ఏపీ జీఎస్టీ వసూళ్లు రూ.3,157 కోట్లు 

Andhra Pradesh GST collection was Rs 3157 crore - Sakshi

గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఫిబ్రవరిలో 19% వృద్ధి 

సాక్షి, న్యూఢిల్లీ: గత ఏడాది కంటే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆంధ్రప్రదేశ్‌ జీఎస్టీ వసూళ్లలో వృద్ధి నమోదైంది. 2021 ఫిబ్రవరితో పోలిస్తే 2022 ఫిబ్రవరిలో 19% వృద్ధితో ఆంధ్రప్రదేశ్‌లో రూ.3,157 కోట్ల మేర జీఎస్టీ సమకూరింది. తెలంగాణలో 13% వృద్ధితో రూ.4,113 కోట్ల మేర జీఎస్టీ ఆదాయం సమకూరింది. ఒమిక్రాన్‌ వేరియంట్‌ నేపథ్యంలో అనేక రాష్ట్రాల్లో కోవిడ్‌–19 ఆంక్షలు కొనసాగినప్పటికీ జీఎస్టీ వసూళ్లలో వృద్ధి నమోదైంది.

దేశవ్యాప్తంగా చూస్తే ఐదోసారి జీఎస్టీ ఆదాయం రూ.1.30 లక్షల కోట్ల మార్క్‌ దాటింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ.1,33,026 కోట్ల స్థూల జీఎస్టీ ఆదాయం సేకరించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే ఇది 18% అధికం. ఫిబ్రవరిలో జీఎస్టీ స్థూల రాబడి రూ.1,33,026 కోట్లు కాగా, ఇందులో సీజీఎస్టీ (కేంద్ర జీఎస్టీ) రూ.24,435 కోట్లు, ఎస్‌జీఎస్టీ (రాష్ట్ర జీఎస్టీ) రూ. 30,779 కోట్లు, వస్తువుల దిగుమతిపై రూ.33,837 కోట్ల వసూళ్లతో కలిపి మొత్తం ఐజీఎస్టీ (ఇంటిగ్రేటెడ్‌ జీఎస్టీ) రూ.67,471 కోట్లు, సెస్‌ రూ.10,340 కోట్లు ఉన్నాయి. అంతేగాక గత నెలలో వస్తువుల దిగుమతుల ద్వారా వచ్చిన ఆదాయం గతేడాది కంటే 38% ఎక్కువగా ఉంది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top