ఎలక్ట్రానిక్‌ హబ్‌గా ఏపీ | AP as an electronic hub | Sakshi
Sakshi News home page

ఎలక్ట్రానిక్‌ హబ్‌గా ఏపీ

May 3 2021 4:21 AM | Updated on May 3 2021 4:23 AM

AP as an electronic hub - Sakshi

సాక్షి, అమరావతి: ఎలక్ట్రానిక్‌ రంగంలో రాష్ట్రం శరవేగంగా వృద్ధి చెందుతోంది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల తయారీ పరిశ్రమ మార్కెట్‌ విలువ రూ.30 వేల కోట్లకు చేరుకున్నట్లు రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్‌ శాఖ అంచనా వేసింది. ఇదే సమయంలో రాష్ట్రం నుంచి రూ.761.76 కోట్ల విలువైన ఎలక్ట్రానిక్‌ వస్తువుల ఎగుమతులు జరిగినట్లు వాణిజ్య శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీంతో 2019–20లో జరిగిన రూ.643.49 కోట్ల ఎగుమతులతో పోలిస్తే 18.37 శాతం వృద్ధి నమోదైంది.

ఎలక్ట్రానిక్‌ పరిశ్రమలను ఆకర్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్స్‌ (ఈఎంసీ)లను భారీ ఎత్తున అభివృద్ధి చేస్తోంది. దీంతో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి ఎలక్ట్రానిక్‌ సంస్థలు ముందుకు వస్తున్నాయి. ప్రస్తుతం మన రాష్ట్రంలో తిరుపతిలో ఈఎంసీ1, ఈఎంసీ2, శ్రీసిటీలో ఈఎంసీ ఉన్నాయి. వీటి ద్వారా ప్రత్యక్షంగా 23 వేల మందికి ఉపాధి లభిస్తోంది. ప్రధానంగా మన రాష్ట్రంలో మొబైల్‌ ఫోన్లు, సెట్‌టాప్‌ బాక్సులు, టీవీలు, కెమెరాల్లో ఉపయోగించే లెన్స్‌ వంటి విడిభాగాలు అత్యధికంగా ఉత్పత్తి అవుతున్నాయి. 

మరో రెండు ఈఎంసీలు
ఇప్పుడున్న మూడు ఈఎంసీలకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు ఈఎంసీలను అభివృద్ధి చేస్తోంది. వైఎస్సార్‌ జిల్లా కొప్పర్తిలోని ఈఎంసీలో ఏర్పాటయ్యే పరిశ్రమలకు ప్రత్యేక రాయితీలను అందిస్తోంది. వైఎస్సార్‌ ఈఎంసీలో డిక్సన్‌తోపాటు అనేక ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల తయారీ సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అలాగే చిత్తూరు జిల్లాలో మాదిరేడు అరణ్యం వద్ద మరో ఈఎంసీని అభివృద్ధి చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇవి అందుబాటులోకి వస్తే వచ్చే రెండేళ్లలో రాష్ట్ర ఎలక్ట్రానిక్‌ తయారీ పరిశ్రమ విలువ రూ.50,000 కోట్ల మార్కును చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement