ఫలితాలు నేడే

AP Municipal elections votes counting Is On 14th March - Sakshi

ఉదయం 8 గంటల నుంచి పురపాలక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం

ఏలూరు కార్పొరేషన్‌ మినహా అన్ని చోట్లా ఓట్ల లెక్కింపు

11 కార్పొరేషన్లు, 71 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఏర్పాట్లు

మధ్యాహ్నానికి ఫలితాలపై స్పష్టత

సాయంత్రానికల్లా తుది ఫలితాలు వెలువడే అవకాశం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పురపాలక ఎన్నికల ఉత్కంఠకు నేడు తెరపడనుంది. ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడనున్నాయి. ఏలూరు నగర పాలక సంస్థ మినహా రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించిన నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో ఆదివారం ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటించనున్నారు.  హైకోర్టు ఆదేశాల మేరకు ఏలూరులో ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రస్తుతం చేపట్టడం లేదు. ఓట్ల లెక్కింపు కోసం పురపాలక శాఖ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఏర్పాట్లను శనివారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్‌ కమిషనర్లు, మున్సిపల్‌ కమిషనర్లు పరిశీలించారు.

రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ చేపట్టిన 12 నగర పాలక సంస్థల్లోని 671 డివిజన్లలో 91 ఏకగ్రీవమయ్యాయి. దాంతో 580 డివిజన్లకు ఎన్నికలు నిర్వహించారు. వాటిలో ఏలూరులో ఎన్నికలు నిర్వహించిన 47 డివిజన్లలో ఓట్ల లెక్కింపు ప్రస్తుతం చేపట్టడం లేదు. మిగిలిన 533 డివిజన్లలో పోలైన ఓట్లను ఆదివారం లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. రాష్ట్రంలో 71 పురపాలక సంఘాలు / నగర పంచాయతీలకు ఎన్నికల ప్రక్రియ చేపట్టారు. వాటిలో పులివెందుల, పుంగనూరు, పిడుగురాళ్ల, మాచర్ల పురపాలక సంఘాల్లో అన్ని డివిజన్లు (మొత్తం 128) ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన పురపాలక సంఘాలు / నగర పంచాయతీల్లో కూడా 362 డివిజన్లు, వార్డులు ఏకగ్రీవమవడంతో మొత్తం ఏకగ్రీవ డివిజన్లు, వార్డుల సంఖ్య 490కు చేరింది. దాంతో ఎన్నికలు నిర్వహించిన మిగిలిన 1,633 డివిజన్లు, వార్డుల్లో పోలైన ఓట్లను ఆదివారం లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. 

పురపాలక శాఖ పటిష్ట ఏర్పాట్లు 
ఓట్ల లెక్కింపు కోసం పురపాలక శాఖ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ఓట్ల లెక్కింపు చేపట్టనున్న 11 నగర పాలక సంస్థల్లో మొత్తం 2,204 టేబుళ్లను ఏర్పాటు చేశారు. 7,412 మంది కౌంటింగ్‌ సిబ్బంది, 2,376 మంది కౌంటింగ్‌ సూపర్‌వైజర్లను నియమించారు. 
► ఓట్ల లెక్కింపు చేపట్టనున్న 71 పురపాలక సంఘాలు / నగర పంచాయతీల్లో 1,822 టేబుళ్లను ఏర్పాటు చేశారు. 5,195 మంది కౌంటింగ్‌ సిబ్బంది, 1,941మంది కౌంటింగ్‌ సూపర్‌వైజర్లను నియమించారు. 
► ఓట్ల లెక్కింపు టేబుళ్ల వద్ద ఫెన్సింగ్‌ ఏర్పాటు చేశారు. కౌంటింగ్‌ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను మొత్తం వీడియో తీయనున్నారు.
► ఓట్ల లెక్కింపు సమయంలో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం లేకుండా డిస్కం అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. ముందు జాగ్రత్తగా జనరేటర్లను కూడా ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. 
ఓట్ల లెక్కింపు కోసం విజయవాడలోని లయోలా కాలేజీలో చేసిన ఏర్పాట్లు 

రెండు గంటల్లో తొలి ఫలితాలు
► ఆదివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. తొలుత పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను, తర్వాత బ్యాలెట్‌ బాక్సుల్లోని ఓట్లను లెక్కిస్తారు. 
► వార్డుల వారీగా పోలింగ్‌ కేంద్రాల్లో పోలైన ఓట్లను 25 చొప్పున కట్టలు కడతారు. ఒక్కో టేబుల్‌కు 40 ఓట్ల కట్టలు చొప్పున విభజించి ఓట్లు లెక్కింపు ప్రారంభిస్తారు.
► ఓట్ల లెక్కింపు వివరాలు ప్రకటించేందుకు పోలింగ్‌ కేంద్రాల్లో డిజిటల్‌ తెరలు ఏర్పాటు చేశారు. వార్డుల వారీగా, రౌండ్ల వారీగా అభ్యర్థులకు వచ్చిన ఓట్ల వివరాలు ఎప్పటికప్పుడు డిజిటల్‌ తెరలపై వెల్లడిస్తారు. 
► ఓట్ల లెక్కింపు ప్రారంభమైన రెండు గంటలకు తొలి ఫలితాలు వెలువడతాయని అధికారులు భావిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి నగర పంచాయతీల తుది ఫలితాలు ప్రకటించగలమని చెబుతున్నారు.
► విశాఖపట్నం మినహా మిగిలిన అన్ని చోట్లా ఆదివారం సాయంత్రానికి ఓట్ల లెక్కింపు దాదాపు పూర్తి అవుతుందని అంచనా వేస్తున్నారు. అత్యధికంగా 98 డివిజన్లు ఉన్న విశాఖపట్నంలో తుది ఫలితాలు వెలువడేందుకు మరికొంత సమయం పడుతుందని చెబుతున్నారు.     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top