ఏబీ వెంకటేశ్వరరావుకు మెమో జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

అమరావతి: తమ అనుమతి లేకుండా పెగాసస్ స్పైవేర్ అంశంపై ప్రెస్‌మీట్ నిర్వహించిన సీనియర్ మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఏపీ ప్రభుత్వం మెమో జారీ చేసింది. గత నెల 21వ తేదీన ఏబీ వెంకటేశ్వర రావు పెట్టిన ప్రెస్‌మీట్‌ను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. మీడియాతో మాట్లాడటంపై వివరణ కోరుతూ షోకాజ్ నోటీస్ ఇచ్చింది. మీడియా సమావేశం పెట్టిన మరుసటి రోజే ప్రభుత్వం నోటీస్ పంపింది. ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి లేకుండా మీడియా సమావేశం పెట్టడం తప్పేనంటూ నోటీస్‌లో పేర్కొంది. ఆలిండియా సర్వీస్ రూల్స్‌లోని 6వ నిబంధన పాటించకుండా మీడియా సమావేశం పెట్టడంపై ఏబీ వెంకటేశ్వరరావుకు నోటీసులు ఇచ్చింది. మెమో అందిన వారంలో వివరణ ఇవ్వకపోతే తదుపరి చర్యలు ఉంటాయని హెచ్చరించింది.
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పెగాసస్ స్పైవేర్‌ను కొనుగోలు చేశారంటూ పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ గత నెలలో అసెంబ్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఈ వ్యవహారంపై చంద్రబాబు నాయుడు పెదవి విప్పకపోయినా సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు మాత్రం ప్రెస్‌మీట్‌ను నిర్వహించారు. దీనిపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. మీడియాతో మాట్లాడటంపై వివరణ కోరుతూ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. దీనిలో భాగంగానే తాజాగా ఏబీ వెంకటేశ్వరరావుకు మెమో జారీ చేసింది రాష్ట్ర ఫ్రభుత్వం.