్క ప్రత్తిపాడు డీసీసీబీ బ్రాంచి పరిధిలోని ధర్మవరం సొసైటీలో రైతుల క్రాప్‌ ఇన్సూ్యరెన్స్‌ నిధులు సుమారు రూ.45 లక్షలు గోల్‌మాల్‌ అయ్యాయంటూ పలువురు రైతులు ఫిర్యాదు చేశారు. దీంతో సీఐడీ రంగంలోకి దిగింది. ఈ కేసులో కొంతకాలంగా రాజా తప్పించుకు తిరుగుతున్నారు. రాజా ఇంటిలో ఉన్నారన్న కచ్చితమైన సమాచారంతో శుక్రవారం సీఐడీ ఏఎస్పీ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో ఇద్దరు డీఎస్పీలు, పలువురు సీఐలు, ఎస్‌ఐలు ప్రత్తిపాడులోని రాజా ఇంటికి వెళ్లారు. ఇంటి చుట్టూ పోలీసులను మోహరించారు.

ఈ విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ నేతలు, శ్రేణులు రాజా ఇంటి వద్దకు చేరుకున్నారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు నవీన్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే ఎస్‌విఎస్‌ వర్మ, తుని టీడీపీ ఇన్‌చార్జి యనమల కృష్ణుడు ఆధ్వర్యంలో పార్టీ నేతలు రాజా తదితరులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఎటువంటి నోటీసు ఇవ్వకుండా ఎలా అరెస్టు చేస్తారంటూ వాదించారు. గతంలో ఉన్న డీసీసీబీ పెండింగ్‌ కేసుల్లో నోటీసు ఇచ్చినా తప్పించుకు తిరుగుతుండటం వల్లే నేరుగా అరెస్టుకు వచ్చామని సీఐడీ పోలీసులు చెప్పినా వినలేదు. అరెస్టు చేయడానికి వీల్లేదంటూ గొడవ చేశారు. తలుపులు వేసుకుని ఇంటిలో ఉన్న రాజాను బయటకు తీసుకువచ్చేందుకు సీఐడీ డీఎస్పీలు రామకృష్ణ, జి.రమేష్‌బాబు, సీఐలు ప్రయత్నించారు.

లొంగిపోవాలని పదేపదే విజ్ఞప్తి చేశారు. ఇంతలో టీడీపీ నేతలు బయట పోలీసులతో సంప్రదింపులంటూ హైడ్రామా నిర్వహించారు. 8.30 గంటల సమయంలో రాజా ఇంటిలోకి సీఐడీ పోలీసులు ప్రవేశించారు. మహిళా పోలీసులు ఇంటిలో ఉన్న రాజా తల్లి వరుపుల సత్యవతి, మేనకోడలు కొమ్ముల వాణిని ప్రశ్నించారు. గదులు అన్నింటినీ వెతికి ఇంటిలో రాజా లేకపోవడంతో పోలీసులు బయటకు వచ్చేశారు. అంతకంటే ముందుగా మూడు నిమిషాలు విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడం, ఇంటి బయట టీడీపీ నేతలు పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం వంటి నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. విద్యుత్‌ సరఫరా నిలిచిపోయిన సమయంలోనే రాజా తమ కళ్లుగప్పి పరారైనట్టుగా పోలీసులు నిర్థారణకు వచ్చారు. రాజా పరారైన విషయాన్ని సీఐడీ రాజమహేంద్రవరం అదనపు ఎస్పీ గోపాలకృష్ణ ధృవీకరించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top