చేయూతకు తోడు రుణాలు

AP Govt support with bank loans to Womens with self employment - Sakshi

అక్క చెల్లెమ్మలు స్వయం ఉపాధితో రాణించేలా బ్యాంకు రుణాలతో రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు

రూ.1.60 లక్షల వరకు తాకట్టు లేకుండా రుణాలు 

ప్రముఖ కంపెనీలు, బ్యాంకులతో ఒప్పందాలు

విధివిధానాలపై 7 వారాల రోడ్‌ మ్యాప్‌ రెడీ 

అక్టోబర్‌ 6 నాటికి వ్యాపార, ఉపాధి కార్యక్రమాలు ప్రారంభించేలా ఏర్పాట్లు

చేయూత, ఆసరాతో మహిళలకు ఆర్థిక స్వావలంబన

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ చేయూత ద్వారా సాయాన్ని అందుకుని వివిధ వ్యాపారాలు, ఉపాధి మార్గాల్లో పెట్టుబడిపెట్టడం ద్వారా స్వయం ఉపాధి పొందేందుకు ఆసక్తి చూపుతున్న మహిళలకు పూర్తి స్థాయిలో తోడ్పాటు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏడు వారాల రోడ్‌ మ్యాప్‌ను సిద్ధం చేసింది. వైఎస్సార్‌ చేయూత పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 23 లక్షల మందికిపైగా మహిళలకు ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో మొత్తం రూ.75 వేలను అందించనున్న ప్రభుత్వం తొలి విడత సాయాన్ని ఇప్పటికే అందచేసిన విషయం తెలిసిందే. ఆర్బీఐ నిబంధనల ప్రకారం రూ. 1.60 లక్షల వరకు తాకట్టు లేని రుణాన్ని బ్యాంకుల నుంచి ఇప్పించడం లేదా ఓవర్‌ డ్రాఫ్ట్‌ సదుపాయం కల్పించే ప్రక్రియలో వైఎస్సార్‌ చేయూత లబ్ధిదారులకు తోడ్పాటు అందించనున్నట్లు గ్రామీణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం తోడ్పాటును అందుకునేందుకు  ఇప్పటివరకు దాదాపు 19.61 లక్షల మందికిపైగా మహిళలు ముందుకొచ్చారు. ప్రముఖ కంపెనీలు, ప్రభుత్వ రంగ బ్యాంకుల తోడ్పాటుతో  చేయూత లబ్ధిదారులు అక్టోబరు 6వ తేదీ కల్లా వ్యాపార, ఉపాధి కార్యక్రమాలను ప్రారంభించుకునేలా కార్యాచరణ సిద్ధం. 

► ఆసక్తి చూపిన లబ్ధిదారుల వివరాలను ఈ నెల 29వ తేదీ నాటికి సంబంధిత శాఖలకు పంపనున్నారు. అధికారులు వీటిని పరిశీలించి సెప్టెంబరు 6వ తేదీ నాటికి 
ప్రముఖ కంపెనీలతో పాటు బ్యాంకులకు ఆ వివరాలు పంపుతారు. లబ్ధిదారుల వారీగా వ్యాపార మోడళ్లను రూపొందిస్తారు. 
► సెప్టెంబరు 21వ తేదీ నాటికల్లా వ్యాపార, ఉపాధి కార్యక్రమాల నిర్వహణలో అదనపు ఆర్థిక సహాయం అవసరమైన లబ్ధిదారులకు బ్యాంకుల నుంచి సహకారం, 
అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. అక్టోబరు 6వ తేదీ కల్లా సాయాన్ని అందచేస్తారు.  

రూ. 1.60 లక్షల వరకు తాకట్టు లేని రుణం..
► చేయూత లబ్ధిదారులు వ్యాపార , ఉపాధి కార్యక్రమాలు చేపట్టేందుకు అదనంగా అవసరమయ్యే నిధుల్లో రూ. 1.60 లక్షల వరకు తాకట్టు లేకుండా బ్యాంకుల నుంచి ఆర్థిక సాయం అందేలా తోడ్పాటు అందించే బాధ్యతను సెర్ప్, మెప్మా సంస్థలకు అప్పగిస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.   
► పండ్లు, కూరగాయల వ్యాపారాలకు ముందుకొచ్చిన లబ్దిదారులను ఐటీసీ, రిలయన్స్‌తో అనుసంధానం చేసి వ్యాపారానికి తోడ్పాటు అందించే బాధ్యతను  ప్రభుత్వం ఉద్యానవన శాఖకు అప్పగించింది.
► పాడిగేదెలు, గొర్రెలు, మేకల పెంపకం చేపట్టే లబ్ధిదారులకు పశు సంవర్థక శాఖ తోడ్పాటు అందిస్తుంది. అమూల్‌ తదితర కంపెనీల సాయంతో పాల విక్రయాలకు సహకరించే బాధ్యతను రాష్ట్ర డెయిరీ డెవలప్‌మెంట్‌ ఫెడరేషన్‌కు అప్పగించారు. 
► దాదాపు 19.61 లక్షలకుపైగా మహిళలకు తోడ్పాటు అందించడం ద్వారా వారి కుటుంబాలను పేదరికం నుంచి మళ్లించే ఈ కార్యక్రమాన్ని  పంచాయతీరాజ్‌ , గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి చైర్మన్‌గా వ్యవహరిస్తూ పర్యవేక్షిస్తారు. మరో ఏడుగురు మంత్రులతో పాటు బ్యాంకర్ల కమిటీ కన్వీనర్, ప్రభుత్వ ఒప్పందం చేసుకున్న సంస్థల ప్రతినిధులు, వివిధ  విభాగాధిపతులతో రాష్ట్ర స్థాయిలో ఒక కమిటీని ప్రభుత్వం నియమించింది. 15 రోజులకు ఒకసారి కమిటీ సమావేశమవుతుంది.
► జిల్లా, మండల, పట్టణ స్థాయిలోనూ ఈ కార్యక్రమాన్ని స్థానికంగావేర్వేరు కమిటీలు పర్యవేక్షిస్తాయి.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top