
సాక్షి, అమరావతి : తెలంగాణ ప్రభుత్వం జల ఒప్పందాలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఏపీ జలవనరుల శాఖ ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి వ్యాఖ్యానించారు. ఏపీఆర్ యాక్ట్, కేఆర్ఎంబీ ఆదేశాలను తెలంగాణ పట్టించుకోవడం లేదని, రాజకీయ ప్రయోజనాల కోసం జలవివాదాలకు దిగడం భావ్యం కాదన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ ఒకరి అవసరాలు ఒకరు గుర్తించి అభిప్రాయాలను గౌరవించాలి. శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో ప్రమాదం జరిగినప్పుడు అండగా నిలిచాము. తెలంగాణకు నీటి అవసరాలు ఉంటే సహకరించేవాళ్లం. అన్నీ మర్చిపోయి పోలీసులను దించి యుద్ధ వాతావరణం కల్పించారు.
పులిచింతల బ్యారేజీపై హక్కు లేకున్నా ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. సాగునీరు విడుదల సమయంలో విద్యుదుత్పత్తి చేస్తే ఏ సమస్య రాదు. జాతీయ జలవిధానాన్ని ఉల్లఘించినందునే సమస్య తలెత్తింది. తెలంగాణ అనాలోచిత నిర్ణయం వల్ల నీటి కష్టాలు వస్తాయి. ఏపీ, తమిళనాడు రాష్ట్రాలకు సాగు, తాగునీటి ఇబ్బందులొస్తాయి. కేంద్రం పెద్దన్న పాత్ర పోషించి సమస్య పరిష్కరిస్తుందని భావిస్తున్నాం’’అని అన్నారు.