Tiger Prawns: టైగర్‌.. సరికొత్తగా..!

Aqua Farmers Interest To Growing Tiger Prawns In AP - Sakshi

అమెరికా నుంచి దిగుమతవుతున్న సరికొత్త బ్రూడర్స్‌ 

నకిలీ సీడ్‌పై నిఘా.. హేచరీల్లో విస్తృత తనిఖీలు

అంతర్జాతీయ ఆక్వా మార్కెట్‌లో రారాజుగా నిలిచి దాదాపు దశాబ్దానికి పైగా డాలర్ల వర్షం కురిపించిన టైగర్‌ రొయ్య తిరిగొస్తోంది. గతంలో వివిధ రకాల వైరస్‌లు చుట్టుముట్టడంతో ఆక్వా సాగులో అవి అంతర్ధానమయ్యాయి. తాజాగా టైగర్‌ రొయ్యల సాగు ప్రభ మళ్లీ ప్రారంభం కానుంది. టైగర్‌ సరికొత్త బ్రూడర్‌తో పునరాగమనంతో రైతుల్లో ఆశలు మోసులు ఎత్తుతున్నాయి. వెనామీకి ప్రత్యామ్నాయంగా ప్రకాశం జిల్లాలోని ఆక్వా రైతులు టైగర్‌ సాగు వైపు అడుగులు వేస్తున్నారు. నకిలీలపై దృష్టిసారించిన అధికార యంత్రాంగం హేచరీల్లో విస్తృత తనిఖీలు చేపట్టేందుకు ఎక్కడికక్కడ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది.

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: టైగర్‌ అంటే ఆక్వా రంగంలో రారాజు... నీలి విప్లవానికి నాంది. అంతర్జాతీయ మార్కెట్‌లో టైగర్‌ రొయ్యకు మంచి గిరాకీ ఉంది. కేవలం ఎగుమతి కోసమే ఉత్పత్తి చేసే టైగర్‌ రొయ్య పేరు రెండు దశాబ్దాల పాటు వినపడకుండా పోయింది. 1990 తరువాత వివిధ రకాల వైరస్‌లు సోకటంతో కనుమరుగైంది. ఆ తరువాత వెనామీదే రాజ్యం. తాజాగా వెనామీ కూడా వైరస్‌లా బారిపడి రైతులకు నష్టాలు తెచ్చిపెడుతోంది.

ప్రస్తుతం ఎన్నో అధునాతన ప్రయోగాలు, పరిశోధనలతో వైరస్‌కు ఎలాంటి తావులేకుండా ఉండే సరికొత్త టైగర్‌ బ్రూడర్స్‌ను దేశానికి దిగుమతి చేసుకుంటున్నారు. ఆ బ్రూడర్స్‌ ద్వారా సీడ్‌ను ఉత్పత్తి చేసి ఆక్వా సాగు చేసే రైతులకు అందజేస్తున్నారు. దీంతో తిరిగి వెనామీకి ప్రత్యామ్నాయంగా టైగర్‌ రొయ్య పూర్వ వైభవాన్ని సంతరించుకోనుంది.  

నకిలీకి తావులేకుండా నిఘా.. 
టైగర్‌ రొయ్యల సాగు తిరిగి ప్రారంభం కానుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. నకిలీ టైగర్‌ రొయ్యల సీడ్‌ బారిన పడకుండా ఆక్వా రైతులను కాపాడటానికి తనిఖీలను ఇప్పటికే ముమ్మరం చేసింది. టైగర్‌ సీడ్‌ ముసుగులో వెనామీ రొయ్య పిల్లలను రైతులకు అంటగట్టకుండా హేచరీలపై ప్రత్యేక నిఘా పెట్టింది. ప్రత్యేకంగా అధికారులతో కూడిన బృందాలను ఏర్పాటు చేసింది.

జిల్లాలోని 41 హేచరీలపై కోస్టల్‌ ఆక్వా కల్చర్‌ అథారిటీ (సీఏఏ), జిల్లా మత్స్య శాఖ అధికారులు సంయుక్తంగా ఇటీవల దాడులు నిర్వహించారు. ఈతముక్కల గ్రామంలో ఒక హేచరీ నుంచి నకిలీ టైగర్‌ సీడ్‌ బయటకు వచ్చిందని సమాచారం రావటంతో అధికారులు తనిఖీలు చేసి దానిని మూసివేశారు. టైగర్‌ సీడ్‌ పేరుతో మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు.

దక్షిణ భారతదేశంలో రెండు హేచరీలకు అనుమతి.. 
టైగర్‌ రొయ్యల సీడ్‌ ఉత్పత్తికి దక్షిణ భారతదేశంలో రెండు హేచరీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతిచ్చాయి. సరికొత్త బ్రూడర్‌తో సీడ్‌ను ఉత్పత్తి చేయటానికి తమిళనాడు చెంగల్‌పట్టులోని హేచరీ, నెల్లూరు జిల్లాలోని వైష్ణవి హేచరీలకు మాత్రమే అనుమతులిచ్చాయి. ఈ రెండు హేచరీలు సరికొత్త బ్రూడర్లను విదేశాల నుంచి దిగుమతి చేసుకొని సీడును ఉత్పత్తి చేస్తున్నాయి. అమెరికా నుంచి సరికొత్త బ్రూడర్స్‌ను దిగుమతి చేసుకొని కొన్ని రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచి అనేక పరీక్షల తరువాత అనుకూలంగా ఉంటేనే వాటి నుంచి సీడ్‌ ఉత్పత్తి చేస్తున్నారు.

జిల్లాలో సాగు చేయాలనుకునే వారు నేరుగా ఈ రెండు హేచరీల నుంచి మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉంది. అక్కడ నుంచి తీసుకొచ్చిన సీడ్‌ నేరుగా సాగు చేస్తున్న చెరువుల్లోనే వెయ్యాలి. వాటిని తీసుకొచ్చి స్థానికంగా ఉండే హేచరీలలో వెనామీ సీడ్‌తో కలిపి మొత్తం టైగర్‌ సీడేనని రైతులను మోసం చేయాలని చూసే వారిపై క్రిమినల్‌ చర్యలకు కూడా ప్రభుత్వం వెనకాడకుండా ఉండేలా అధికారులకు ఆదేశాలు వచ్చాయి.

స్టేక్‌ హోల్డర్స్‌కు అవగాహన.. 
ఆక్వాకల్చర్‌ భాగస్వాముల సమావేశాలు (స్టేక్‌ హోల్డర్స్‌) ఏర్పాటు చేసి మత్స్య శాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ఆక్వా రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం ఏపీ స్టేట్‌ ఆక్వా కల్చర్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఏపీఎస్‌ఏడీఏ) యాక్ట్‌ను తీసుకొచ్చింది. ఆక్వాకల్చర్‌ భాగస్వాములు అంటే రైతులతో పాటు,  ఫీడు, సీడు ఉత్పత్తిదారులు, హేచరీల యజమానులు, ట్రేడర్స్,ఎక్స్‌పోర్టర్లు, ప్రాసెసింగ్‌ ప్లాంట్ల యజమానులు దీనికిందకు వస్తారు.

ప్రతి ఒక్కరూ ప్రభుత్వ నిర్ణయాల ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే జిల్లా కేంద్రం ఒంగోలులో ఈ నెల 23న స్టేక్‌ హోల్డర్స్‌ సమావేశం నిర్వహించి నకిలీ టైగర్‌ రొయ్య సీడ్‌తో పాటు ఆక్వాకు సంబంధించిన అన్ని అంశాలపై లోతుగా అధికారులు అవగాహన కల్పించారు.

నకిలీ సీడ్స్‌ సృష్టిస్తే కఠిన చర్యలు 
జిల్లాలో ఉన్న 41 హేచరీలపై ప్రత్యేక నిఘా ఉంటుంది. కోస్టల్‌ ఆక్వా కల్చర్‌ అథారిటీ (సీఏఏ) అధికారులు జిల్లా మత్స్య శాఖ అధికారులతో సమన్వయంతో ముందుకు సాగుతున్నారు. ఎప్పటికప్పుడు సీఏఏ అధికారులకు సమాచారం అందిస్తున్నాం. అనుమతి ఉన్న రెండు హేచరీల నుంచి తీసుకొచ్చిన టైగర్‌ సీడ్‌ నేరుగా సాగు చేస్తున్న చెరువుల్లోకే వెళ్లాలి. హేచరీలకు వెళ్లకూడదు.

అలా ఎవరైనా టైగర్‌ రొయ్య సీడ్‌ను తీసుకొచ్చి హేచరీల్లోని వెనామీ సీడ్‌తో కలిపి నకిలీగా సృష్టిస్తే క్రిమినల్‌ చర్యలకు కూడా వెనుకాడం. టైగర్‌ సీడ్‌ నకిలీ అన్న మాట ఏ ఒక్క ఆక్వా రైతు నోటి నుంచి రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం.
– ఆవుల చంద్ర శేఖర రెడ్డి, జాయింట్‌ డైరెక్టర్, జిల్లా మత్స్యశాఖ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top