‘సెకీ’ విద్యుత్‌తో లాభమే

Balineni Srinivasa Reddy comments on Solar Energy Corporation of India Solar power - Sakshi

ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వెల్లడి

రైతులకు 25 ఏళ్ల పాటు ఉచితంగా విద్యుత్‌

18 లక్షల వ్యవసాయ విద్యుత్‌ సర్వీసులకు 9 గంటలు సరఫరా

టీడీపీ హయాంలో సోలార్‌ విద్యుత్‌ యూనిట్‌కు రూ.6.99

పవన విద్యుత్‌ యూనిట్‌కు రూ.4.84 చొప్పున అధిక ధర

ఇప్పుడు యూనిట్‌ రూ.2.49కే ఇస్తున్న సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా  

సాక్షి, అమరావతి: సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఈసీఐ–సెకీ) నుంచి రాష్ట్ర ప్రభుత్వం 7 వేల మెగావాట్ల సోలార్‌ పవర్‌ను రైతుల కోసం కొనుగోలు చేస్తుందని ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. 2024 నుండి 25 ఏళ్ల పాటు రాష్ట్రంలో 18 లక్షల మంది రైతులకు పగటి పూట 9 గంటల పాటు ఉచిత విద్యుత్‌ను ప్రత్యేక డిస్కమ్‌ ద్వారా అందిస్తుందని తెలిపారు. సెకీ నుంచి విద్యుత్‌ తీసుకోవడం అత్యంత లాభదాయకమని, ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు అర్థం లేనివని మంత్రి వివరించారు. టీడీపీ హయాంలోనే అనవసరంగా అధిక ధరకు సౌర, పవన విద్యుత్‌ కొనుగోలు చేశారని గుర్తు చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

ఉచిత విద్యుత్‌ కోసం ట్రాన్స్‌కో, డిస్కంలు గత రెండేళ్లలో రూ.3,762 కోట్ల విలువైన నెట్‌వర్క్‌ను పెంచుకున్నాయని, డిమాండ్‌ను పెంచడానికి 20 కొత్త ట్రాన్స్‌కో సబ్‌స్టేషన్‌లు, 162 కొత్త డిస్కం సబ్‌స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన సెకీ.. టెండర్‌ ధర ప్రకారం యూనిట్‌ ధర రూ.2.49 ఉంటుందన్నారు. రెగ్యులేటరీ కమిషన్‌ ద్వారా విద్యుత్‌ చట్టం ప్రకారం టారిఫ్‌ నిర్ణయిస్తారని తెలిపారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో సోలార్‌కు యూనిట్‌కు రూ.6.99, పవన విద్యుత్‌ యూనిట్‌కు రూ.4.84 వరకు అధిక ధర చెల్లించి కొనుగోలు చేసినట్లు పవర్‌ పర్చేజ్‌ అగ్రిమెంట్ల (పీపీఏ)లో స్పష్టంగా ఉందన్నారు. నిజానికి 2016లో టీడీపీ ప్రభుత్వం ఇదే సెకీ నుంచి యూనిట్‌కు రూ.4.57 (గాలివీడు)తో 400 మెగావాట్లు, మైలవరంలో యూనిట్‌కు రూ.2.77 చొప్పున మరో 750 మెగావాట్లు కొనుగోలు చేసిందని మంత్రి పేర్కొన్నారు. 

డిస్కంలపై భారం ఉండదు
సెకీ నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేయడం ద్వారా ప్రస్తుత డిస్కంలపై భారం పడదని, అన్ని ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేయడంతో పోలిస్తే 25 ఏళ్ల పాటు ఇంటర్‌ స్టేట్‌ ట్రాన్స్‌మిషన్‌ చార్జీల నుంచి మినహాయింపు వస్తుందని, అదే ఇక్కడైతే సెంట్రల్‌ గ్రిడ్‌ చార్జీలు 25 ఏళ్లు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ప్రాజెక్టును రాష్ట్రం వెలుపల ఏర్పాటు చేస్తే, విద్యుత్‌ సరఫరాకు సబ్‌స్టేషన్లు తదితరాల ఖర్చును రాష్ట్రం భరించాల్సిన అవసరం లేదన్నారు.

రాష్ట్రం వెలుపల నుంచి వచ్చే విద్యుత్‌కు కేంద్రం సెంట్రల్‌ గ్రిడ్‌ చార్జీలను మినహాయిస్తోందన్నారు. కర్నూలు, అనంతపురం ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తే, మొదట సెంట్రల్‌ గ్రిడ్‌ను ఉపయోగించి తమిళనాడు, కర్ణాటకకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 10,000 మె.వా. ప్రాజెక్ట్‌ కోసం కేటాయించిన మొత్తం భూమి ఇతర ప్రయోజనాల కోసం రాష్ట్రం వద్ద ఉందన్నారు. చంద్రబాబు ప్రారంభించిన థర్మల్‌ ప్లాంట్లు ఏవీ లేవని, ఆయన హయాంలో కృష్ణపట్నం ఖర్చు మెగావాట్‌కు రూ.5.5 నుంచి రూ.9.3కి పెరిగిందని మంత్రి వివరించారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top