ప్రజారోగ్యం.. ‘ప్రైవేట్‌’ భాగ్యం! | AP ranks fifth in the country in distrust of government hospitals | Sakshi
Sakshi News home page

ప్రజారోగ్యం.. ‘ప్రైవేట్‌’ భాగ్యం!

Apr 22 2026 3:30 AM | Updated on Apr 22 2026 3:30 AM

AP ranks fifth in the country in distrust of government hospitals

రాష్ట్రాల వారీగా గడచిన ఏడాదిగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరిన వారి శాతం ఇలా...

బాబు పాలనలో ప్రభుత్వాస్పత్రులపై ప్రజల్లో సన్నగిల్లిన నమ్మకం 

ప్రభుత్వాస్పత్రుల పట్ల అపనమ్మకంలో దేశంలో ఐదో స్థానంలో ఏపీ 

ప్రైవేట్‌ ఆస్పత్రులకు ప్రజల పరుగులు.. చికిత్సకు సగటున రూ.58,077 చొప్పున ఖర్చు చేస్తున్న రోగులు 

ఆదుకునేందుకు ఆరోగ్యశ్రీ లేదు.. ఆసరా అంతకంటే లేదు

జనం జేబులు గుల్ల.. నేషనల్‌ శాంపిల్‌ సర్వేలో వెల్లడి 

సాక్షి, అమరావతి: ఇటు ప్రజలు వ్యాధుల బారిన పడకుండా రోగాలను కట్టడి చేయడం.. అటు రోగులకు ప్రభుత్వాస్పత్రుల్లో వైద్య సేవలు అందించడంలో చంద్రబాబు సర్కార్‌ దారుణంగా విఫలమైనట్లు స్వయంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఆంధ్రప్రదేశ్‌లో అనారోగ్య బాధితుల్లో ఏకంగా 69.9 శాతం మంది చికిత్స కోసం ప్రైవేట్‌ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నట్లు ఆ సర్వే నివేదిక పేర్కొంది. గత ప్రభుత్వంలో పూర్తి భరోసా కచ్చించిన ప్రభుత్వాస్పత్రుల్లో పరిస్థితులు రెండేళ్ల వ్యవధిలోనే తారుమారు కావడంతో ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోందని తేలింది. 

అపర సంజీవని లాంటి ఆరోగ్యశ్రీని ప్రభుత్వమే స్వయంగా నీరుగార్చడం.. ప్రైవేట్‌ ఆస్పత్రులకు రూ.వేల కోట్ల ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్‌లో పెట్టడం.. ప్రభుత్వాస్పత్రుల్లో కనీసం సూది, దూది లాంటి వాటికీ దిక్కులేకపోవడం.. ప్రభుత్వ కొత్త మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేయడం లాంటివి ఈ దుస్థితికి ప్రధాన కారణం. ఏపీలో ప్రైవేట్‌లో వైద్యం కోసం ప్రజలు జేబు నుంచి సగటున రూ.53,303 చొప్పున ఖర్చు చేస్తున్నట్లు సర్వేలో వెలుగులోకి వచ్చింది. 

చంద్రబాబు గద్దెనెక్కాక ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు, సర్జికల్స్‌కు నిత్యం కొరత నెలకొంది. దీంతో ప్రైవేట్‌ ల్యాబ్స్‌లో పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వాస్పత్రులకు వెళ్లినా రోగులకు భారం తప్పడం లేదు. ప్రభుత్వాస్పత్రుల్లో వైద్య సేవలు నీరుగారిపోవడంతో ప్రజలు తమ సొంత జేబుల నుంచి రూ.4,972 వరకు ఖర్చు చేయాల్సి వస్తోందని తేలింది. ఏపీలో అనారోగ్యం బారినపడిన ప్రజలు ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రైవేట్‌ ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నట్లు కేంద్ర గణాంకాల శాఖ ఇటీవల విడుదల చేసిన నేషనల్‌ శాంపిల్‌ సర్వే 80వ నివేదిక సాక్షిగా రుజువైంది.

ఆందోళనకరంగా ఆరోగ్య సూచీలు..! 
చంద్రబాబు పాలనలో ప్రభుత్వ వైద్య రంగం రోజురోజుకు దయనీయంగా మారుతోంది. ప్రభుత్వాస్పత్రుల్లో రోగులకు ఉచితంగా ఇవ్వాల్సిన మందులు, సర్జికల్స్‌ అందుబాటులో ఉండటం లేదు. ఇతర సదుపాయాలకూ తీవ్ర కొరత నెలకొంది. దీంతో ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లి ప్రైవేట్‌ ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అనారోగ్య బాధితుల్లో 26.9 శాతం మంది ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేరుతుండగా మిగిలిన వారు ఇతర ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు సర్వే తెలిపింది. 

2025 జనవరి నుంచి డిసెంబర్‌ మధ్య ‘గృహ సామాజిక వినియోగం : ఆరోగ్యం’ సర్వేను దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించింది. 1,39,737 గృహాల నుంచి సేకరించిన సమాచారాన్ని అధ్యయనం చేశారు. ఆరోగ్య సూచీలకు సంబంధించి దేశంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ పలు ప్రతికూల అంశాల్లో ముందు వరుసలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. 

‘అప నమ్మకం’లో ఐదో స్థానం
ప్రభుత్వాస్పత్రుల పట్ల ప్రజల అపనమ్మకంలో ఏపీ దేశంలో ఐదో స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 69.9 శాతం మంది రోగులు ప్రైవేట్‌ ఆస్పత్రులను ఆశ్రయించారు. అనారోగ్య బాధితుల్లోనూ ఏపీ అగ్రస్థానంలో నిలిచింది. సర్వే నిర్వహణకు ముందు 15 రోజుల్లో అనారోగ్యానికి గురైన వారు జాతీయ స్థాయిలో 13.1 శాతంగా ఉండగా ఏపీలో 21.1 శాతం మంది వ్యాధుల బారిన పడ్డారు. 

అనారోగ్య బాధితుల్లో మనకంటే ముందంజలో ఉన్న పశ్చిమ బంగ, కేరళ రాష్ట్రాలు ప్రభుత్వ వైద్య సేవల్లో మాత్రం మెరుగైన స్థానాల్లో నిలవడం గమనార్హం. దేశంలో అత్యధికంగా అనారోగ్య బాధితులు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చేరుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర, హర్యానా, చత్తీస్‌గడ్, ఉత్తరప్రదేశ్‌ ముందు వరుసలో ఉన్నాయి. 

జనం జేబులు గుల్ల 
చికిత్సల కోసం ప్రైవేట్‌ ఆస్పత్రులపై ఆధారపడాల్సి రావడంతో రాష్ట్రంలో ప్రజల జేబులు గుల్ల అవుతున్నాయి. ప్రభుత్వాస్పత్రుల్లో వైద్య సేవలు నీరుగారిపోవడంతో ప్రాణాలు దక్కించుకునేందుకు అప్పుల పాలవుతున్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో 3 వేలకుపైగా ప్రొసీజర్లతో ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేసి 2019–24 మధ్య ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిచ్చింది. 104, 108 వాహనాలను పెద్ద ఎత్తున అందుబాటులోకి తెచ్చింది. గ్రామీణ వైద్యానికి భరోసా కల్పించడంతోపాటు ఫ్యామిలీ డాక్టర్, ఇంటివద్దకే మందులు అందించడం లాంటి వినూత్న కార్యక్రమాలను చేపట్టడంతో ప్రైవేట్‌ ఆస్పత్రులను ఆశ్రయించాల్సిన అగత్యం తప్పింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement