దిగజారిన వేరుశనగ ధర | AP Farmers Fires On Chandrababu Govt | Sakshi
Sakshi News home page

దిగజారిన వేరుశనగ ధర

Mar 30 2026 6:06 AM | Updated on Mar 30 2026 6:06 AM

AP Farmers Fires On Chandrababu Govt

క్వింటాకు కనీస మద్దతు ధర రూ.7,263 

రైతుకు దక్కుతున్న ధర రూ.4 వేలలోపే

ఆందోళనలో రైతులు.. పట్టించుకోని చంద్రబాబు సర్కార్‌

సాక్షి, అమరావతి: వేరుశనగ పంట చేతికొచ్చేవేళ పతనమైన ధరలను చూసి రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఆదుకోవాల్సిన చంద్రబాబు ప్రభుత్వం కేంద్రం నుంచి అనుమతుల్లేవనే సాకుతో కొనుగోలు కేంద్రాలు తెరి­చేందుకు కూడా ముం­దుకు రావడం లేదు. ఫలితంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వేరుశనగ ప్ర«ధానంగా ఖరీఫ్‌ పంట. ఖరీఫ్‌లో దాదాపు 10 లక్షల ఎకరాల్లో సాగవుతుంది. ఈ ఏడాది రబీ సీజన్‌లో 2.27 లక్షల ఎకరాల్లో రైతులు సాగుచేశారు. 

ఎకరాకు రూ.45 వేలు పెట్టుబడి అవుతోంది. ఎకరాకు 25–30 క్వింటాళ్లు రావాల్సిన దిగుబడి 15–20 క్వింటాళ్లకు మించటంలేదు. ఓ వైపు దిగుబడి తగ్గి ఆవేదన చెందుతున్న  రైతులకు పతనమైన ధరలు అశనిపాతంగా మారాయి. క్వింటా వేరుశనగకు కనీస మద్దతు ధర రూ.7,263 కాగా వ్యాపారులు రైతుల వద్ద రూ.3 వేల నుంచి రూ.4 వేల మధ్య కొంటున్నారు. 45 రోజుల కిందట రూ.5,500 వరకు కొన్న వ్యాపారులు, దళారులు ఇప్పుడు బస్తాకు రూ.1,500 నుంచి రూ.2,500 వరకు తగ్గించేశారు. దీంతో రైతులకు ఏంచేయాలో దిక్కుతోచడంలేదు. 

నాణ్యత లేదనే వంకలతో కోతలు
కాయల నాణ్యత బాగున్నా వ్యాపారుల వద్ద కమీషన్ల కోసం దళారులు నాణ్యత అంతంత మాత్రమే అంటూ రైతులను బెదరగొడుతున్నారు. డిమాండ్‌ ఉన్న సమయంలో నాణ్యత పట్టింపులేని దళారులు, వ్యాపారులు ప్రస్తు­తం నాణ్యత, పర్సంటేజీల పేరుతో అడ్డగోలుగా కోతలు పెడుతూ రైతులను నిండా ముంచుతున్నారు. వ్యాపారులు, దళారులు కళ్లాల వద్దకు రాశుల్లో వందగ్రాముల కాయలు తీసుకుని విత్తనాలు తీస్తారు. ఆ విత్తనాలను తూకం వేసి నాణ్యత పర్సంటేజ్‌ నిర్ధారించి ధర నిర్ణయిస్తారు. కాయలు నాణ్యతగా ఉన్నప్పటికీ ఏదో ఒక వంక చెప్పి ధరలో కోత పెడుతున్నారు.

పెట్టుబడులకు తెచ్చిన అప్పులు తీర్చుకునేందుకు, ఇతరత్రా అవసరాల రీత్యా వ్యాపారులు, దళారులు చెప్పిన ధరకే అమ్ముకోక తప్పడంలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఉంటే తమకీ దుస్థితి వచ్చేది కాదని పేర్కొంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా నాఫెడ్‌ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు తెరిచేందుకు ప్రభుత్వం నుంచి తమకు ఆదేశాలు లేవని మార్క్‌ఫెడ్‌ అధికారులు చెబుతున్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపామని పేర్కొంటున్నారు.

నిమ్మకు నీరెత్తినట్టుగా సర్కారు తీరు 
రాష్ట్రంలో వేరుశనగ రైతులు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. కనీసం కొనుగోలు కేంద్రాలు తెరవాలన్న ఆలోచన కూడా చేయడం లేదు. పంటలకు మార్కెట్లో ధరల్లేనప్పుడల్లా ప్రభుత్వం కేంద్రానికి లేఖలతో కాలయాపన చేస్తోంది. ఇప్పటికైనా నాఫెడ్‌ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుంచి వేరుశనగను కనీస మద్దతు ధరకు కొనాలి.– పి.జమలయ్య, ప్రధాన కార్యదర్శి, ఏపీ కౌలు రైతుల సంఘం 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement