
రోజులో 14 గంటలపాటు బార్లు తెరిచే ఉంటాయి
టీడీపీ మద్యం సిండికేట్ దోపిడీకి బాబు సర్కారు వత్తాసు
బార్ల లైసెన్సుల కోసం నోటిఫికేషన్ జారీ
ఈ నెల 26 వరకు దరఖాస్తుల స్వీకరణ
28న లైసెన్సుల కేటాయింపు
సాక్షి, అమరావతి: టీడీపీ మద్యం సిండికేట్ సాగిస్తున్న అడ్డగోలు దోపిడీకి చంద్రబాబు ప్రభుత్వం బార్ల తలుపులు బార్లా తెరచింది. రాష్ట్రంలో బార్లు తెరిచి ఉంచే వేళలను మరో రెండు గంటలపాటు పెంచింది. అంటే అనధికారికంగా మరో నాలుగు గంటలు బార్లు తెరచి ఉంచినా పట్టించుకోబోమని స్పష్టమైన సంకేతం ఇచి్చంది. మరోవైపు టీడీపీ సిండికేట్‌కు బార్లు ఏకపక్షంగా కట్టబెట్టేందుకు రెస్టారెంట్ నిబంధనలను సడలించింది.
దరఖాస్తు చేసేనాటికి రెస్టారెంట్ లేకపోయినా పర్వాలేదని నిబంధనల్లో పేర్కొంది. రాష్ట్ర మంత్రివర్గం తీర్మానాన్ని అనుసరించి సెప్టెంబర్ 1 నుంచి అమలులోకి రానున్న కొత్త బార్ విధానాన్ని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో 840 బార్ల లైసెన్సుల జారీకి సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ నిషాంత్‌కుమార్ మంగళగిరిలో సోమవారం మీడియా సమావేశంలో నూతన బార్ విధానాలను వెల్లడించారు.
ఉదయం నుంచి అర్ధరాత్రి వరకూ..
ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం.. బార్లు తెరిచి ఉంచే సమయాన్ని ఉదయం 10 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ప్రభుత్వం పొడిగించింది. అంటే 24 గంటల్లో 14 గంటలపాటు బార్లు తెరచి ఉంటాయి. తద్వారా ఉదయం నుంచి అర్ధరాత్రి దాటే వరకు బార్లు బార్లా తెరిచే ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. వైఎస్సార్‌సీపీ హయాంలో బార్లు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు పనిచేశాయి.
⇒ కల్లు గీత కుటుంబాలకు కేటాయించిన 10 శాతం బార్లకు లైసెన్సు ఫీజు 50శాతం తక్కువగా నిర్ణయించారు.
⇒ మూడేళ్లపాటు బార్ల లైసెన్సుల కోసం దరఖాస్తులు సోమవారం నుంచి ఈ నెల 26 సాయంత్రం 5గంటల వరకు స్వీకరిస్తారు. నేరుగా గానీ ఆన్‌లైన్ ద్వారాగానీ దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.5లక్షలు.
⇒ ఇప్పటివరకు రెస్టారెంట్ ఉన్నవారే బార్ల లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలనే నిబంధన ఉంది. ఈ నిబంధనలో టీడీపీ కూటమి ప్రభుత్వం సడలింపునిచ్చింది. బార్ లైసెన్సు పొందిన తరువాత 15 రోజుల్లో రెస్టారెంట్ ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. 28న లాటరీ విధానంలో బార్ల లైసెన్సులు కేటాయిస్తారు.
⇒ పట్టణాలు, నగరాల్లో జనాభా ప్రాతిపదికన బార్ల లైసెన్సు ఫీజు నిర్ణయించారు. 50 వేల జనాభా ఉన్న పట్టణాలకు రూ.35 లక్షలు, జనాభా 50 వేలు నుంచి 5 లక్షలలోపు ఉంటే రూ.55 లక్షలు, జనాభా 55 లక్షలు పైబడి ఉంటే రూ.75 లక్షలు లైసెన్స్ ఫీజు చెల్లించాలి.
⇒ ఇప్పటివరకు లైసెన్స్ ఫీజును ఒకేసారి చెల్లించాలనే నిబంధన ఉంది. ఆ నిబంధనను సడలిస్తూ ఆరు వాయిదాల్లో లైసెన్స్ ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు.