1న పోలవరంపై కీలక భేటీ 

AP Department of Water Resources Meeting With CWC Officers - Sakshi

సీడబ్ల్యూసీ అధికారులతో వర్చువల్‌గా సమావేశం కానున్న రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు 

రూ.10 వేల కోట్లను అడ్‌హక్‌గా ఇవ్వాలన్న ప్రతిపాదనపై చర్చ 

దాని ఆధారంగా కేంద్ర జల్‌ శక్తి శాఖకు నివేదిక ఇవ్వనున్న సీడబ్ల్యూసీ  

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసేందుకు అడ్‌హక్‌గా రూ.10 వేల కోట్లు ఇవ్వాలన్న ప్రతిపాదనపై చర్చించేందుకు సెప్టెంబర్‌ ఒకటో తేదీన∙రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులతో కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) అధికారులు వర్చువల్‌గా సమావేశం కానున్నారు. ఇందులో చర్చించిన అంశాల ఆధారంగా పోలవరానికి నిధుల విడుదలపై కేంద్ర జల్‌ శక్తి శాఖకు సీడబ్ల్యూసీ నివేదిక ఇస్తుంది. తర్వాత దీన్ని కేంద్ర కేబినెట్‌ ఆమోదం కోసం జల్‌ శక్తి శాఖ పంపుతుంది. కేంద్ర కేబినెట్‌ ఆమోదించాక నిధుల విడుదలకు కేంద్ర ఆర్థిక శాఖ గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వనుంది.

పోలవరం ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేయడానికి సహాయ, సహకారాలు అందించాలని ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన విజ్ఞప్తిపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. ప్రధాని మోదీ ఆదేశాల మేరకు గురువారం ఢిల్లీలో రాష్ట్ర అధికారుల బృందంతో కేంద్ర అధికారుల బృందం సమావేశమైంది. ఈ సమావేశంలో 2017–18 ధరల ప్రకారం.. కేంద్ర జల సంఘం సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ) నిర్ధారించిన మేరకు రూ.55,656.87 కోట్ల వ్యయాన్ని ఆమోదించి, ఆ మేరకు నిధులు ఇవ్వాలని రాష్ట్ర అధికారులు కోరారు.

అలాగే రాష్ట్ర ప్రభుత్వం తన సొంత ఖజానా నుంచి ఖర్చు చేసిన రూ.2,863 కోట్లను రీయింబర్స్‌ చేయాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయడం కోసం రూ.10 వేల కోట్లను అడ్‌హక్‌గా ఇవ్వాలని కోరారు. సహాయ, పునరావాస ప్యాకేజీ కింద నిర్వాసితులకు చెల్లించాల్సిన పరిహారాన్ని ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) రూపంలో చెల్లించాలన్నారు. రాష్ట్ర అధికారులు చేసిన ఈ ప్రతిపాదనపై జలవనరుల శాఖ అధికారులతో సమావేశమై.. కేంద్ర జల్‌ శక్తి శాఖకు నివేదిక ఇవ్వాలని సీడబ్ల్యూసీకి కేంద్ర కమిటీ సూచించింది. దీంతో కేంద్ర కమిటీ ఆదేశాల మేరకు వచ్చే నెల ఒకటిన∙రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులతో సీడబ్ల్యూసీ అధికారులు వర్చువల్‌గా భేటీ కానున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top