‘పాలమూరు’ నిబంధనలకు విరుద్ధం | Andhra Pradesh farmers went to the National Green Tribunal | Sakshi
Sakshi News home page

‘పాలమూరు’ నిబంధనలకు విరుద్ధం

Jul 6 2021 3:58 AM | Updated on Jul 6 2021 4:00 AM

Andhra Pradesh farmers went to the National Green Tribunal - Sakshi

సాక్షి, అమరావతి: పర్యావరణ ప్రభావ అంచనా (ఎన్విరాన్‌మెంటల్‌ ఇంపాక్ట్‌ అసెస్‌మెంట్‌–ఈఐఏ) నోటిఫికేషన్‌లోని నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని కొనసాగిస్తోందని, ఇందులో జోక్యం చేసుకుని న్యాయం చేయాలంటూ రాయలసీమ, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన రైతులు జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్‌జీటీ)ను ఆశ్రయించారు. నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం భారీ ప్రాజెక్టు చేపడుతున్నా కేంద్ర ప్రభుత్వం, కృష్ణా వాటర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయని డి.చంద్రమౌళీశ్వరరెడ్డి సహా 9 మంది రైతులు దాఖలు చేసిన పిటిషన్‌లో ఎన్‌జీటీకి వివరించారు. కృష్ణా వాటర్‌ ట్రిబ్యునల్‌ అవార్డుల ప్రకారం ఎలాంటి కేటాయింపులు లేకపోయినా తెలంగాణ ప్రభుత్వం పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. అక్రమ నిర్మాణానికి పూనుకున్న తెలంగాణ ప్రభుత్వంపై చర్యలు తీసుకునేలా కేంద్ర ప్రభుత్వాన్ని, కృష్ణా వాటర్‌ ట్రిబ్యునల్‌ను ఆదేశించాలని  అభ్యర్థించారు. ప్రాజెక్టు పనులను నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. తెలంగాణ చేపడుతున్న ఈ ప్రాజెక్టు వల్ల తమ ప్రాంత రైతులందరూ తీవ్రంగా నష్టపోతారని పిటిషన్‌లో వివరించారు. 

ఏపీ రైతులు తీవ్రంగా నష్టపోతారు
శ్రీశైలం రిజర్వాయర్‌ నుంచి 90 టీఎంసీల మిగులు జలాలను ఎత్తిపోసేందుకు ఉద్దేశించిన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వల్ల తమ ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమై రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎస్‌ఆర్‌బీసీ, కేసీ కెనాల్, నాగార్జున సాగర్, కృష్ణా డెల్టాలపై కూడా తీవ్ర ప్రభావం ఉంటుందన్నారు. తెలుగు గంగ ప్రాజెక్టు కింద వ్యవసాయంపై ఆధారపడి ఉన్న వారిపైన, చెన్నైకి తాగునీరు సరఫరాపైన కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని వివరించారు. పునర్విభజన చట్టం ప్రకారం కేంద్ర జల సంఘం, కృష్ణా వాటర్‌ బోర్డు, అపెక్స్‌ కౌన్సిల్‌ ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి కొత్త ప్రాజెక్టులు చేపట్టరాదని తెలిపారు. కృష్ణా ట్రిబ్యునల్‌–1 ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టేటస్‌–కో ఉన్న నేపథ్యంలో, ట్రిబ్యునల్‌ కేటాయించిన 811 టీఎంసీల నీటిని 512:299 నిష్పత్తిలో పంపిణీ చేసుకునేందుకు ఇరు రాష్ట్రాలు అంగీకరించాయని వివరించారు. ఇదిలా ఉండగానే తెలంగాణ రాష్ట్రం శ్రీశైలం రిజర్వాయర్‌ నుంచి 80 టీఎంసీల నీటిని వాడుకునేందుకు పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని చేపట్టిందన్నారు. ఈఐఏ నోటిఫికేషన్‌ ప్రకారం ప్రాజెక్టును ప్రారంభించాలంటే ముందస్తు పర్యావరణ అనుమతులు తప్పనిసరి కాగా, దీనికి ఎలాంటి అనుమతులు లేవని పేర్కొన్నారు.వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ ప్రాజెక్టు విషయంలో జోక్యం చేసుకోవాలని రైతులు హరిత ట్రిబ్యునల్‌ను అభ్యర్థించారు. 

ఏపీపై తెలంగాణ సర్కారు పిటిషన్‌
రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పనులు చేయవద్దంటూ గత ఏడాది ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ ఆంధ్రప్రదేశ్‌ అధికారులు క్షేత్రస్థాయిలో పనులు చేపట్టారని, వారితో పాటు సంబంధిత ప్రైవేటు వ్యక్తులపైనా కోర్టు ధిక్కారం కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం ఎన్‌జీటీలో ధిక్కార పిటిషన్‌ దాఖలు చేసింది. ప్రధాన ప్రాజెక్టు పనులు చేపట్టే ఉద్దేశం లేదని, ట్రిబ్యునల్‌ ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించబోమంటూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎన్‌జీటీకీ లిఖితపూర్వక హామీ ఇచ్చారని తన పిటిషన్‌లో పేర్కొంది. ఈ హామీకి విరుద్ధంగా రూ.3,278 కోట్లతో ప్రాజెక్ట్‌ పనులను చేపట్టిందని వివరించింది. ముందస్తు అనుమతులు లేకుండా ప్రాజెక్టు పనులు చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించింది.  

ఈ దశలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేం 
గాలేరు–నగరి సుజల స్రవంతి, హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకాల కింద ఎలాంటి అనుమతులు లేకుండా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చిత్తూరు జిల్లాలో రిజర్వాయర్ల నిర్మాణం చేపడుతోందని, ఇందులో జోక్యం చేసుకోవాలంటూ చిత్తూరు జిల్లా రైతులు జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్‌జీటీ)లో పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌పై సోమవారం ఎన్‌జీటీ సభ్యులు జస్టిస్‌ రామకృష్ణన్, కె. సత్యగోపాల్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. వాదనలు విన్న ధర్మాసనం, ఈ వ్యాజ్యంలో ప్రస్తుతం ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టంచేసింది. అంతేకాక.. ఈ వ్యాజ్యాన్ని విచారణకు సైతం స్వీకరించలేమంది. ఏపీ ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేసిన తర్వాతే స్పందిస్తామని తేల్చిచెప్పింది. అలాగే, రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి దాఖలైన వ్యాజ్యాల్లో ఇది భాగమని తేలితే భారీ జరిమానా విధిస్తామని స్పష్టంచేసింది. తదుపరి విచారణను ఈనెల 23కి వాయిదా వేసింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement