క‌రోనాపై అన‌వ‌స‌ర భ‌యాందోళ‌న వ‌ద్దు

AP Health Ministry Says 85 Percent Recovered From Corona By Staying Home - Sakshi

క‌రోనా కేసుల‌పై భ‌యాందోళ‌న‌వ‌స‌రం లేదు

వీలైన‌న్ని ఆక్సిజ‌న్‌‌ పైప్‌లైన్లు అందుబాటులోకి తీసుకురావాలన్న‌ది ప్రభుత్వం లక్ష్యం

ప్లాస్మా సేక‌ర‌ణ‌పై ప్ర‌భుత్వం ప్రత్యేక దృష్టి

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా పాజిటివ్‌ కేసులపై ప్రజలు భయాందోళన చెందవలసిన అవసరం లేదని వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఏ పరిస్థితి అయినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని ఆ శాఖ ప్రకటించింది. కరోనా వైరస్‌పై ప్రజల్లో నెలకొన్న భయాందోళనలు దూరం చేయాలని, వైరస్‌ సోకి ఆస్పత్రులకు వచ్చే వారికి అరగంటలోనే బెడ్లు కేటాయించాలన్న సీఎం వైఎస్ జగన్‌మోహ‌న్‌రెడ్డి‌ ఆదేశాల మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సర్వం సిద్ధమైంది. కరోనా సోకిన వారికి ఎక్కడా, ఏ లోటు లేకుండా వైద్యం అందించేలా అన్ని ఏర్పాట్లు చేసింది. 

ఇళ్లలోనే 85 శాతం కేసులు :
రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా పాజిటివ్‌ కేసుల్లో 85 శాతం మంది ఇళ్లలోనే ఉంటూ కోలుకున్నారు. మిగిలిన 15 శాతం ఆస్పత్రుల్లో చేరినా, వారిలో కేవలం 4 శాతం రోగులు మాత్రమే అత్యవసర వైద్య సేవల విభాగం (ఐసీయూ)లో చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రుల్లో చేరిన వారిలో 11 శాతం మంది సాధారణ చికిత్సతో డిశ్చార్జ్‌ అవుతున్నారు.

ఆస్పత్రులు–బెడ్లు–వెంటిలేటర్లు :
కోవిడ్‌–19 వైరస్‌ సోకిన వారి చికిత్స కోసం రాష్ట్ర వ్యాప్తంగా 138 ఆస్పత్రులను గుర్తించారు. అన్ని ఆస్పత్రులలో 4300 ఐసీయూ బెడ్లు ఉండగా, నాన్‌ ఐసీయూ, ఆక్సిజన్‌ బెడ్లు 17,406 ఉన్నాయి. ఇక నాన్‌ ఐసీయూ, నాన్‌ ఆక్సిజన్‌ బెడ్లు 17,364 ఉండగా, కోవిడ్‌ చికిత్స కోసం గుర్తించిన అన్ని ఆస్పత్రులలో కలిపి మొత్తం 36,778 బెడ్లు ఉన్నాయి. శుక్రవారం నాటి పరిస్థితి చూస్తే, 14,450 బెడ్లు ఆక్యుపెన్సీలో ఉన్నాయి. 

కరోనా పాజిటివ్‌ కేసులు :
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,31,488 పాజిటివ్‌ కేసులను గుర్తించగా, వాటిలో 70,466 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. వారిలో 14,042 మంది ఆస్పత్రులలో, 18,753 మంది కోవిడ్‌ కేర్‌ సెంటర్ల (సీసీసీ)లో ఉండగా, 35,660 మంది హోం ఐసొలేషన్‌లో ఉన్నారు. 3,541 మంది ఆక్సిజన్‌, వెంటిలేర్ల సహాయంతో చికిత్స పొందుతున్నారు. కరోనా సోకిన వారిలో అత్యధికంగా ఇళ్లలోనే ఉండి నయం అవుతుండగా, ఆస్పత్రులలో చేరిన వారిలో కూడా అత్యల్పం మాత్రమే అత్యవసర విభాగాలలో (ఐసీయూ)లో చికిత్స పొందుతున్నారు.

బెడ్లు–ఆక్యుపెన్సీ :
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆస్పత్రులలో 36,778 బెడ్లు అందుబాటులో ఉండగా, వాటిలో శుక్రవారం నాటికి కేవలం 45.48 శాతం అంటే.. 14,450 బెడ్లు మాత్రమే ఆక్యుపెన్సీలో ఉన్నాయి. 

ఆక్సిజన్‌ పైప్‌లైన్లు :
కోవిడ్‌ చికిత్సలో కీలకమైన ఆక్సిజన్‌ సరఫరాకు అవసరమైన పైప్‌లైన్ల ఏర్పాటుపైనా వైద్య ఆరోగ్య శాఖ దష్టి పెట్టింది. రాష్ట్రంలో కోవిడ్‌ వ్యాప్తికి ముందు అన్ని ప్రభుత్వ ఆస్పత్రులలో 3286 ఆక్సిజన్ పైప్‌లైన్లు అందుబాటులో ఉండగా, ఆ తర్వాత ప్రభుత్వం వాటి సంఖ్యను గణనీయంగా పెంచుతోంది.ఈ ఏడాది జూన్‌ 3వ తేదీ నాటికి 11,364 కొత్త ఆక్సిజన్‌ పైప్‌లైన్లు మంజూరు చేయగా, వాటిలో 10,425 పైప్‌లైన్లను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత జూలై 29న మరో 7,187 ఆక్సిజన్ పైప్‌లైన్లను మంజూరు చేశారు.ఆ విధంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రులలో 17,827, పైవేటు ఆస్పత్రులలో 11,084 పైప్‌లైన్లు ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 28,911 ఆక్సిజన్‌ పైప్‌లైన్లు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ప్లాస్మా ఇస్తే రూ.5 వేలు :
కోవిడ్‌ చికిత్సకు అవసరమైన ప్లాస్మా సేకరణపైనా ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఆ దిశలో ప్రజలను ప్రోత్సహించే విధంగా ప్లాస్మా డొనేట్‌ చేస్తే రూ.5 వేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కోవిడ్‌ నివారణ చర్యలపై  సీఎం వైఎస్‌ జగన్ శుక్రవారం నిర్వ‌హించిన స‌మీక్ష‌లో ఈ  విషయాన్ని ప్రకటించారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్‌), కర్నూలులోని సర్వ జన ఆస్పత్రి (జీజీహెచ్‌)లో ప్లాస్మా థెరపీ చికిత్స చేస్తున్నారు.

ఆందోళన వద్దు :
వీటన్నింటి నేపథ్యంలో కరోనా పాజిటివ్‌ను గుర్తించినా, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అన్ని చోట్లా కరోనా చికిత్సకు ఏర్పాటు చేశామని, మరోవైపు బెడ్లు కూడా అందుబాటులో ఉన్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కొన్ని కనీస జాగ్రత్తలు తీసుకుంటే, కోవిడ్‌ మహమ్మారి నుంచి బయట పడవచ్చని, అందువల్ల ప్రజలెవ్వరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆ శాఖ వివరించింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top