స్థానిక యువతకు ఉపాధి

Andhra Pradesh government pays special attention to skill development - Sakshi

రాష్ట్రంలో 66 పరిశ్రమలకు 11,981 మంది నిపుణులు అవసరం

జిల్లాలవారీగా మానవ వనరుల వివరాల సేకరణ

23 రంగాలకు చెందిన 48 కోర్సుల్లో శిక్షణకు ఏర్పాట్లు

స్కిల్‌ డెవలప్‌మెంట్‌తో కలిసి పరిశ్రమల శాఖ కసరత్తు 

సాక్షి, అమరావతి: పరిశ్రమల్లో స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించే లక్ష్యంతో నైపుణ్యాభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులను మ్యాపింగ్‌ చేసి శిక్షణ ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ జి.సృజన ‘సాక్షి’కి తెలిపారు. జిల్లాలవారీగా మానవ వనరుల వివరాలను సేకరించి శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. కొన్ని పరిశ్రమలు ఆయా సంస్థల్లోనే శిక్షణ ఇవ్వడానికి ముందుకు వచ్చినట్లు వివరించారు. ఐటీఐ, పాలిటెక్నిక్‌ కళాశాలలు, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రాల్లో శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

అదానీ పోర్టులో భారీ అవకాశాలు
ఒక్క నెల్లూరు జిల్లాలోనే పోర్టులు, లాజిస్టిక్‌ రంగంలో ఏకంగా 5,650 మంది మానవ వనరుల అవసరం ఉన్నట్లు అదాని పోర్టు తెలియచేయడమే కాకుండా శిక్షణ ఇచ్చేందుకు ముందుకొచ్చింది. కర్నూలులో రాంకో సిమెంట్, వైఎస్‌ఆర్‌ కడపలో దాల్మియా సిమెంట్, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్‌ తదితర సంస్థలు విద్యార్థులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయి.

తొలిదశలో 11,981 మంది అవసరం
జిల్లాలవారీగా సేకరించిన సమాచారం ప్రకారం ఈ ఏడాది 11,981 మంది నిపుణులైన మానవ వనరులు అవసరమని వివిధ పరిశ్రమల నుంచి ప్రతిపాదనలు వచ్చినట్లు పరిశ్రమల శాఖ అధికారులు వెల్లడించారు. మొత్తం 23 రంగాలకు చెందిన 66 పరిశ్రమలకు సంబంధించి 48 కోర్సుల్లో శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కోర్సుల కాలపరిమితి మూడు నెలల నుంచి ఏడాది వరకు ఉంటుంది. శిక్షణ అనంతరం అదే సంస్థలో ఉద్యోగంలో చేరేలా అవకాశం కల్పిస్తున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top