టెంట్లతోనే రిసార్ట్స్‌ 

APTDC proposal to setup Resorts with tents in Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పర్యాటకులకు మెరుగైన వసతులు కల్పించడంతో పాటు తక్కువ ఖర్చుతో విలాసవంతమైన అనుభూతి అందించేందుకు పర్యాటక అభివృద్ధి సంస్థ(ఏపీటీడీసీ) చర్యలు చేపట్టింది. బీచ్‌లు, కొండ ప్రాంతాల్లో పర్యాటకులు బస చేసేందుకు వీలుగా ఎకో టెంట్‌ రిసార్టులను ఏర్పాటు చేయబోతోంది.

తొలి దశలో భాగంగా ఐదు ప్రాంతాలను ప్రతిపాదించింది. ఇందులో బాపట్ల జిల్లాలోని పెదగంజాం–నిజాంపట్నం బీచ్‌ కారిడార్, తిరుపతి జిల్లాలోని తుపిలిపాలెం, అనకాపల్లి జిల్లాలోని ముత్యాలంపాలెం, అందలాపల్లె బీచ్‌లతో పాటు అన్నమయ్య జిల్లాలోని మల్లయ్యకొండపై టెంట్‌ రిసార్టులను అందుబాటులోకి తేనుంది. 

ఒక్కో రిసార్ట్‌లో 20 టెంట్లు.. 
ప్రతి ఎకో రిసార్టులో 20 టెంట్‌ గదులతో పాటు అనుబంధంగా రెస్టారెంట్‌ ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో టెంట్‌ గదిలో బెడ్రూమ్‌కు అనుబంధంగా బాత్రూమ్, వరండా నిర్మిస్తారు. టెంట్‌లో ఒక కుటుంబం (ఇద్దరు పెద్దలు, ఇద్దరు పిల్లలు) విడిది చేసేలా తీర్చిదిద్దనున్నారు. ఏపీటీడీసీ వీటిని ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌(ఓఅండ్‌ఎం) కింద నిర్వహించనుంది.

ఔత్సాహిక వ్యాపారవేత్తల నుంచి ప్రతిపాదనలను ఆహ్వానించింది. భూమిని లీజు ప్రాతిపదికన అద్దెకిచ్చి.. అందులో ప్రైవేటు వ్యక్తులు స్వయంగా టెంట్‌ రిసార్టులు ఏర్పాటు చేసి, నిర్వహించేలా ఏపీటీడీసీ ప్రణాళికలు రూపొందించింది.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top