టీటీడీ నిధులతో నిర్మాణాలకు పెద్దపీట  | Sakshi
Sakshi News home page

టీటీడీ నిధులతో నిర్మాణాలకు పెద్దపీట 

Published Wed, Nov 15 2023 4:40 AM

Bhumana Karunakara Reddy TTD funded constructions - Sakshi

తిరుమల: టీటీడీ నిధులతో వివిధ నిర్మాణాలు చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నట్టు టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి వెల్లడించారు. మంగళవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. సమావేశంలో టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి, దేవ­దాయ శాఖ కమిషనర్‌ సత్యనారాయణ, జేఈవోలు సదాభార్గవి, వీరబ్రహ్మం, బోర్డు సభ్యులు హాజర­య్యారు. టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి మీడియాకు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. తిరుపతి సమీపంలోని పుదిపట్ల జంక్షన్‌ నుంచి వకుళమాత ఆలయం వద్ద జాతీయ రహదారి వరకు నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణానికి రూ.21.10 కోట్లతో టెండర్‌ ఆమోదం. ఇది పూర్తయితే తిరుపతికి పూర్తిగా ఔటర్‌ రింగ్‌ రోడ్డు ఏర్పడుతుంది. 

► ఎస్వీ ఆయుర్వేద ఆస్పత్రిలో రోగులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు రూ.1.65 కోట్లతో గ్రౌండ్‌ ఫ్లోర్‌ అభివృద్ధి పనులకు టెండర్‌ ఆమోదం. 
► తిరుపతిలో శ్రీ పద్మావతి చిన్నపిల్లల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి రుయా ఆస్పత్రిలో నూతన టీబీ వార్డు నిర్మాణానికి రూ.1.79 కోట్లతో టెండర్‌ ఆమోదం. 
► స్విమ్స్‌ ఆస్పత్రిలో మరింత మంది రోగుల సౌకర్యం కోసం రూ.3.35 కోట్లతో ప్రస్తుతం ఉన్న భవనంపై మరో రెండు అంతస్తుల నిర్మాణానికి టెండరు ఆమోదం. 
► స్విమ్స్‌లో నూతన కార్డియో న్యూరో బ్లాక్‌ నిర్మాణానికి రూ.74.24 కోట్లతో టెండర్‌ ఖరారు. 
► స్విమ్స్‌ ఆస్పత్రి భవనాల ఆధునికీకరణకు, పునర్నిర్మాణానికి రూ.197 కోట్లతో చేపట్టే పనులకు పరిపాలనా అనుమతికి ఆమోదం. మూడేళ్లలో దశలవారీగా చేపట్టేందుకు నిర్ణయం. 
► నడక దారుల్లో భక్తుల భద్రత కోసం డిజిటల్‌ కెమెరా ట్రాప్‌లు, వైల్డ్‌ లైఫ్‌ మానిటరింగ్‌ సెల్, కంట్రోల్‌ రూమ్‌కు అవసరమైన పరికరాల కొనుగోలుకు రూ.3.5 కోట్ల మంజూరుకు ఆమోదం. 
► కరీంనగర్‌లో శ్రీ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి రూ.15.54 కోట్ల పనులకు టెండర్‌ ఆమోదం. 
 
23న విశేష హోమం 
► శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ఈ నెల 23న అలిపిరి వద్దగల సప్తగోప్రదక్షిణ మందిరంలో ప్రారంభం. ఇందుకోసం టికెట్‌ ధర రూ.1000గా నిర్ణయం. ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్‌లో టికెట్లు కేటాయిస్తారు. ప్రత్యక్షంగా, వర్చువల్‌గా పాల్గొనవచ్చు. ఈనెల 16న టీటీడీ ఆన్‌లైన్‌లో టికెట్లు విడుదల చేస్తారు. 
► టీటీడీలో కాంట్రాక్ట్‌ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వ జీవో 114 విధివిధానాలకు లోబడి టీటీడీలో అమలుకు నిర్ణయం.  
► తిరుపతిలోని ఎస్వీ శిల్ప కళాశాలలో సంప్రదాయ కలంకారీ, శిల్పకళలో ప్రాథమిక శిక్షణ సాయంకాలం కోర్సులు ప్రవేశపెట్టాలని నిర్ణయం.   

Advertisement
Advertisement