
జూన్ 30తోనే గడువు ముగిసినా పూర్తికాని ప్రక్రియ
ఏ జిల్లాలోనూ వ్యక్తిగతంగా అందని ఉత్తర్వులు..!
పాత తేదీతో బదిలీ చేసే అవకాశం: ఉద్యోగ సంఘాలు
చాలా కేటగిరీలకు కౌన్సెలింగ్ లేకుండా ఎమ్మెల్యేల సిఫార్సుతో నిర్ణయాలు
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీల ప్రక్రియ సోమవారంతో ముగిసినా ఎవరిని ఏ సచివాలయానికి బదిలీ చేశారన్న ఉత్తర్వులు ఏ జిల్లాలోనూ విడుదల కాలేదని సమాచారం. ఒకటీ అరా జిల్లాల్లో మత్స్య శాఖ సహాయకుల వంటి ఒకట్రెండు విభాగాల ఉద్యోగులకు సంబంధించి మూకుమ్మడి ఆదేశాలను సంబంధిత శాఖ ఉన్నతాధికారులు జారీ చేశారు. ఒకే సచివాలయంలో ఐదేళ్ల పాటు పని చేస్తున్న దాదాపు 72 వేల మంది గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులు ఈ విడత బదిలీ కాకతప్పని పరిస్థితి.
మొత్తం 13 శాఖల పరిధిలో ఒక్కో జిల్లాలో ఆయా విభాగాధిపతుల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 169 జిల్లా శాఖ విభాగాధిపతులు సచివాలయాల ఉద్యోగులకు కౌన్సెలింగ్ నిర్వహించి బదిలీల ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది. అయితే, దాదాపు 50 జిల్లా శాఖాధిపతులు బదిలీల ఆఖరి రోజు అయిన సోమవారం కౌన్సెలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. దాదాపు అన్ని జిల్లాల్లో సోమవారం సాయంత్రం వరకు సచివాలయ ఉద్యోగుల బదిలీల కౌన్సెలింగ్ జరిగిందని తెలిపారు. ఏ జిల్లాలోనూ వ్యక్తిగతంగా ఉత్తర్వులు అందలేదని ఉద్యోగ సంఘ నేతలు పేర్కొంటున్నారు. గడువు ముగియడంతో వచ్చే ఒకట్రెండు రోజులు పాత తేదీలతో బదిలీ ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉందని సచివాలయ ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది.
80 శాతం బదిలీలు ఎమ్మెల్యేలు చెప్పినట్టే
సచివాలయాల ఉద్యోగ బదిలీల ప్రక్రియలో అధికారులు ఎక్కడా నిబంధనలు పాటించలేదని సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. దాదాపు 80 శాతం బదిలీలు స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇచ్చిన జాబితా (ఎక్సెల్ షీట్లు) ప్రకారమే జరిగాయని పేర్కొంటున్నారు. ప్రభుత్వం ఇటీవల చేపట్టిన గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల రేషనలైజేషన్‌తో ఒక్కో సచివాలయంలో అంతకుముందు ఉన్న పోస్టులు దీర్ఘకాలం కొనసాగించే పరిస్థితి లేకుండా పోయింది. గతంలో ఒక్కో సచివాలయం పరిధిలో 10–11 మంది ఉద్యోగులు ఉండేవారు.
రేషనలైజేషన్ పేరుతో కూటమి సర్కారు సచివాలయ పరిధిలో జనాభా సంఖ్య ఆధారంగా 6–8 మంది చొప్పున ఉద్యోగులను దీర్ఘకాలం కొనసాగించేలా నిర్ణయించింది. ప్రస్తుత బదిలీలలో ఒక్కో సచివాలయంలో శాశ్వతంగా కొనసాగింపునకు నిర్ధారించిన పోస్టులను తొలి ప్రాధాన్యతగా తీసుకున్నారు. అప్పటికీ ఉద్యోగులు మిగిలితే ప్రభుత్వం తదుపరి ఆదేశాలు జారీ చేసేదాక ఏదో ఒక సచివాలయంలో సర్దుబాటు చేసేలా బదిలీ ప్రక్రియ ఉంటుందని గ్రామ వార్డు సచివాలయాల శాఖ పేర్కొంది. కచి్చతంగా బదిలీ అయ్యే ఉద్యోగుల సంఖ్య కన్నా రేషనలైజేషన్‌తో శాశ్వతంగా కొనసాగింపునకు నిర్ధారించిన పోస్టుల సంఖ్య తక్కువగా ఉండడం, ఆ పోస్టులకు పోటీ.. మరోపక్క ఎమ్మెల్యేల పైరవీలతో ప్రస్తుత బదిలీల్లో గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.