శాంతికుమారి.. అసిస్టెంట్‌ కలెక్టర్‌ నుంచి స్పెషల్‌ సీఎస్‌ దాకా

Shanti Kumari Appointed as Telangana new Chief Secretary - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా 1989 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి ఎ.శాంతికుమారి నియమితులయ్యారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు ఆమెను సీఎస్‌గా నియమిస్తూ సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి వి.శేషాద్రి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆమె తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా సీఎస్‌గా చరిత్రకెక్కారు. గత సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ను ఏపీ కేడర్‌కు వెళ్లాలని ఆదేశిస్తూ మంగళవారం రాష్ట్ర హైకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో కొత్త సీఎస్‌ నియామకం అనివార్యంగా మారిన విషయం తెలిసిందే.

సీఎస్‌ రేసులో ఆర్థిక, పురపాలక, అటవీ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రామకృష్ణారావు, అరవింద్‌ కుమార్, శాంతికుమారిల పేర్లు ప్రముఖంగా వినిపించగా, శాంతికుమారి వైపు సీఎం కేసీఆర్‌ మొగ్గు చూపారు. సీఎస్‌గా నియామకం జరిగిన వెంటనే ఆమె ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా సీఎం ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్‌తో సమావేశం తర్వాత శాంతికుమారి బీఆర్‌కేఆర్‌ భవన్‌లోని రాష్ట్ర సచివాలయం చేరుకుని సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించారు.

 

కేసీఆర్‌తో కలిసి పనిచేసిన శాంతికుమారి 
శాంతికుమారి 1999 నవంబర్‌ నుంచి 2001 జూన్‌ వరకు మెదక్‌ జిల్లా కలెక్టర్‌గా పనిచేయగా, అప్పట్లో ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని సిద్దిపేట నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించిన కేసీఆర్‌ డిప్యూటీ స్పీకర్‌గా వ్యవహరించారు. 2015–2018 వరకు శాంతికుమారి సీఎంఓ ముఖ్యకార్యదర్శి కార్యదర్శిగా ఉన్నారు. ఈ విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కొన్నేళ్ల పాటు కలిసి పనిచేసిన అనుభవం ఉండడంతో పాటు నమ్మకస్తురాలు కావడం.. ఎన్నికల సంవత్సరంలో ఆమెను సీఎస్‌గా నియమించడానికి దోహదపడినట్టు చర్చ జరుగుతోంది. రెండేళ్ల మూడు నెలలకు పైగా సరీ్వసు మిగిలి ఉన్న శాంతికుమారి 2025 ఏప్రిల్‌లో పదవీ విరమణ చేస్తారు. ఉమ్మడి ఏపీ రాష్ట్ర తొలి మహిళా సీఎస్‌గా మిన్ని మాథ్యూస్‌ 2012లో నియమితులయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ రాష్ట్ర తొలి మహిళా సీఎస్‌గా నీలం సహాని వ్యవహరించారు. ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో మూడో మహిళా సీఎస్‌ శాంతికుమారి కావడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శాంతికుమారి మెరైన్‌ బయాలజీలో ఎమ్మెస్సీ, అమెరికాలో ఎంబీఏ చదివారు.  

వివిధ హోదాల్లో విశేష సేవలు. 
 ఐఏఎస్‌గా ఎంపికైన తర్వాత శిక్షణ అసిస్టెంట్‌ కలెక్టర్‌గా శాంతికుమారి తొలి పోస్టింగ్‌ అందుకున్నారు. మూడు దశాబ్దాల కెరీర్‌లో ఆమె పేదరిక నిర్మూలన, సమ్మిళిత అభివృద్ధి, విద్య, వైద్య ఆరోగ్య రంగాలు, నైపుణ్యాభివృద్ధి, అటవీశాఖల్లో వివిధ హోదాల్లో సేవలందించారు. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమాల్లో రెండేళ్ల పాటు పనిచేశారు. తెలంగాణ వచ్చాక నాలుగేళ్ల పాటు సీఎంఓ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా, టీఎస్‌ ఐపాస్‌లో ఇండస్ట్రీ ఛేజింగ్‌ సెల్‌ స్పెషల్‌ సెక్రటరీగా సేవలందించారు. అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ సీఎస్‌గా నియమితులయ్యారు.   

కొత్త సీఎస్‌కు అభినందనల వెల్లువ 
కొత్త సీఎస్‌గా నియమితులైన శాంతికుమారికి అభినందనలు వెల్లువెత్తాయి. ఇన్‌చార్జి డీజీపీ అంజనీకుమార్, టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ బి.జనార్దన్‌రెడ్డి, ఆర్థిక, పురపాలక శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు  కె.రామకృష్ణారావు, అరవింద్‌కుమార్, అదర్‌ సిన్హా, సీనియర్‌ ఐఏఎస్‌లు నవీన్‌ మిట్టల్, వాకాటి కరుణ, టీకే.శ్రీదేవి, అనితా రామచంద్రన్, శైలజారామయ్యర్‌ తదితరులు అభిందనలు తెలియజేశారు.  

మున్నురు కాపు సంఘం హర్షం 
సీఎస్‌గా శాంతికుమారిని నియమించిన సీఎం కేసీఆర్‌కు మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర అపెక్స్‌ కౌన్సిల్‌ కనీ్వనర్‌ సర్దార్‌ పుటం పురుషోత్తం పటేల్‌ ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. వెనుకబాటుకు గురైన కాపు సామాజిక వర్గాన్ని గుర్తించి, తగు విధంగా ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి భారతదేశ భవితకు దిక్సూచి అని పేర్కొన్నారు.    

చదవండి: (సుదీప్‌ చూపు ఆ పార్టీ వైపు.. సంప్రదింపులు జరుపుతున్న మాజీ ఎంపీ)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top