గుండెకు నిబ్బరం! రూపాయి ఖర్చు లేకుండా చికిత్స.. బైపాస్‌ సర్జరీ కూడా.. | Sakshi
Sakshi News home page

గుండెకు నిబ్బరం! రూపాయి ఖర్చు లేకుండా చికిత్స.. బైపాస్‌ సర్జరీ కూడా..

Published Sat, Jul 8 2023 4:00 AM

Better medical services with Dr YSR Arogyasree scheme - Sakshi

సాక్షి, అమరావతి:  గుండె జబ్బుల బారిన పడ్డ పేద, మధ్యతరగతి కుటుంబాలకు డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం కొండంత అండగా నిలుస్తోంది. చేతి నుంచి ఒక్క రూపాయి ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి. మన రాష్ట్రంతోపాటు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లోని కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో సైతం హృద్రోగ బాధితులకు ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచిత వైద్యసేవలు అందుతున్నాయి. 

1.71 లక్షల మందికి వైద్యం
2019 నుంచి 1,71,829 మంది గుండె సంబంధిత జబ్బుల బాధితులు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్య సేవలు పొందారు. బైపాస్‌ సర్జరీలు, స్టెంట్లు..యాంజియోగ్రామ్, గుండె మార్పిడి సహా వివిధ చికిత్సలను పథకం కింద ఉచితంగా నిర్వహిస్తున్నారు. హృద్రోగ బాధితులకు వైద్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.695.15 కోట్లు ఖర్చు చేసింది. మరోవైపు శస్త్ర చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకునే సమయంలో వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా కింద ఆర్థిక సాయాన్ని కూడా అందించింది. 

నాలుగేళ్లలో 40 లక్షల మందికి ఉచిత వైద్యం
కేవలం హృద్రోగ చికిత్సలే కాకుండా పలు రకాల ఆరోగ్య సమస్యలకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్యం అందుతోంది. టీడీపీ హయాంలో నిర్వీర్యమైన ఆరోగ్యశ్రీ పథకానికి ఊపిరిలూదుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న చర్యలతో పేద, మధ్యతరగతి ప్రజలకు భారీ మేలు చేకూరుతోంది. పొరుగు రాష్ట్రాల్లోని పెద్ద పెద్ద కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో సైతం ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చికిత్స అందుతోంది.

వైద్యం పొందిన అనంతరం చిరునవ్వుతో ఇంటికి తిరిగొస్తున్నారు. గత సర్కారు హయాంలో పేదలకు ఏదైనా పెద్ద జబ్బు చేస్తే తల తాకట్టు పెట్టడం మినహా గత్యంతరం లేని దుస్థితి. దేవుడిపై భారం వేసి రోజులు లెక్కపెట్టుకోవాల్సిన దయనీయ పరిస్థితులు నాడు నెలకొన్నాయి. ఈ అవస్థలకు తెరదించుతూ ఆరోగ్యశ్రీలో ప్రొసీజర్లను 3,257కి పెంచి  ఉచిత వైద్య సేవలను సీఎం జగన్‌ అందుబాటులోకి తెచ్చారు.

ఆరోగ్యశ్రీకి గత సర్కారు బకాయిపెట్టిన రూ.630 కోట్లను చెల్లించడంతోపాటు ప్రభుత్వ వైద్య రంగాన్ని అన్ని సదుపాయాలతో బలోపేతం చేశారు. దీంతో సగటున రోజుకు 3,300 మంది నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో ఉచిత చికిత్సలు పొందుతున్నారు. ఆరోగ్యశ్రీ పథకం కోసం గత నాలుగేళ్లలో ప్రభుత్వం ఏకంగా రూ.9,025 కోట్లు ఖర్చు చేయగా దాదాపు 40 లక్షల మంది వైద్య సేవలు పొందారు.

రూపాయి ఖర్చు లేకుండా బైపాస్‌ 
రక్త నాళాలు దెబ్బతినడంతో బైపాస్‌ సర్జరీ చేయాలని వైద్యులు చెప్పారు. నిరుపేద కుటుంబం కావడంతో నాకు అంత స్థోమత లేదు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా సర్జరీ చేశారు. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నా. ప్రభుత్వం చేసిన మేలు ఈ జన్మలో మరువలేను.   – దొంతాల రాఘవయ్య, మామడూరు, నెల్లూరు జిల్లా 

ఆపద్బాంధవిలా ఆదుకుంది
గుండె రక్తనాళాలు దెబ్బ తినడంతో బైపాస్‌ సర్జరీ చేయాలని వైద్యులు నిర్థారించారు. ఆ సమయంలో ఆరోగ్యశ్రీ ఆపద్బాంధవిలా ఆదుకుంది. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా గత నెల 26న సర్జరీ జరిగింది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యా. కోలుకునే సమయంలో వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా ద్వారా ఆర్థిక సాయం అందుతుందని చెప్పారు. సీఎం జగన్‌ ప్రభుత్వం చేసిన మేలును ఈ జన్మకు మరువలేను.   – కొరివి కిశోర్, గుంటూరు

పెద్ద జబ్బులకు సైతం..
గుండె, కాలేయం, కిడ్నీ, క్యాన్సర్‌ సంబంధిత పెద్ద జబ్బులకు సైతం చికిత్సలు ఆరోగ్యశ్రీ పథకం పరిధిలో ఉన్నాయి. ప్రొసీజర్ల సంఖ్య భారీగా పెరిగాయి. వైద్యం కోసం ప్రజలు ఆర్థికంగా చితికిపోకూడదనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీకి అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. – హరేంధిరప్రసాద్, సీఈవో, వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ 
 

ఆరోగ్యశ్రీ ద్వారా హృద్రోగ చికిత్సలు ఇలా
సంవత్సరం రోగులు   ప్రొసీజర్లు  వ్యయం రూ.కోట్లలో
2019–2020    23,797    24,027    79.69    
2020–2021    24,243    24,599    77.06    
2021–2022    36,725    37,646    116.09    
2022–2023    65,813    85,558    301.82    
2023–2024     21,251    32,208    120.49    
(ఇప్పటి వరకూ)
మొత్తం        1,71,829     2,04,038  695.15    

అన్నదాతకు ప్రాణదాత
వ్యవసాయదారుడైన చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన కృష్ణారెడ్డి హృద్రోగం బారిన పడటంతో ఆ కుటుంబానికి గుండె ఆగినంత పనైంది! గుండె మార్పిడి శస్త్ర చికిత్స  ఖర్చును భరించే స్థోమత లేకపోవడంతో ఏం చేయాలో పాలుపోలేదు.

వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా గుండె ఆపరేషన్‌ చేస్తారని స్థానిక ఏఎన్‌ఎం చెప్పడంతో 2021 ఏప్రిల్‌లో బెంగళూరులోని నెట్‌వర్క్‌ ఆస్పత్రిని సంప్రదించారు. మైసూర్‌లో బ్రెయిన్‌ డెడ్‌ అయిన ఓ వ్యక్తి గుండెను కృష్ణారెడ్డికి అమర్చి ట్రాన్స్‌ప్లాంట్‌ సర్జరీ చేశారు. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.11 లక్షలు చెల్లించి ఆ కుటుంబ పెద్దకు రాష్ట్ర ప్రభుత్వం పునర్జన్మ ప్రసాదించింది.

‘నేను ఇవాళ ప్రాణాలతో ఉన్నానంటే ఆరోగ్యశ్రీనే కారణం. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా గుండె మార్పిడి ఆపరేషన్‌ చేశారు. కోలుకునే సమయంలో వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా కింద డబ్బులు కూడా అందచేశారు’ అని కృష్ణారెడ్డి చేతులు జోడించి చెబుతున్నారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement