‘సీఎం జగన్‌కు రుణపడి ఉంటాం’

Andhra Pradesh New Cabinet List Members Comments - Sakshi

సాక్షి,అమరావతి: తనపై పెట్టుకున్న నమ్మకానికి న్యాయం చేస్తానని, జిల్లా అభివృద్ధితో పాటు వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం శ్రమిస్తానని తుని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనకు మంత్రి పదవిని అందించిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కార్యకర్తలు గెలిపించి తనని మంత్రిని చేశారని, వారందరికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

ఎమ్మెల్యే డా.సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. తనను కేబినెట్‌లో కొనసాగిస్తూ అవకాశం కల్పించడంపై సంతోషం వ్యక్తం చేశారు. గతంలో మంత్రిగా తన పనితీరును గుర్తించి ఈ అవకాశం కల్పించిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి రుణపడి ఉంటానన్నారు. తనతో పాటు శ్రీకాకుళం జిల్లా నుంచి సీనియర్ నాయకులు ధర్మాన ప్రసాదరావుకు కేబినెట్‌లో స్థానం కల్పించారు. తమ ప్రాంత ప్రజలపై సీఎంకు ఉన్న ప్రత్యేకమైన అభిమానం, ప్రేమకు ఇదే నిదర్శనమని అన్నారు.

ఎమ్మెల్యే మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. మంత్రి పదవి రావడం చాలా ఆనందంగా ఉందని, వైఎస్సార్ కుటుంబానికి ఎప్పటికీ రుణపడి ఉంటానని అన్నారు. ప్రొఫెసర్గా చేస్తున్న తనకి ఆనాడు దివంగత సీఎం వైఎస్సార్ అవకాశమివ్వగా, ఈ రోజు ఆయన తనయుడు తనని ఎమ్మెల్యేగా గెలిపించి మంత్రిగా అవకాశమిచ్చారన్నారు.

ఎమ్మెల్యే అంజాద్ బాషా మాట్లాడుతూ.. సీఎం జగన్‌మోహన్రెడ్డి దయ వల్లే మళ్ళీ మంత్రి పదవి వస్తోంది.. ఆయనకు తాను ఎప్పుడూ విధేయుడినేనని తెలిపారు. నాటి ఎమ్మెల్యే టిక్కెట్ కేటాయింపు నుంచి మంత్రి పదవులు కేటాయింపు వరకు సీఎం జగన్‌కు ఋణపడి ఉంటానన్నారు.  కాగా రెండవసారి మంత్రి పదవి అంజాద్ బాషాకు వరించడంతో ఆయన ఇంటి వద్ద సంబరాలు మొదలయ్యాయి.

ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు.. కేబినెట్‌లో మంత్రిగా అవకాశం కల్పించిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి రుణపడి ఉంటానని అన్నారు. గతంలో బీసీలను చంద్రబాబు ఓటు బ్యాంకు గానే చూశారని, సీఎం జగన్‌ బీసీలను బ్యాక్ బోన్ క్లాస్‌గా గుర్తించారని కొనియాడారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top