తెలంగాణ హైకోర్టు తీర్పు గుబులు.. ఆ 15 మంది ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారుల పరిస్థితేంటి? 

AP State Division: what is the situation of 15 IAS and IPS officers - Sakshi

సాక్షి, ప్రత్యేక ప్రతినిధి : రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించినందున ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు ఆ రాష్ట్రానికే వెళ్లాలని మంగళవారం తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఉన్నతాధికారుల్లో గుబులు రేపుతోంది. హైకోర్టు ఉత్తర్వులు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఈ తీర్పుతో మిగిలిన ఉన్నతాధికారులంతా విధిగా ఆయా రాష్ట్రాలకు తిరిగి వెళ్లాల్సిందేనా? అన్న చర్చ సాగుతోంది.

ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన సీనియర్‌ ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు తెలంగాణలో పని చేస్తుండగా.. తెలంగాణ రాష్ట్ర కేడర్‌కు కేటాయించిన వారు ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్నారు. రెండు రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం కేటాయించిన కేడర్‌లలో కాకుండా క్యాట్‌ ఉత్తర్వులతో కొనసాగుతున్న వారిలో 9 మంది ఐఏఎస్‌లు, ఆరుగురు ఐపీఎస్‌ అధికారులు ఉన్నారు. ఐపీఎస్‌లకు సంబంధించి ఇటీవలే తెలంగాణ ఇన్‌చార్జి డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన అంజనీకుమార్, అడిషనల్‌ డీజీపీ అభిలాష బిస్త్, అభిలాష్‌ మహంతిలు ఆంధ్ర కేడర్‌కు చెందిన అధికారులు కాగా.. తెలంగాణలో పనిచేస్తున్నారు.

మొన్నటివరకు ఏపీ కేడర్‌కు చెందిన సంతోష్‌ మెహ్రా తెలంగాణలో పనిచేసినా, ఈ మధ్యనే ఆయన ఏపీ కేడర్‌కు వెళ్లిపోయారు. కాగా తెలంగాణకు కేడర్‌కు కేటాయించిన మనీష్‌కుమార్‌ సింగ్, అమిత్‌గార్గ్, అతుల్‌ సింగ్‌లు ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్నారు. ఇక ఈ విధంగా ఐఏఎస్‌ అధికారుల్లో సోమేశ్‌కుమార్, వాణీప్రసాద్, వాకాటి కరుణ, రొనాల్డ్‌ రోస్, ఎం.ప్రశాంతి, కాటా ఆమ్రపాలి తెలంగాణ కేడర్‌లో పనిచేస్తుండగా అలాగే తెలంగాణ కేడర్‌కు కేటాయించిన హరికిరణ్, శ్రీజన, శివశంకర్‌లు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్నారు. 

చదవండి: (తెలంగాణ నూతన సీఎస్‌గా శాంతికుమారి)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top