breaking news
GST bills
-
ఏపీలో మే జీఎస్టీ వసూళ్లు రూ.3,047 కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లలో ఆంధ్రప్రదేశ్ గణనీయమైన వృద్ధి సాధించినట్లు కేంద్ర ఆర్థికశాఖ బుధవారం వెల్లడించింది. మే నెలలో రూ.3,047 కోట్ల జీఎస్టీ వసూలైనట్లు తెలిపింది. గత ఏడాది మే నెలలో వసూలైన జీఎస్టీ రూ.2,074 కోట్లతో పోలిస్తే 47 శాతం పెరిగిందని పేర్కొంది. తెలంగాణలోనూ జీఎస్టీ వసూళ్లలో 33 శాతం వృద్ధి ఉన్నట్లు తెలిపింది. గత ఏడాది మే నెలలో రూ.2,984 కోట్ల జీఎస్టీ వసూలు కాగా ఈ ఏడాది రూ.3,982 కోట్లు వసూలైనట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా రూ.1,40,885 లక్షల కోట్లు దేశవ్యాప్తంగా మే నెలలో జీఎస్టీ రూ.1,40,885 కోట్లు వసూలైనట్లు తెలిపింది. గత ఏడాది ఇదే నెలలో వసూలైన రూ.97,821 కోట్లతో పోలిస్తే ఇది 44 శాతం అధికమని పేర్కొంది. గత ఏడాదితో పోలిస్తే వస్తువుల దిగుమతుల ద్వారా వచ్చే ఆదాయం 43 శాతం, దేశీయ లావాదేవీల ద్వారా వచ్చే ఆదాయం 44 శాతం పెరిగినట్లు వివరించింది. జీఎస్టీ వసూళ్లు ప్రారంభమైనప్పటి నుంచి నెలవారీ వసూళ్లు రూ.1.40 లక్షల కోట్ల మార్కును దాటడం ఇది నాలుగోసారి కాగా.. ఈ ఏడాది మార్చి నుంచి వరుసగా మూడోసారని వెల్లడించింది. -
ఏపీ జీఎస్టీ వసూళ్లు రూ.3,157 కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: గత ఏడాది కంటే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆంధ్రప్రదేశ్ జీఎస్టీ వసూళ్లలో వృద్ధి నమోదైంది. 2021 ఫిబ్రవరితో పోలిస్తే 2022 ఫిబ్రవరిలో 19% వృద్ధితో ఆంధ్రప్రదేశ్‌లో రూ.3,157 కోట్ల మేర జీఎస్టీ సమకూరింది. తెలంగాణలో 13% వృద్ధితో రూ.4,113 కోట్ల మేర జీఎస్టీ ఆదాయం సమకూరింది. ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో అనేక రాష్ట్రాల్లో కోవిడ్–19 ఆంక్షలు కొనసాగినప్పటికీ జీఎస్టీ వసూళ్లలో వృద్ధి నమోదైంది. దేశవ్యాప్తంగా చూస్తే ఐదోసారి జీఎస్టీ ఆదాయం రూ.1.30 లక్షల కోట్ల మార్క్ దాటింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ.1,33,026 కోట్ల స్థూల జీఎస్టీ ఆదాయం సేకరించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే ఇది 18% అధికం. ఫిబ్రవరిలో జీఎస్టీ స్థూల రాబడి రూ.1,33,026 కోట్లు కాగా, ఇందులో సీజీఎస్టీ (కేంద్ర జీఎస్టీ) రూ.24,435 కోట్లు, ఎస్జీఎస్టీ (రాష్ట్ర జీఎస్టీ) రూ. 30,779 కోట్లు, వస్తువుల దిగుమతిపై రూ.33,837 కోట్ల వసూళ్లతో కలిపి మొత్తం ఐజీఎస్టీ (ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ) రూ.67,471 కోట్లు, సెస్ రూ.10,340 కోట్లు ఉన్నాయి. అంతేగాక గత నెలలో వస్తువుల దిగుమతుల ద్వారా వచ్చిన ఆదాయం గతేడాది కంటే 38% ఎక్కువగా ఉంది. -
రెండు బిల్లులు ప్రవేశ పెట్టాలని నిర్ణయం
-
'అరుణ్ జైట్లీ హనుమంతుడి లాంటివారు'
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని సమాజ్ వాదీ పార్టీ నాయకుడు నరేష్ అగర్వాల్ రామాయణంలో హనుమంతుడితో పోల్చారు. రాజ్యసభ అధికారాలు తరిగిపోకుండా చూడాలని ఆయనను కోరారు. రాజ్యసభలో జీఎస్టీ సంబంధిత బిల్లులపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. దీన్ని ఆర్థికబిల్లుగా ప్రవేశపెట్టడాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. దానివల్ల రాజ్యసభ సూచించిన మార్పులను తప్పనిసరిగా చేయాల్సిన అవసరం ఉండదు. ఇలా చేయడం ద్వారా రాజ్యసభను పట్టించుకోవాల్సిన అవసరం లేకుండా పోతోందన్నది విపక్షాల వాదన. ప్రభుత్వానికి లోక్‌సభలో భారీ మెజారిటీ ఉంది గానీ రాజ్యసభలో లేదు. ఈ అంశాన్నే నరేష్ అగర్వాల్ సభలో ప్రస్తావించారు. ''మీరు ఈ బిల్లును ఆర్థిక బిల్లుగా ప్రవేశపెట్టారు. దానికి మేమంతా అభ్యంతరం చెబుతున్నాం. హనుమంతుడికి అతడి శక్తి గురించి ఇతరులు చెబితేనే లేచాడు. అరుణ్ జైట్లీ కూడా హనుమంతుడి లాంటివారే. ఆయన సభా నాయకుడు, రాజ్యాంగ నిపుణుడు కూడా. మీరే మా హక్కులను కాలరాస్తే ఎలా'' అని ఆయన అన్నారు. ముఖ్యమైన చట్టాల విషయంలో రాజ్యసభకు కావాలనే తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని కాంగ్రెస్ నాయకుడు ఆనంద్ శర్మ చెప్పారు. రాజ్యసభ సభ్యులకు ఏమాత్రం అభిమానం మిగిలి ఉన్నా వాళ్లంతా రాజీనామా చేయాలని వీరప్ప మొయిలీ అన్నారు. అయితే.. పన్నులకు సంబంధించిన చట్టాలన్నీ ఆర్థిక వ్యవహారాలే కాబట్టి జీఎస్టీ బిల్లులను ఆర్థిక బిల్లులుగా ప్రవేశపెట్టడంలో తప్పేమీ లేదని కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ సమర్థించుకున్నారు. ప్రజల తీర్పు లోక్‌సభలోనే కనిపిస్తుందని చెప్పారు. అయితే, లోక్‌సభ ఎన్నికైన ప్రజాప్రతినిధులదైదే రాజ్యసభ భిక్షగాళ్లదా అంటూ మంత్రి వ్యాఖ్యలను నరేష్ అగర్వాల్ తీవ్రంగా తప్పుబట్టారు. అసలు ఈ వివక్ష ఎందుకు చూపుతున్నారో అర్థం కావట్లేదన్నారు. -
జీఎస్టీకి ఆమోదం: పెరిగేవి.. తగ్గేవి
-
జీఎస్టీకి ఆమోదం
సీజీఎస్టీ, ఐజీఎస్టీ సహా నాలుగు బిల్లులకు లోక్‌సభ ఓకే - ద్రవ్యబిల్లులుగా ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ - హవాయి చెప్పులకు, బీఎండబ్ల్యూకు ఒకే పన్ను ఉండదు - అందుకే వేర్వేరు శ్లాబులను కౌన్సిల్ ప్రతిపాదించింది - ఏకీకృత పన్ను విధానంతో వ్యాపారస్తులపై వేధింపులుండవని స్పష్టీకరణ - రాజ్యసభలో చర్చ మాత్రమే.. ఆమోదం అవసరం లేదు ఇదీ లాభం.. పన్నుల వసూలు తేలిక . జీఎస్టీతో పన్నుల ఎగవేతకు కళ్లెం పడుతుంది. పన్నుల విధానం పారదర్శకంగా ఉంటుంది. పన్ను భారం తగ్గటంతో కొన్ని రకాల వస్తువులు తక్కువ ధరకే లభ్యమవుతాయి ప్రతిపాదిత పన్ను రేట్లు 5% - వంట నూనెలు, మసాలా దినుసులు, టీ, కాఫీ 12% - కంప్యూటర్లు, ప్రాసెస్డ్ ఆహారపదార్థాలు 18% - సబ్బులు, నూనెలు, షేవింగ్ సామాను 28% - విలాస వస్తువులు పొగాకు ఉత్పత్తులు జీఎస్టీ అంటే... దేశమంతా ఒకే పన్ను వ్యవస్థ అమలు కోసం, పన్నుపై పన్ను వేసే పద్ధతిని నిర్మూలించే ఉద్దేశంతో వస్తు, సేవల పన్ను(జీఎస్టీ)ని రూపొందించారు. ఒక్కమాటలో చెప్పాలంటే వస్తువులు లేదా సేవల సరఫరాపై విధించే సమగ్ర పన్ను. ప్రస్తుతం 150కి పైగా దేశాల్లో జీఎస్టీ లేదా వ్యాట్ అమలవుతోంది. అమలు విషయానికొస్తే... ఒక వస్తువు వినియోగదారుడిని చేరాలంటే ముడిసరుకు నుంచి తయారీ, హోల్‌సేల్, రిటైల్... ఇలా పలు దశలుంటాయి. సేవల విషయంలోనూ అంతే. ప్రతి దశలోనూ కొంత విలువ జోడిస్తారు. అందువల్ల ఈ దశలన్నింటిలో పన్ను వసూలవుతుంది. కొన్నిసార్లు పన్నుపై పన్ను వసూలు చేస్తున్నారు. జీఎస్టీ అమలుతో ఈ పన్నులన్నీ రద్దై ఒకే పన్ను అమలవుతుంది. కేంద్ర ఎక్సైజ్ సుంకం, రాష్ట్రాలు విధించే విలువ ఆధారిత పన్ను (వ్యాట్), వినోద, విలాస, ప్రవేశ పన్ను, ఆక్ట్రాయ్ స్థానంలో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) ఒక్కటే ఉంటుంది. లాభమేంటి? జీఎస్టీతో పన్నుల వసూలు సులభమవుతుంది. పన్నుల ఎగవేతను చాలావరకూ అరికట్టవచ్చు. పన్నుల విధానం పారదర్శకంగా ఉంటుంది. కొన్ని రకాల వస్తువులపై పన్ను భారం తగ్గడం వల్ల వినియోగదారులకు తక్కువ ధరకే లభ్యమవుతాయి. ఆహార ధాన్యాలు, పాలు, కూరగాయలు, పండ్లు, గుడ్లు, చికెన్, మటన్ వంటి నిత్యావసరాలపై ఎలాంటి పన్ను ఉండకపోవచ్చు జీఎస్టీ అమలుతో పెరిగేవి... తగ్గేవి తగ్గేవి: షాంపులు, చాక్లెట్లు, బ్రెడ్, బ్యాటరీలు, టాయిలెట్ వస్తువులు వంటి ఎక్కువగా అమ్ముడయ్యే(ఎఫ్ఎంసీజీ) వస్తువులు, రెస్టారెంట్లలో భోజనం, చిన్న కార్లు, డీటీహెచ్ డిష్‌లు. పెరిగేవి: విలాసవంతమైన కార్లు; పొగాకు, కొన్ని రకాల శీతల పానీయాలు న్యూఢిల్లీ: స్వతంత్ర భారతంలో అతిపెద్ద పన్ను సంస్కరణల విధానం అమలుకు మరో అడుగు ముందుకు పడింది. జీఎస్టీకి సంబంధించిన 4 అనుబంధ బిల్లులకు బుధవారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఏడుగంటలపాటు జరిగిన సుదీర్ఘ చర్చ అనంతరం.. సెంట్రల్ జీఎస్టీ బిల్లు –2017, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ బిల్లు–2017, యూనియన్ టెరిటరీ జీఎస్టీ బిల్లు–2017, జీఎస్టీ పరిహార బిల్లు (రాష్ట్రాలకు)–2017లను లోక్‌సభ ఆమోదించింది. జూలై 1 నుంచి జీఎస్టీని అమలు చేద్దామనుకుంటున్న కేంద్రం ఆలోచనలకు మరో అడుగు ముందుకు పడింది. చర్చ సందర్భంగా విపక్ష పార్టీలు చేసిన సూచనలను కేంద్రం తిరస్కరించింది. పార్లమెంటులో బిల్లు ఆమోదంతో రాష్ట్రాల జీఎస్టీ బిల్లుకు ఆయా రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదం తెలపాల్సి ఉంది. ఈ బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగాæజైట్లీ మాట్లాడుతూ.. జీఎస్టీ ద్వారా వస్తువులు, సేవల ధరలు పెరుగుతాయంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. దేశమంతా ఏకీకృత పన్ను విధానం అందుబాటులోకి వస్తే వస్తువుల ధరలు తగ్గుతాయన్నారు. వ్యాపారులపై వేధింపులుండవు జీఎస్టీ అమల్లోకి రావటం ద్వారా వ్యాపారస్తులపై వివిధ ప్రభుత్వ విభాగాల అధికారుల వేధింపులు ఆగిపోతాయని.. ఒక వస్తువు దేశమంతా ఒకే ధరకు అందుబాటులో ఉంటుందన్నారు. ఇప్పుడు వస్తువులపై వేసిన పన్నుపై మరో పన్ను విధిస్తారని.. వీటన్నింటినీ తొలగిస్తే వస్తువుల ధరలు కాస్త తగ్గుతాయన్నారు. వివిధ జీఎస్టీ ధరలు ఎందుకు విధించాల్సి వచ్చిందంటూ విపక్ష సభ్యులు వేసిన ప్రశ్నలకు జైట్లీ సమాధానం చెప్పారు. ‘అన్ని వస్తువులకు ఒకే పన్ను విధించటం సరికాదు. హవాయి చెప్పులకు, బీఎండబ్ల్యూ కారుకు ఒకే పన్ను విధించటం న్యాయం అనిపించుకోదు. ఆ వస్తువు వినియోగదారుడి ఆధారంగా పన్నులుండేలా జీఎస్టీ కౌన్సిల్ సిఫారసు చేసింది’ అని జైట్లీ లోక్‌సభలో స్పష్టం చేశారు. సెంట్రల్ జీఎస్టీ గరిష్టంగా 20 శాతం ఉండనుండగా.. స్టేట్ జీఎస్టీ 40 శాతం (గరిష్టం)గా నిర్ణయించారు. ఈ గరిష్ట విలువలన్నీ ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లోనే అమలు చేయనున్నారు. ఈ బిల్లు పన్ను చెల్లింపును తప్పనిసరి చేయటంతోపాటుగా.. చెల్లించిన పన్నులకు ఇన్పుట్ క్రెడిట్ పొందేందుకు వీలుంటుంది. ద్రవ్యబిల్లుగానే ఎందుకు? జీఎస్టీకి సంబంధించిన నాలుగు బిల్లులను ద్రవ్యబిల్లులుగా ప్రవేశపెట్టడంపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. కేంద్రం ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ప్రశ్నించాయి. దీనిపై జైట్లీ స్పందిస్తూ.. ‘రాజ్యాంగ నిబంధనల ప్రకారం 1950 నుంచి అన్ని పన్ను సంబంధిత బిల్లులను పార్లమెంటులో ద్రవ్యబిల్లులుగానే ప్రవేశపెడుతున్నారు’ అని స్పష్టం చేశారు. యాంటీ–ప్రాఫిటీరింగ్ నిబంధనల గురించి జైట్లీ వివరిస్తూ.. పన్ను రేట్లలో తగ్గింపు ప్రయోజనాలు వినియోగదారులకు లభిస్తాయన్నారు. ఈ విషయంలో సమన్యాయం జరుగుతుందన్నారు. వ్యవసాయాన్ని జీఎస్టీ పరిధిలోకి తేవటంపై విపక్షాల ఆందోళనలపై మంత్రి స్పందిస్తూ.. ‘ఈ బిల్లు వ్యవసాయానికి సంబంధించి ఒక స్పష్టమైన నిర్వచనాన్ని ఇచ్చింది. ఏయే అంశాలను జీఎస్టీ పరిధిలోకి తీసుకోకూడదో స్పష్టం చేసింది’ అని తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తులపై ప్రస్తుతమున్న విధానమే కొనసాగుతుందని దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పన్నుల విషయంలో బ్యాంకులకు సంబంధించిన అంశాలపై జీఎస్టీ కౌన్సిల్ తుది నిర్ణయం తీసుకుంటుందని జైట్లీ స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి జీఎస్టీ వర్తించదని మంత్రి వెల్లడించారు. జీఎస్టీని ఆడిట్ చేయటంపై జైట్లీ వివరణ ఇస్తూ.. రాజ్యాంగ బద్ధంగా కాగ్‌కు ఉన్న అధికారాల ప్రకారమే ఆడిటింగ్ జరుగుతుందని తెలిపారు. ‘జీఎస్టీ ఆలోచన కేంద్ర, రాష్ట్రాల అధికారాల మధ్య అస్పష్టతను సృష్టించింది. ఇప్పుడు కేంద్రం, రాష్ట్రాలు కలిసి సంయుక్తంగా ఒకే పన్నును నిర్ధారిస్తాయి’ అని జైట్లీ స్పష్టం చేశారు. ద్రవ్యోల్బణం దాదాపు ప్రస్తుత స్థితిలోనే కొనసాగుతుందని ఆయన తెలిపారు. జీఎస్టీ అమలు త్వరలో ప్రారంభం కానుందన్న మంత్రి.. ఈ చట్టం పరిధిలోకి వచ్చే వస్తువుల వర్గీకరణను వచ్చేనెల్లో ప్రారంభిస్తామన్నారు. ‘పన్నుల పరిధిలోకి రావాల్సిన వాటిపై జీఎస్టీ కౌన్సిల్లో ఏకాభిప్రాయం సాధించాం. దేశంలో ఓ బిల్లుపై ఏకాభిప్రాయం రావటం ఇదే తొలిసారి. జీఎస్టీ కౌన్సిల్ దేశంలోనే తొలి సమాఖ్య సంస్థ. పరోక్ష పన్నులకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏకతాటిపైకి వచ్చిన సంస్థ ఇది’ అని తెలిపారు. కౌన్సిల్ పనితీరుపై అన్ని పార్టీలు సానుకూల ధృక్పథంతో ఆలోచించాలన్నారు. ‘జీఎస్టీ కౌన్సిల్‌లోని 32 మంది సభ్యులు బిల్లులకు ఒకట్రెండు మార్పులు సూచించారు. వాటికి అంగీకరించాం. దీంతో ఏకాభిప్రాయం సాధించాం’ అని తెలిపారు. ‘జీఎస్టీ సభ్యులు, అధికారుల కృషి అద్భుతమైన 4 బిల్లుల రూపంలో లోక్‌సభలో ఆమోదం పొందింది’ అని రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా ట్వీట్ చేశారు. సీజీఎస్టీ బిల్లు వస్తువులు, సేవల అంతర్రాష్ట్ర సరఫరాలపై కేంద్రం విధించే సీజీఎస్టీ– జమ్మూ,కాశ్మీర్ మినహా మొత్తం దేశానికి వర్తిస్తుంది. షెడ్యూల్ 1 రెడ్‌విత్ 7 ప్రకారం, ఒక ఏడాదిలో ఒక యజమాని ఒక ఉద్యోగికి రూ.50,000లోపు ఇచ్చే బహుమతి వస్తు, సేవల సరఫరాగా పరిగణించరాదు. షెడ్యూల్ 3 ప్రకారం, కొన్ని కార్యకలాపాలను వస్తు, సేవలుగా పరిగణించరాదు. ఇందులో లాటరీ, బెట్టింగ్, గ్యాంబ్లిగ్మినహా ఇతర ఆర్థిక క్లెయిమ్‌లు ఉన్నాయి. దేశంలో విదేశీ దౌత్య బృందం సేవలూ ఇదే కోవకు వస్తాయి. భవన నిర్మాణం, భూ అమ్మకాలు ఈ పరిధిలో ఉన్నాయి. ఆల్కాహాలిక్ లిక్కర్ సరఫరాల మినహా ఇతర అంతర్రాష్ట్ర వస్తుసేవల సరఫరాలకు సీజీఎస్టీ వర్తిస్తుంది. సీజీఎస్టీ రేట్ పరిమితిని 14 శాతం నుంచి 20 శాతానికి పెంచడం జరిగింది. జీఎస్టీ మండలి సిఫారసులపై ప్రభుత్వం నోటిపై చేసిన తేదీ నుంచి పెట్రోలియం క్రూడ్, హైస్పీడ్ డీజిల్ (హెచ్ఎస్డీ), పెట్రోల్, నేచురల్ గ్యాస్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్ (ఏటీఎఫ్)ల సరఫరాలపై సీజీఎస్టీ అమలవుతుంది. జీఎస్టీకి సంబంధించి రిజిస్ట్రేషన్‌తో ఎటువంటి సంబంధం లేకుండా, వస్తు, సేవలకు సంబంధించి సమగ్రమైన రికార్డులను ట్రాన్స్ పోర్టర్ కలిగిఉండాలి. వార్షిక రిటర్న్స్ సమర్పించిన తేదీ నుంచి 72 నెలల లోపు అకౌంట్, రికార్డ్ పుస్తకాలను సమర్పించాల్సి ఉంటుంది. వీటిని సమర్పించడానికి గడువు ఇంతకుముందు 60 నెలలుగా ఉండేది. ఐజీఎస్టీ బిల్లు జీఎస్టీలోని ప్రధాన మూడు భాగాల్లో (సీజీఎస్టీ, ఐటీఎస్టీ, ఎస్జీఎస్టీ) ఇంటిగ్రేటెడ్ వస్తు, సేవల పన్ను ఒకటి. ఒకదేశం–ఒకే పన్ను భావనకు ఇదే మూలం. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వస్తు, సేవల రవాణా సందర్భంలో ఐజీఎస్టీని కేంద్రం వసూలు చేస్తుంది. అధికారులు స్థిరీకరించిన రేట్ల ప్రకారం, ఈ మొత్తాన్ని కేంద్ర, రాష్ట్రాలు పంచుకుంటాయి. ఇది కూడా సీఎస్‌ఎస్‌టీ తరహాలోనే జమ్మూ,కాశ్మీర్‌కు కాకుండా మొత్తం దేశానికి వర్తిస్తుంది. పరిమితిని 28 శాతం నుంచి 40 శాతానికి పెంచారు. ఆల్కాహాలిక్ లిక్కర్‌పై ఐజీఎస్టీ ఉండదు. యూటీజీఎస్టీ బిల్లు యూటీజీఎస్టీ(కేంద్ర పాలిత ప్రాంతం జీఎస్టీ)... కేంద్ర పాలిత ప్రాంతాల్లో వస్తువులు, సేవలపై పన్ను వసూళ్లకు యూటీజీఎస్టీ నిబంధనలు వర్తిస్తాయి. అసెంబ్లీలు లేని కేంద్ర పాలిత ప్రాంతాల్లో మాత్రమే యూటీజీఎస్టీ అమలవుతుంది. ఢిల్లీ, పుదుచ్చేరిలకు అసెంబ్లీలు ఉన్నందుకు ఆ రెండూ చోట్ల మాత్రం ఎస్జీఎస్టీ అమలవుతుంది. రాష్ట్రాలకు ఎస్జీఎస్టీ అమలవుతున్నందుకు కేంద్ర పాలిత ప్రాంతాల కోసం అతి తక్కువ సమయంలో యూటీజీఎస్టీని రూపొందించారు. ఎస్‌జీఎస్టీలోని నిబంధనలే దాదాపుగా యూటీజీఎస్టీలో పొందుపర్చారు. కొత్త ఏడాది, కొత్త చట్టం, కొత్త భారతం: మోదీ న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అనుబంధ బిల్లులను లోక్‌సభ బుధవారం ఆమోదించడం పట్ల ప్రధాని నరేంద్రమోదీ హర్షం వ్యక్తం చేశారు. బిల్లులు ఆమోదం పొందిన వెంటనే మోదీ హిందీలో ఓ ట్వీట్ చేస్తూ ‘జీఎస్టీ బిల్లులు ఆమోదం పొందినందుకు దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం, కొత్త చట్టం, కొత్త భారతం’అని పేర్కొన్నారు. బీజేపీ వల్లే 12లక్షలకోట్ల నష్టం: మొయిలీ న్యూఢిల్లీ: యూపీఏ హయాంలో జీఎస్టీని ప్రతిపాదిస్తే బీజేపీ అడ్డుపడిందని దీని వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు రూ.12లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని.. కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి వీరప్పమొయిలీ విమర్శించారు. లోక్‌సభలో జీఎస్టీపై చర్చ సందర్భంగా ప్రభుత్వంపై మొయిలీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఎన్డీయే ప్రభుత్వం తను తీసుకొచ్చిన విప్లవాత్మక పన్ను సంస్కరణలను మార్పుకు ముందడుగు’ అని చెప్పుకుంటున్నారని.. ఇది కేవలం అతి తక్కువ ప్రభావం చూపే చిరు ప్రయత్నం మాత్రమేనని మొయిలీ తెలిపారు. జీఎస్టీని సాంకేతిక పీడకలగా అభివర్ణించిన ఆయన.. దీని వల్ల లాభాలేమీ జరగవని, ఇదో అమానుషమైన నిర్ణయమని దుయ్యబట్టారు. రాష్ట్రాలకు పరిహార బిల్లు జీఎస్టీ అమలుతో రాష్ట్రాలకు ఏర్పడే నష్టం భర్తీ కోసం పరిహార చట్టాన్ని రూపొందించారు. నష్టాల భర్తీ కోసం రాష్ట్రాలకు మొదటి సంవత్సరం రూ. 50 వేల కోట్లు చెల్లించాల్సి రావచ్చని కేంద్రం అంచనా వేసింది. ఈ మొత్తంలో రూ. 26 వేల కోట్లను క్లీన్ ఎన్విరాన్మెంట్ సెస్సుగా వసూలు చేస్తారు. ఇక మిగతా రూ. 24 వేల కోట్లను పొగాకు, విలాసవంతమైన కార్లు, పాన్ మసాల, కొన్ని శీతల పానీయాలపై అదనపు పన్ను ద్వారా సేకరిస్తారు. జీఎస్టీ అమలు తేదీ నుంచి ఐదేళ్ల పాటు రాష్ట్రాలకు పరిహారం చెల్లిస్తారు. రెండు నెలలకోసారి రాష్ట్రాలకు చెల్లింపులు చేస్తారు. ఐదేళ్ల అనంతరం పరిహార నిధిలో మిగిలిన మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంచుకుంటాయి. -
లోక్‌సభలో జీఎస్టీ బిల్లు
► ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి జైట్లీ ► గరిష్టంగా 40 శాతం జీఎస్టీ ఉంటుందని స్పష్టీకరణ ► ఎజెండాలో లేకుండానే ప్రవేశపెట్టడంపై విపక్షాల ఆగ్రహం న్యూఢిల్లీ: దేశంలో పన్ను సంస్కరణలకు చరిత్రాత్మక ముందడుగుగా భావిస్తున్న వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)కి సంబంధించిన నాలుగు బిల్లులను కేంద్రం సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ కేంద్ర జీఎస్టీ (సీజీఎస్టీ), ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ (ఐజీఎస్టీ), కేంద్రపాలితప్రాంతాల జీఎస్టీ (యూజీఎస్టీ), పరిహార బిల్లులను ప్రవేశపెట్టారు. జూలై 1 నుంచి జీఎస్టీ విధానాన్ని అమల్లోకి తేవాలని భావిస్తున్న కేంద్రం.. ఈ బిల్లు ద్వారా భారత ఆర్థికాభివృద్ధి 2శాతం పెరుగుతుందని వెల్లడించింది. కాగా, ఈ బిల్లులను ప్రవేశపెట్టడంపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశాయి. రోజువారీ కార్యక్రమాల ఎజెండాలో జీఎస్టీని చేర్చకుండా.. పార్లమెంటు నియమాలకు విరుద్ధంగా హఠాత్తుగా ప్రకటన చేయటం సరికాదన్నాయి. దీనిపై పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి ఎస్ఎస్ అహ్లువాలియా స్పందిస్తూ.. శుక్రవారం అర్ధరాత్రే వీటిని లోక్‌సభ వెబ్సైట్లో చేర్చినట్లు తెలిపారు. అయితే గతవారం బీఏసీ సమావేశంలో దీన్ని చర్చించలేదని.. దీనికి తోడు అర్ధరాత్రి సభ్యులు ఇంటర్నెట్ చెక్ చేసుకోవాలా అని విపక్ష సభ్యులు ప్రశ్నిం చారు. కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే, మజ్లిస్ నేత అసదుద్దీన్ ఒవైసీ, టీఎంసీ సౌగతరాయ్ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించిన వారిలో ఉన్నారు. అయితే, శనివారం ఉదయమే సభ్యులకు బిల్లులను పంపించారని ఇందులో ఏవిధమైన పొరపాటూ జరగలేదని స్పీకర్ సుమిత్ర మహాజన్ స్పష్టం చేశారు. ఈ జీఎస్టీ బిల్లులకు కేంద్ర, అన్ని రాష్ట్రాల ఆర్థికమంత్రులు, కేంద్ర ఆర్థిక శాఖ అధికారులతో జీఎస్టీ కౌన్సిల్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. పరిహారం ఇలా! జైట్లీ ప్రవేశపెట్టిన వాటిలో రాష్ట్రాలకు పరిహారానికి సంబంధించిన బిల్లు కూడా ఉంది. జీఎస్టీ అమల్లో రాష్ట్రాలకు ఏమైనా నష్టాలొస్తే వాటిని కేంద్రం ఈ బిల్లు ద్వారా (తొలి ఐదేళ్లు మాత్రమే) చెల్లిస్తుంది. అయితే ఐదేళ్ల తర్వాత కేంద్రానికి ఈ బిల్లు రూపంలో భారీ మొత్తంలో ఆదాయం లభించనుంది. దీని ప్రకారం పరిహార నిధిని ఏర్పాటుచేస్తారు. ఆరోగ్యానికి హాని కలిగించే (పొగాకు ఉత్పత్తుల వంటివి), లగ్జరీ వస్తువులపై విధించే సెస్సు ద్వారా నిధిని సమకూర్చి రాష్ట్రాలకు పరిహారమిస్తారు. ఇది ఆయా వస్తువులపై జీఎస్టీకి అదనంగా గరిష్టంగా 18 శాతం ఉండాలని నిర్ణయించారు. -
నేడే లోక్‌సభకు జీఎస్టీ బిల్లులు
-
నేడే లోక్‌సభకు జీఎస్టీ బిల్లులు
మార్చి 29 లోగా ఆమోదం కోసం కేంద్రం కసరత్తు న్యూఢిల్లీ: జూలై 1 నుంచి జీఎస్టీ(వస్తు, సేవల పన్ను) చట్టాన్ని అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. ఆ మేరకు జీఎస్టీ అనుబంధ బిల్లులు నేడు పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. సీజీఎస్టీ (కేంద్ర జీఎస్టీ), ఐజీఎస్టీ(సమీకృత జీఎస్టీ), యూటీ జీఎస్టీ(కేంద్ర పాలిత ప్రాంత జీఎస్టీ), రాష్ట్రాలకు పరిహార చట్టాలను సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టి మార్చి 28లోపు చర్చ ముగించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఎక్సైజ్, కస్టమ్స్ చట్టంలోని వివిధ పన్నుల రద్దు కోసం సవరణలు, జీఎస్టీ అమలు నేపథ్యంలో ఎగుమతులు దిగుమతుల కోసం ఉద్దేశించిన బిల్లుల్ని కూడా సభలో ప్రవేశపెడతారని సమాచారం. బిల్లులపై ఎంత సమయం చర్చించాలన్న అంశంపై సోమవారం ఉదయం లోక్‌సభ బీఏసీ సమావేశమై నిర్ణయం తీసుకుంటుందని కొన్ని వర్గాలు వెల్లడించాయి. మార్చి 29 లేదా 30 లోగా లోక్‌సభలో జీఎస్టీ బిల్లుల్ని ఆమోదింపచేసి అనంతరం రాజ్యసభకు పంపనున్నారు. ఒకవేళ బిల్లులకు రాజ్యసభలో ఏవైనా సవరణలు సూచిస్తే వాటిపై లోక్‌సభలో చర్చిస్తారు. ఆ సవరణల్ని లోక్‌సభ ఆమోదించవచ్చు లేదంటే తిరస్కరించవచ్చు. జీఎస్టీ బిల్లుల్ని ద్రవ్య బిల్లులుగా ప్రవేశపెడుతున్నందున రాజ్యసభ ఆమోదం అవసరం లేకపోయినా.. ఇరు సభల్లో చర్చ జరగాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. బిల్లులు పార్లమెంట్ ఆమోదం పొందాక.. ఎస్జీఎస్టీ బిల్లును రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించాల్సి ఉంది. జీఎస్టీ నెట్వర్క్ వివరాలు వెల్లడించలేం: కేంద్ర హోం శాఖ జీఎస్టీ అమలు కోసం సిద్ధం చేసిన గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ నెట్వర్క్(జీఎస్టీఎన్) భద్రతా అనుమతుల వివరాలు వెల్లడించా లన్న ఆర్టీఐ దరఖాస్తును కేంద్ర హోం శాఖ తిరస్కరించింది. దరఖాస్తుదారుడు కోరిన అంశం జాతీయ భద్రతా అనుమతులకు సంబంధించిందని, ఆర్టీఐ చట్టం 2005, సెక్షన్ 8(1)(జీ) ప్రకారం వాటికి మినహాయింపు ఉండడంతో ఆ వివరాలు వెల్లడించలేమని హోం శాఖ సమాధానమిచ్చింది. -
సంస్కరణలపై అనిశ్చితితో నష్టాలు
చివర్లో అమ్మకాల వెల్లువ - సెన్సెక్స్ శ్రేణి.. ప్లస్ 182 - మైనస్ 218 - చివరకు 135 పాయింట్ల నష్టంతో 28,102 వద్ద ముగింపు... - 39 పాయింట్లు క్షీణించి 8,526కు నిఫ్టీ ట్రేడింగ్ చివరి అరగంటలో అమ్మకాల వెల్లువ కారణంగా సోమవారం స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. భూ సేకరణ, జీఎస్టీ బిల్లులు ఈ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఆమోదం పొందే అవకాశాల్లేవన్న ఆందోళనతో లాభాల స్వీకరణ జరిగి అమ్మకాలు పోటెత్తాయి. దీంతో అప్పటివరకూ లాభాల్లో ఉన్న స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల పాలయ్యాయి. బీఎస్ఈ సెనెక్స్ 135 పాయింట్లు క్షీణించి 28,102 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 39 పాయింట్లు నష్టపోయి 8,526 పాయింట్ల వద్ద ముగిశాయి. రెండు వారాల్లో సెన్సెక్స్‌కు ఇదే ఒక రోజు అత్యధిక పతనం. డాలర్‌తో రూపాయి మారకం విలువ తగ్గిపోవడం, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు జరపడం, ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగియడం, యూరోప్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభం కావడం కూడా ప్రభావం చూపాయి. ఆయిల్, ఎఫ్ఎంసీజీ, కొన్ని టెక్నాలజీ, వాహన షేర్లు నష్టపోయాయి. తీవ్ర ఒడిదుడుకులు..: సెన్సెక్స్ 28,251 పాయింట్ల వద్ద లాభాల్లోనే ప్రారంభమైంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గడంతో దిగుమతుల బిల్లు తగ్గగలదన్న అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల బాగా తగ్గి ఆకర్షణీయంగా ఉన్న బ్లూ చిప్ షేర్లలో కొనుగోళ్ల జోరు పెరిగింది. దీంతో సూచీలు లాభాల్లోనే సాగాయి. సెన్సెక్స్ ఒక దశలో 28,419 పాయింట్ల (శుక్రవారం నాటి ముగింపుతో పోల్చితే 182 పాయింట్లు లాభపడింది) గరిష్ట స్థాయిని తాకింది. అమ్మకాల వెల్లువ కారణంగా 28,018 పాయింట్ల (శుక్రవారం నాటి ముగింపుతో పోల్చితే 218 పాయింట్లు నష్టం)కు పడిపోయింది. 20 సెన్సెక్స్ షేర్లకు నష్టాలు 30 సెన్సెక్స్ షేర్లలో 20 షేర్లు నష్టాల్లో ముగిశాయి. 1,529 షేర్లు నష్టాల్లో, 1,424 షేర్లు లాభాల్లో ముగిశాయి. టర్నోవర్ బీఎస్ఈలో రూ.3,105 కోట్లుగా, ఎన్ఎస్ఈ నగదు విభాగంలో రూ.16,379 కోట్లుగా, ఎన్ఎస్ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.1,78,752 కోట్లుగా నమోదైంది.