రియల్‌ టైం క్రాప్‌ మేనేజ్‌మెంట్‌లో ఏపీ ఫస్ట్‌

Andhra Pradesh Is First In Real Time Crop Management - Sakshi

సాక్షి, అమరావతి: ఏ పంట.. ఎంత విస్తీర్ణంలో సాగవుతుందో గుర్తించడంలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని వ్యవసాయ శాఖ స్పెషల్‌ కమిషనర్‌ చేవూరు హరికిరణ్‌ తెలిపారు. కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన రియల్‌ టైం క్రాప్‌ మేనేజ్‌మెంట్‌ ద్వారా సర్వే నంబర్ల వారీగా సాగవుతున్న పంటల గుర్తింపులో మన రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందన్నారు. ఈ విషయాన్ని కేంద్రం అధికారికంగా వెల్లడించిందన్నారు. మూడేళ్లుగా రాష్ట్ర ప్రభు త్వం విజయవంతంగా అమలు చేస్తున్న ఈ–క్రాప్‌ వల్లే ఇది సాధ్యమైందన్నారు.
చదవండి: అతి త్వరలో గడపగడపకు వైద్యం

జిల్లా వ్యవసాయాధికారులు, సహాయ సంచాలకులు, మండల అధికారులతో మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ సీఎం వైఎస్‌ జగన్‌ ఆలోచనల నుంచి పుట్టిన ఈ–క్రాప్‌ విధానం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. జాతీయ స్థాయిలో అగ్రిస్టాక్‌ డిజిటల్‌ అగ్రికల్చర్‌ పేరిట దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు కేంద్రం ఆదేశాలు జారీ చేసిందన్నారు.

ఈ–క్రాప్‌ అమలులో ఏపీని కూడా భాగస్వామిని చేయడం గర్వకారణమన్నారు. ఇన్‌పుట్‌ సబ్సిడీ, ధాన్యం కొనుగోలు, పంటల బీమా వంటి అన్ని పథకాలు ఈ–క్రాప్‌ ప్రామాణికంగానే అమలు చేస్తున్నామన్నారు. ఇప్పటికే ఈ–క్రాప్‌ నమోదు చేసిన రైతులందరికీ ఈ–కేవైసీ (మీ పంట తెలుసుకోండి) నమోదు ప్రారంభించాలన్నారు. ‘వైఎస్సార్‌ యంత్ర సేవ’ కింద కిసాన్‌ డ్రోన్‌ల మంజూరుకు రైతు గ్రూపుల ఎంపికను సత్వరమే పూర్తి చేయాలన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top