హెలికాప్టర్‌ ల్యాండింగ్‌కు అనుమతినివ్వలేం

Andhra Pradesh High Court Shock To Raghu Rama Krishna Raju - Sakshi

ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్‌పై తేల్చి చెప్పిన హైకోర్టు

సాక్షి, అమరావతి : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భీమవరం పర్యటన సందర్భంగా తన హెలికాప్టర్‌ ల్యాండింగ్‌కు అనుమతివ్వాలన్న ఎంపీ రఘురామకృష్ణరాజు అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. హెలికాప్టర్‌ ల్యాండింగ్‌కు స్థానిక ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ యాజమాన్యం ఇంతకుముందు ఇచ్చిన అనుమతిని వెనక్కి తీసుకోవడం, ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ అనుమతినిచ్చినట్లు ఎలాంటి లేఖను కోర్టు ముందుంచని నేపథ్యంలో ల్యాండింగ్‌కు అనుమతిపై ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేమని స్పష్టం చేసింది.

రోడ్డు మార్గం ద్వారా మాత్రమే భీమవరం వెళ్లాల్సి ఉన్నందున తగిన రక్షణ కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలన్న రఘురామకృష్ణరాజు అభ్యర్థనను సైతం తోసిపుచ్చింది.  జెడ్‌ ప్లస్‌ భద్రత ఉన్నందున పోలీసుల భద్రతకు ఆదేశాలు ఇవ్వలేమని పునరుద్ఘాటించింది. అయితే రఘురామకృష్ణరాజు భీమవరం వెళ్లే సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీని ఆదేశించింది.

శాంతిభ్రదతలకు విఘాతం కలగకుండా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ చీకటి మానవేంద్రనాథ్‌ రాయ్‌ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. తాను వచ్చే హెలికాప్టర్‌కు ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ లేదా ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ ప్రాంగణంలో ల్యాండింగ్‌కు అనుమతించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ రఘురామకృష్ణరాజు శనివారం అత్యవసరంగా హౌస్‌ మోషన్‌ రూపంలో పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ వ్యాజ్యంపై జస్టిస్‌ మానవేంద్రనాథ్‌ రాయ్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ జరిపారు. రఘురామకృష్ణరాజు తరపు న్యాయవాది పీవీజీ ఉమేశ్‌ వాదనలు వినిపిస్తూ, హెలికాప్టర్‌ ల్యాండింగ్‌కు అనుమతి కోరుతూ జిల్లా కలెక్టర్‌కు గత నెల 17న వినతిపత్రం ఇచ్చామన్నారు. దీని సాధ్యాసాధ్యాలపై  జిల్లా ఎస్పీని కలెక్టర్‌ నివేదిక కోరారని, ఆ తరువాత పరిణామాలు ఏంటో తెలియదన్నారు.

మా చేతుల్లో ఏమీ లేదు
ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎస్‌జీపీ) చింతల సుమన్‌ స్పందిస్తూ.. ప్రధాని పర్యటన మొత్తం కేంద్ర హోం శాఖ, స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూపు (ఎస్‌జీపీ) కనుసన్నల్లో జరుగుతుందన్నారు. హెలికాప్టర్‌కు అనుమతులు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌(డీజీసీఏ) మార్గదర్శకాలకు లోబడి ఉంటాయన్నారు. రఘురామకృష్ణరాజు వ్యాజ్యంలో కేంద్రాన్ని, ఎస్‌పీజీని, డీజీసీఏని ప్రతివాదులుగా చేర్చలేదన్నారు.

వారే సమాధానం చెప్పాల్సి ఉందని, తమ చేతుల్లో ఏమీ ఉండదని అన్నారు. విజయవాడ విమానాశ్రయ అనుమతి, ఫ్లైట్‌ ప్లాన్‌ను సమర్పించనప్పుడు కలెక్టర్‌ చేసేదేమీ ఉండదన్నారు. ఎస్‌ఆర్‌కేఆర్‌ కాలేజీ ప్రాంగణం హెలికాప్టర్‌ ల్యాండింగ్‌కు అనువు కాదని ఆర్‌ అండ్‌ బీ అధికారులు నివేదిక ఇచ్చారని చెప్పారు. ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ సమీపంలో హైటెన్షన్‌ విద్యుత్‌ తీగలు ఉన్నాయని ఆ స్కూలు యాజమాన్యం కలెక్టర్‌కు లిఖితపూర్వకంగా తెలిపిందన్నారు.

ప్రభుత్వ న్యాయవాది వివేకానంద స్పందిస్తూ,  పిటిషనర్‌ నిన్న రోడ్డు మార్గం ద్వారా వస్తాను, భద్రత కల్పించాలని కోర్టుకొచ్చారని, సానుకూల ఉత్తర్వులు రాకపోయేసరికి హెలికాప్టర్‌ను ఎంచుకున్నారని, రేపు షిప్‌లో వస్తానని చెబుతారని తెలిపారు. 

అందుకే వెనక్కి తీసుకుంది
హెలికాప్టర్‌ ల్యాండింగ్‌కు అనుమతినిచ్చిన ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ తరువాత వెనక్కి తీసుకోవడంపై అనుమానాలున్నాయని ఉమేశ్‌ తెలిపారు. ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్, ఎస్‌ఆర్‌కేఆర్‌ కాలేజీ అనుమతిని వెనక్కి తీసుకున్న లేఖలను తమ ముందుంచాలని ప్రభుత్వ న్యాయవాదులను న్యాయమూర్తి ఆదేశించారు. సుమన్‌ ఆ లేఖను వాట్సాప్‌ ద్వారా న్యాయమూర్తి ముందుంచారు.

అనుమతులు వెనక్కి తీసుకోవడాన్ని తాము ప్రశ్నించడంలేదని ఉమేశ్‌ చెప్పారు. ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌పై విద్యాశాఖ రైడ్‌ చేసిందని, అందుకే ఆ పాఠశాల ల్యాండింగ్‌కిచ్చిన అనుమతిని వెనక్కి తీసుకుందన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. పిటిషనర్‌ వినతిపై కలెక్టర్‌ ఏదో రకంగా స్పందించి ఉండాల్సిందని తెలిపారు. హెలికాఫ్టర్‌ దిగే స్థలం యజమాని అనుమతి తప్పనిసరని, అందువల్ల ఆ ప్రాంగణాల్లో ల్యాండింగ్‌పై ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని న్యాయమూర్తి తేల్చి చెప్పారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top