
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రజక, నాయీబ్రాహ్మణ, దర్జీల సంక్షేమం కోసం వరుసగా రెండో ఏడాది ‘జగనన్న చేదోడు’ పథకం కింద రూ. 285.35 కోట్ల నగదు విడుదల చేశారు. 2,85,350 మంది లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో రూ. 285.35 కోట్ల నగదును సీఎం వైఎస్ జగన్ జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని అన్నారు. జగనన్న చేదోడు కింద 2.85 లక్షల మందికి సాయం చేశామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడు చెందిన టైలరింగ్ వృత్తి చేసుకుంటున్న తిరుమలశెట్టి వెంకటరమణమ్మ మాట్లాడుతూ.. తాను గత ఆరేళ్లుగా టైలరింగ్ సెంటర్‌ను నడుపుతున్నానని, తన వద్ద ముగ్గురు పనిచేస్తున్నారని తెలిపారు. తమ వృత్తికి ఎంతో అవసరమైన ‘జగనన్న చేదోడు’ పథకం కింద ఆర్థిక సాయం అందిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటివరకు తమకు ఏ ప్రభుత్వం నుంచి ఆర్ధిక సాయం అందలేదని చెప్పారు. గత ఏడాది జగనన్న చేదోడు పథకం కింద రూ. 10 వేలు ఆర్థిక సాయం అందిందని, ప్రతీ ఏడాది రూ.10 వేలు చొప్పున ఐదేళ్లకు రూ.50 వేలు అందిస్తూ తమ వ్యాపార, కుటుంబ అభివృద్ధికి సాయం చేస్తున్నందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.
మొదటి విడుతలో వచ్చిన నగదు కరోనా కష్టకాలంలో ఉపయోగపడిందని తెలిపారు. రెండో విడుతలో కూడా రూ.10 వేలు ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఈ డబ్బుతో టైలరింగ్ వ్యాపారం చేసుకుంటూ తన వద్ద పనిచేసేవారికి ఉపాధి కల్పించాడనికి అవకాశం ఇచ్చినందుకు ఆనందంగా ఉందన్నారు. సీఎం వైఎస్ జగన్ తీసువచ్చిన అన్ని పథకాలు తమకు అందుతున్నాయని చెప్పారు. డైరెక్ట్‌గా తమ ఇళ్ల వద్దకు అన్ని పథకాలు అందడానికి ప్రవేశపెట్టిన సచివాలయం వ్యవస్థకుగాను సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మీరు(సీఎం జగన్) ప్రవేశపెట్టిన పథకాలు కాకుండా మరో విషయం తనను కదిలించిందని.. నిన్న, నేడు, రేపు ఎప్పుడు తమ సేవకునిలా ఉంటానని సీఎం అన్న విషయాన్ని గుర్తుచేశారు. అంతకన్న ఎక్కువ సీఎం జగన్ తమకు దేవుడు ఇచ్చిన అన్న అని వెంకటరమణమ్మ తెలిపారు.
కర్పూలు జిల్లా నుంచి నాయీబ్రాహ్మణ సేవా సంఘం టౌన్ ప్రెసిడెండ్ స్వామి చంద్రుడు మాట్లాడుతూ.. గత ఏడాది జగనన్న చేదోడు కింద రూ.10 వేల సాయం అందింది. ఈ రోజు రెండో ఏడాదికిగాను రూ. 10 వేల సాయం అందినట్లు చెప్పారు. నాయీబ్రాహ్మణలకు ఇచ్చిన హామీల్లో భాగంగా ప్రముఖ దేవాలయాల్లో స్థానం, నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించినందుకు సీఎం వైఎస్ జగన్‌కు.. స్వామి చంద్రుడు కృతజ్ఞతలు తెలిపారు.