ఉచిత విద్యుత్‌కు పూర్తి భరోసా

Balineni Srinivasareddy review with superiors on Electricity - Sakshi

వ్యవసాయానికి పగటిపూటే 9 గంటల నాణ్యమైన కరెంట్‌

వ్యవసాయం, అనుబంధ రంగాల డిమాండ్‌ అంచనా 19,819 ఎంయూలు

అందుకనుగుణంగా విద్యుత్‌ సంస్థల కార్యాచరణ

ఉన్నతాధికారులతో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సమీక్ష

సాక్షి, అమరావతి: వేసవిలో విద్యుత్‌ డిమాండ్‌ పెరగనున్న దృష్ట్యా వ్యవసాయానికి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్‌ అందించేలా చర్యలు తీసుకోవాలని డిస్కమ్‌లను ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి  ఆదేశించారు.  వ్యవసాయానికి విద్యుత్‌ సరఫరాపై విద్యుత్‌ సంస్థల ఉన్నతాధికారులతో ఆదివారం ఆయన సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ ఉచిత విద్యుత్‌ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.7,714 కోట్ల సబ్సిడీని అందిస్తోందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 18 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు 6,663 ఫీడర్ల ద్వారా ఉచిత విద్యుత్‌ సరఫరా చేస్తున్నామన్నారు.

విద్యుత్‌ వినియోగదారులకు నిరంతరాయంగా విద్యుత్‌ అందించేందుకు కృషి చేస్తూనే వ్యవసాయానికి 9 గంటలు పగటిపూట కరెంట్‌ సరఫరాకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. కాగా, వ్యవసాయం, అనుబంధ రంగాలకు 2021–22లో 19,096 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ డిమాండ్‌ ఉండగా 2022–23లో 19,819 ఎంయూలకు చేరుకునే వీలుందని అంచనా వేస్తున్నట్లు విద్యుత్‌శాఖ అధికారులు మంత్రికి తెలిపారు.

ఈ ఏడాది 3.7% మేర విద్యుత్‌ వినియోగం పెరగనుందని చెప్పారు. వ్యవసాయ అవసరాలకు అనుగుణంగా విద్యుత్‌ డిమాండ్‌ను తీర్చేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు దక్షిణ, మధ్య, తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థల సీఎండీలు హరనాథరావు, పద్మ జనార్దనరెడ్డి, సంతోషరావు చెప్పారు. విద్యుత్‌ లోడ్, కచ్చితమైన వినియోగాన్ని అంచనా వేసేందుకు వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్‌లకు ఏడాదిలోగా మీటర్లు అమర్చేలా కృషి చేస్తున్నట్లు సీఎండీలు పేర్కొన్నారు. విద్యుత్‌ మోటార్లు కాలిపోవడం, లోవోల్టేజీ లాంటి సమస్యలను అరికట్టి రైతులకు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేసేందుకు ఉపకరిస్తుందన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top