నేరస్థులు భయపడేలా పోలీసుల పనితీరు ఉండాలి

AP DGP Gowtham Sawang Video Conference With Police - Sakshi

సాక్షి, విజయవాడ : ప్రజలు గౌరవించేలా, నేరస్థులు భయపడేలా పోలీసుల పనితీరు ఉండాలని ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ అన్నారు. ఒక పోలీసు తప్పు చేస్తే పోలీస్ వ్యవస్ధ మొత్తాన్ని తప్పు పడతారని చెప్పారు. అవినీతీ నిర్మూలన, పోలీస్ ప్రవర్తనలో మార్పులపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో బుధవారం సిబ్బందికి డీజీపీ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని పోలీసులకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘సీఎం సూచనలకు అనుగుణంగా నడుచుకుని ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో మంచి పేరు తేవాలి. తొలిసారి ఇంత పెద్ద సమావేశం నిర్వహిస్తున్నాం. ప్రభుత్వానికి వ్యవస్థలో మార్పు, పరివర్తన ముఖ్య అజెండా. సామాన్య ప్రజలకు పోలీసు సేవలు అందుబాటులో ఉండాలి. గత సంవత్సరంగా అదే ఆలోచనతో పని చేస్తున్నాం. కోవిడ్ సమయంలో మన పోలీసుల సేవలు అభినందనీయం, చాలా మంచి పేరు తెచ్చుకున్నాం. ( 34 ఏళ్ల సర్వీసులో ఇదే ప్రథమం: ఏపీ డీజీపీ ‌)

అనుకోకుండా జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో కొందరు సామాన్యులు ఇబ్బంది పడ్డారు. నేరం చేస్తే పోలీసులపైనా న్యాయ పరమైన చర్యలు కచ్ఛితంగా ఉంటాయి. పోలీసు సిబ్బంది మీద పోలీసులే చర్యలు తీసుకోవడం చాలా బాధాకరం, ఆ పరిస్థితి తీసుకు రావొద్దు. ఆత్మ‌ విమర్శ చేసుకోవడం చాలా అవసరం. మార్పు కోసం చేయాల్సింది చాలా ఉంది. మనం అందరం కలిసి చేద్దాం. ప్రభుత్వం, ప్రజలు మనకు బాధ్యత అప్పజెప్పారని మీకు అందరికీ అర్ధమౌతుందని అనుకుంటాను. పోలీసు సిబ్బంది మొత్తం రాబోయే రెండు నెలలో జరిగే ఓరియంటేషన్ క్లాసులకు అటెండ్ అవ్వాలి. మార్పులు ప్రతీ పోలీసు స్టేషన్లో కనిపించాలి. పోలీసు స్టేషనుకు వచ్చిన వారిని మంచిగా రిసీవ్ చేసుకోవాలి. పోలీసు స్టేషనుకు వచ్చేవారితో మసులుకునే ప్రవర్తన బాగుండాలి. స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అనేది ఒక ప్రత్యేక బాధ్యత ఎస్ఈబీ అమలులో ఇప్పటివరకు 33,450 ఎక్సైజు కేసులు ఉన్నాయి. 3492 ఇసుక అక్రమ రవాణా కేసులు పెట్టాం. 50 వేల మందిని అరెస్టు చేశాం. 4,22,738 మెట్రిక్ టన్నుల ఇసుక రవాణాకు భద్రత కల్పించా’’మన్నారు. 

మహిళలను రాత్రిపూట స్టేషనులో ఉంచకూడదు
మహిళలను రాత్రిపూట పోలీసు స్టేషనులో ఉంచకూడదని దిశ స్పెషల్ ఐపీఎస్ అధికారి దీపిక అన్నారు. మహిళలపై నేరాల‌ నియంత్రణ విషయంలో దిశ టీం ముందుకు సాగుతోందని చెప్పారు. మహిళలు రిపోర్ట్ రాయలేకపోతే దిశ పోలీసులు సహాయం చేయాలని ఆదేశించారు. దిశ పోలీసు స్టేషనులో మహిళా హెల్ప్ డెస్క్ పనితీరు బాగుండాలన్నారు. మహిళా బాధితులు, కంప్లైంట్ ఇచ్చే వారితో మహిళా పోలీసులు మాత్రమే ఉండాలని, మహిళా పోలీసులు లేని సందర్భంలో స్ధానిక మహిళా పెద్దల సహాయం తీసుకోవాలన్నారు.

పోలీసులు చట్టానికి సైనికులు మాత్రమే
పోలీసులు చట్టానికి సైనికులు మాత్రమేనని ఏడీజీపీ, సీఐడీ సునీల్ కుమార్ పేర్కొన్నారు. అవతలి వ్యక్తిని తమతో సమానంగా గౌరవించలేని మనస్తత్వం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్టు సెక్షన్ 4 ప్రకారం సంబంధిత అధికారి కూడా నేరస్ధుడేనని చెప్పారు. సాక్షుల వద్ద తీసుకునే వివరాలు 161 సీఆర్‌పీసీ ప్రకారం వీడియోగ్రాఫ్ తీసుకుంటామన్నారు. సమస్యతో వచ్చిన వారితో దుర్భాషలాడకూడదని సూచించారు.

పోలీసులు ఉండాలో అలాగే ఉండాలి
చట్టపరంగా ఎలా పోలీసులు ఉండాలో అలాగే ఉండాలని, పోలీసులు చేసిన కొన్ని దురుసు పనులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయని ఏడీజీపీ, లా అండ్ ఆర్డర్ డాక్టర్ రవి శంకర్ అన్నారు. గత మూడు వారాలుగా జరిగిన సంఘటనల నేపథ్యంలో ఈ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించామన్నారు. పోలీసుల దురుసు ప్రవర్తనపై వచ్చిన కంప్లైంట్లు, లంచాల గురించి వచ్చిన కంప్లైంట్లపై పోలీసులకు దిశా నిర్దేశం చేయాలని సీఎం జగన్ ఆదేశించారన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top