50 పడకలు దాటితే ఆక్సిజన్‌ ప్లాంటు

Anilkumar Singhal comments about Black Fungus and Oxygen Plants - Sakshi

ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ ఏర్పాటు చేయాల్సిందే

త్వరలోనే మార్గదర్శకాలు జారీ

వీటికి ప్రభుత్వం రాయితీ ఇస్తుంది

టీకా వేసే సామర్థ్యాన్ని బట్టి వ్యాక్సిన్‌లు ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాశాం

వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌

సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇప్పటికే 57 ఆస్పత్రుల్లో పీఎస్‌ఏ ఆక్సిజన్‌ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని, ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ 50 పడకలు దాటితే ఆక్సిజన్‌ ప్లాంటు కచ్చితంగా ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ పేర్కొన్నారు. వారం రోజుల్లో దీనికి సంబంధించిన మార్గదర్శకాలు వస్తాయన్నారు. శనివారం ఆయన మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో మీడియాతో మాట్లాడారు. ఆక్సిజన్‌ ప్లాంట్ల ఏర్పాటుకు పరిశ్రమల శాఖ రాయితీలు ఇస్తుందని, భవిష్యత్‌లో ఎక్కడా ఆక్సిజన్‌ కొరత లేకుండా ఉండాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. రాష్ట్రంలో 16 చోట్ల సూపర్‌ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి ప్రభుత్వం ఆహ్వానిస్తోందని, రూ.100 కోట్ల పెట్టుబడి పెట్టే వారికి భూమిలో రాయితీ ఇస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రకటించారన్నారు. దీనికోసం భూములు కేటాయించాలని కలెక్టర్లను ఆదేశించామన్నారు. 

రాష్ట్రంలో 808 బ్లాక్‌ఫంగస్‌ కేసులు
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 808 బ్లాక్‌ఫంగస్‌ కేసులు నమోదయ్యాయన్నారు. బ్లాక్‌ఫంగస్‌ చికిత్సకు సంబంధించిన యాంఫోటెరిసిన్‌–బి ఇంజక్షన్లు కేంద్రం ఇస్తేనే తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని, దీనికి మరో మార్గం లేదన్నారు. ఇంజక్షన్ల కోసం అన్ని రకాల ప్రయత్నాలూ చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రానికి కేంద్రం 7,726 ఇంజక్షన్లు కేటాయించిందన్నారు. ప్రస్తుతం ఉన్న 2,475 యాంఫోటెరిసిన్‌–బి ఇంజక్షన్లు జిల్లాలకు పంపించామని, పొసకొనజోల్‌ ఇంజక్షన్లు, మాత్రలు కూడా కొనుగోలు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో రోజువారీ ఆక్సిజన్‌ వినియోగం తగ్గిందని, ఒక దశలో 620 టన్నుల వినియోగం జరిగిందని, ఇప్పుడు 510 టన్నులు వినియోగం అవుతోందన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఆస్పత్రులపై 66 విజిలెన్స్‌ కేసులు నమోదయ్యాయని, వీటిలో 43 ఆస్పత్రులపై పెనాల్టీలు వేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కర్ఫ్యూ వంటి నిర్ణయాల వల్ల రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని, అన్ని జిల్లాలో తగ్గిన ప్రభావం కనిపిస్తోందన్నారు. 

రెండ్రోజుల్లో 10 లక్షల మందికి వ్యాక్సిన్‌
‘రాష్ట్రంలో గతంలో ఒకేరోజు 6.28 లక్షల మందికి టీకా వేశాం. ఇప్పుడు రెండ్రోజుల్లో 10 లక్షల మందికి వ్యాక్సిన్‌ వేశాం. రాష్ట్రానికి టీకా వేసే సామర్థ్యం ఎక్కువగా ఉంది కాబట్టి కేటాయింపులు కూడా ఎక్కువగా చేయాలని కేంద్రాన్ని కోరాం’ అని సింఘాల్‌ తెలిపారు. నేటితో అంటే మే 30వ తేదీతో ఉన్న స్టాకు అయిపోతుందన్నారు. ఆ తర్వాత కేంద్రం వ్యాక్సిన్‌ పంపించే వరకు రాష్ట్రంలో వ్యాక్సిన్‌ వేయడానికి లేదని, ఈ నేపథ్యంలో కాస్త కేటాయింపులు పెంచి త్వరగా వ్యాక్సిన్‌ పూర్తయ్యేలా చేయాలని లేఖ రాసినట్టు తెలిపారు. ఇప్పటి వరకు 94,74,745 డోసుల టీకాలు పంపిణీ చేశామని, వీరిలో రెండు డోసులు తీసుకున్న వారు 24.12 లక్షల మంది ఉండగా, మొదటి డోసు తీసుకున్న వారు 46.48 లక్షల మంది ఉన్నారన్నారు. వ్యాక్సిన్‌లు ఎక్కడైనా దుర్వినియోగం జరిగాయని తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top