చిరకాల స్వప్నం నెరవేరింది..: ఏపీ టీచర్స్‌ గిల్డ్‌ హర్షం

Ap Aided Teachers Guild Appreciated Cm Jagan Mohan Reddy Decision - Sakshi

ప్రభుత్వంలో ఎయిడెడ్‌ ఉపాధ్యాయుల విలీనంపై ఏపీ టీచర్స్‌ గిల్డ్‌ హర్షం

విజయవాడలో సీఎం జగన్‌ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం  

సీతమ్మధార(విశాఖ ఉత్తర)/గాంధీనగర్‌ (విజయవాడ సెంట్రల్‌): ఎయిడెడ్‌ పాఠశాలల సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో  తమ చిరకాల స్వప్నం నెరవేరిందని ఏపీ టీచర్స్‌ గిల్డ్‌ హర్షం వ్యక్తం చేసింది. విశాఖ గురుద్వారాలోని వసంత బాల ఎయిడెడ్‌ ఉన్నత పాఠశాలలో ఆదివారం ఏపీటీజీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు ఉపాధ్యాయులు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఓ తీర్మానం చేశారు. ఏపీ టీచర్స్‌ గిల్డ్‌ రాష్ట్ర అధ్యక్షుడు డి.సురేష్‌కుమార్‌ మాట్లాడుతూ ఎయిడెడ్‌ పాఠశాలల సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన మేలు ఎప్పటికీ మరిచిపోలేమన్నారు. కొన్ని యాజమాన్యాల వైఖరి వల్ల విలీన ప్రక్రియ ఆలస్యమవుతోందని, సిబ్బందిని ప్రభుత్వంలో కలిపేందుకు యాజమాన్యాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ టీచర్స్‌ గిల్డ్‌ విశాఖ జిల్లా అ«ధ్యక్షుడు డి.భాస్కరరావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.  

ఎయిడెడ్‌ ఉపాధ్యాయులందరిదీ ఒకే మాట.. 
విజయవాడలోనూ కృష్ణా జిల్లా ఎయిడెడ్‌ ఉపాధ్యాయులు సమావేశం నిర్వహించి.. సీఎం వైఎస్‌ జగన్‌ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. సంఘ నేతలు మాట్లాడుతూ సీఎం సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని, క్షీణదశలో ఉన్న ఎయిడెడ్‌ వ్యవస్థను ప్రక్షాళన చేయాలన్న ఆయన నిర్ణయం అభినందనీయమని కొనియాడారు. తాము నూరు శాతం ప్రభుత్వంలో విలీనమయ్యేందుకు సిద్ధంగా ఉన్నామంటూ వారు స్పష్టం చేశారు. 13 జిల్లాల్లోని ఎయిడెడ్‌ ఉపాధ్యాయులంతా ఒకే మాటపై ఉంటామన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top