
సాక్షి, అమరావతి: నెల్లూరు మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఓటర్ల జాబితాలో తప్పులన్నాయంటూ దాఖలైన వ్యాజ్యంలో పూర్తి వివరాలను తమ ముందుంచాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. నెల్లూరు మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున తప్పులున్నాయని, వీటిని సరి చేసిన తర్వాతే ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ నెల్లూరుకు చెందిన వి.భువనేశ్వరి ప్రసాద్‌తో పాటు మరో నలుగురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ వ్యాజ్యంపై సీజే నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది ఉన్నం శ్రావణ్ కుమార్ వాదనలు వినిపిస్తూ.. ఒకే ఇంటి నంబర్‌తో వందల సంఖ్యలో ఓటర్లున్నారని తెలిపారు. డివిజన్ల పునర్విభజన ప్రక్రియ తప్పుల తడకగా ఉందని వివరించారు. వీటిని సవరించిన తర్వాతే ఎన్నికలు పెట్టేలా ఆదేశాలివ్వాలని కోరారు. ఎన్నికల కమిషన్ తరపు న్యాయవాది సన్నపురెడ్డి వివేక్ చంద్రశేఖర్ స్పందిస్తూ.. పూర్తి వివరాల సమర్పణకు గడువు కావాలని కోరారు. ఇందుకు ధర్మాసనం అంగీకరిస్తూ.. విచారణను ఈ నెల 16కి వాయిదా వేసింది.