మేం కోరిన వివరాలివ్వరా?

Andhra Pradesh High Court Impatience On Central Govt - Sakshi

‘ఉపాధి’ నిధుల విషయంలో కేంద్రంపై హైకోర్టు అసహనం

తదుపరి విచారణకల్లా అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశం  

సాక్షి, అమరావతి: ఉపాధి హామీ పథకం కింద 2014 నుంచి ఇప్పటి వరకు ఏపీకి ఎన్ని నిధులు ఇచ్చారు? ఇంకెంత ఇవ్వాలి? తదితర పూర్తి వివరాలను తమ ముందుంచాలని ఆదేశించినా పట్టించుకోలేదంటూ కేంద్రంపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఓ దశలో కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖ కార్యదర్శి వ్యక్తిగతంగా హాజరవ్వాలని ఆదేశాలిచ్చేందుకు సైతం సిద్ధమైంది. అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ (ఏఎస్‌జీ) హరినాథ్‌రెడ్డి పలుమార్లు అభ్యర్థించడంతో మెత్తబడిన న్యాయస్థానం.. తదుపరి విచారణకల్లా తాము కోరిన వివరాలను తమ ముందుంచాలని స్పష్టం చేసింది. సమగ్ర వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయకుంటే, సంబంధిత కార్యదర్శి తమ ముందు హాజరు కావాల్సి ఉంటుందని హైకోర్టు తేల్చిచెప్పింది.

తదుపరి విచారణను ఈ నెల 17కి వాయిదా వేస్తూ న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ మంగళవారం ఉత్తర్వులిచ్చారు. ఉపాధి హామీ పథకం కింద తాము చేసిన పనులకు సంబంధించిన బిల్లులను ప్రభుత్వం చెల్లించడం లేదంటూ పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై ఇటీవల విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్‌ దేవానంద్‌.. ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రానికి ఇచ్చిన నిధుల వివరాలను సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించారు. ఈ వ్యాజ్యాలు మంగళవారం మరోసారి విచారణకు రాగా.. కేంద్రం ఓ మెమోను న్యాయమూర్తి ముందు ఉంచింది. అందులో తాము కోరిన వివరాలు లేకపోవడంతో న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. ఏఎస్‌జీ హరినాథ్‌రెడ్డిని పిలిపించి వివరణ కోరారు. తదుపరి విచారణ కల్లా పూర్తి వివరాలను కోర్టు ముందుంచుతామని, చివరి అవకాశం ఇవ్వాలని హరినాథ్‌రెడ్డి అభ్యర్థించారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top