స్వల్ప లక్షణాలుంటే కోవిడ్‌ కేర్‌ సెంటర్లకు..

Anil Kumar Singhal Comments On patients with Slight Covid‌ symptoms - Sakshi

తద్వారా కోవిడ్‌ ఆస్పత్రులపై భారం తగ్గుతుంది

సీరియస్‌గా ఉన్నవారికి మెరుగైన వైద్యం లభిస్తుంది

3 రోజుల్లో ప్రైవేటు ఆస్పత్రులకు 30 వేల రెమ్‌డెసివిర్‌లు

రెండ్రోజుల్లో వాటి వాడకం లెక్క తేలుస్తాం

వ్యాక్సిన్‌ వేసుకున్నా సెకండ్‌ వేవ్‌ తగ్గే వరకూ జాగ్రత్త తప్పనిసరి

వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సింఘాల్‌  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో స్వల్ప కోవిడ్‌ లక్షణాలు ఉన్న వాళ్లు ఆస్పత్రులకు అవసరం లేదని, వారు కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో చేరితో ఆస్పత్రులపై భారం తగ్గుతుందని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ అన్నారు. దీనివల్ల సీరియస్‌గా ఉన్న పేషెంట్లకు కోవిడ్‌ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం లభిస్తుందని తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం 60 కోవిడ్‌ కేర్‌సెంటర్లలో మెరుగైన వసతులతో 33,427 పడకలున్నాయని, స్పల్ప లక్షణాలున్న బాధితులను ఇక్కడకు రప్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించామన్నారు. కోవిడ్‌ సోకి, లక్షణాలు లేని వాళ్లను హోం ఐసొలేషన్‌లోనే ఉంచి, ఏఎన్‌ఎంలు వారిని నిత్యం పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అలాగే రోగులతో మాట్లాడి వారి ఆరోగ్య సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వైద్యులు అందుబాటులో ఉంటారన్నారు.

రెమ్‌డెసివిర్‌ల లెక్క తేలుస్తాం
రాష్ట్రంలో ప్రైవేటు ఆస్పత్రులకు 3 రోజుల్లో 30 వేల రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు సరఫరా అయ్యాయని, ఇందులో ప్రభుత్వం కొన్ని ఇవ్వగా, వాళ్లే కొన్ని కొనుక్కున్నారని సింఘాల్‌ తెలిపారు. వీటి వినియోగంపై ఆరా తీస్తున్నామని, రెండ్రోజుల్లో పూర్తి లెక్కలు బయటకు వస్తాయన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 28 వేలకు పైగా రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు ఉన్నాయని వివరించారు. రాష్ట్రంలో ఆక్సిజన్‌ సరిపడా∙నిల్వలు ఉన్నాయని తెలిపారు. గత ఏడాది పీక్‌ దశలోనే 260 మెట్రిక్‌ టన్నులకు మించి వాడలేదని, ఇప్పుడు వృథా అవుతోందని, దీన్ని అరికట్టాలని అధికారులకు సూచించామన్నారు.

గుంటూరు, అనంతపురం, వైఎస్సార్, కృష్ణా జిల్లాల్లో మూత పడిన ఆక్సిజన్‌ యూనిట్లను పునరుద్ధరించి 20 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ ఉత్పత్తి చేసేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. మరో ఐదు యూనిట్లలో తయారవుతున్న గ్యాస్‌ను లిక్విడ్‌ ఆక్సిజన్‌గా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు. 104 కాల్‌ సెంటర్‌ సమర్థవంతంగా పనిచేస్తోందని, కోవిడ్‌కు సంబంధించి అన్ని వివరాలు పబ్లిక్‌ డొమైన్‌లో ఉంచామని వివరించారు. సెకండ్‌ వేవ్‌ కరోనా తగ్గే వరకూ వ్యాక్సిన్‌ వేసుకున్న వారు కూడా జాగ్రత్త వహించాలని సూచించారు. 

whatsapp channel

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top