జాతీయ నైపుణ్య పోటీల్లో సత్తా చాటిన ఏపీ

Andhra Pradesh excelled in national skill competitions - Sakshi

పాల్గొన్న 30 మంది విద్యార్థుల్లో 17 మందికి పతకాలు

వారిలో ఏడుగురికి స్వర్ణాలు

చైనాలో జరిగే ప్రపంచస్థాయి నైపుణ్య పోటీలకు అర్హత 

సాక్షి, న్యూఢిల్లీ/అమరావతి: జాతీయ స్థాయి నైపుణ్య పోటీల్లో ఏపీ సత్తా చాటింది. రాష్ట్రానికి చెందిన 30 మంది విద్యార్థులు మొత్తం 17 విభాగాల్లో పోటీపడి 17 పతకాలను సాధించారు. ఇందులో ఏడుగురు బంగారు పతకాలను కైవసం చేసుకోగా, నాలుగు వెండి, రెండు కాంస్య, నాలుగు ప్రత్యేక ప్రతిభా పురస్కారాలను అందుకున్నారు. జనవరి 6 నుంచి 10 వరకు న్యూఢిల్లీలో 54 వాణిజ్య విభాగాల్లో నిర్వహించిన ఈ పోటీలకు 26 రాష్ట్రాలకు చెందిన 500 మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. పోటీల్లో గెలిచిన విజేతల వివరాలను స్కిల్‌ ఇండియా సోమవారం ప్రకటించింది.

వీరికి సోమవారం ఢిల్లీలోని తాల్‌కటోరా స్టేడియంలో కేంద్ర స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేశ్‌ అగర్వాల్‌ బహుమతులు అందించారు. వీరంతా చైనాలోని షాంఘైలో ఈ ఏడాది అక్టోబర్‌లో జరగనున్న ప్రపంచస్థాయి నైపుణ్య పోటీల్లో పాల్గొననున్నారు. కాగా, ఇతర పతకాలు సాధించిన వారిలో కొంతమందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి ప్రతిభ గల వారిని ప్రత్యేక ఆహ్వానితులుగా అంతర్జాతీయ పోటీకి ఎంపిక చేస్తారు. పతకాలు గెలిచిన విద్యార్థులకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, ఏపీ ఎస్‌ఎస్‌డీసీ చైర్మన్‌ కొండూరు అజయ్‌రెడ్డి, ఎండీ ఎన్‌.బంగార్రాజు అభినందనలు తెలిపారు. అంతర్జాతీయ పోటీల్లో కూడా రాష్ట్ర విద్యార్థులు సత్తా చాటే విధంగా ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు గౌతమ్‌రెడ్డి చెప్పారు.

పతకాలు సాధించిన విద్యార్థులు వీరే
అడిటేటివ్‌ మాన్యుఫాక్చరింగ్‌ విభాగంలో పి. శ్రీమన్నారాయణ, క్లౌడ్‌ కంప్యూటింగ్‌లో పి.శ్రీకర్‌సాయి, సైబర్‌ సెక్యూరిటీలో శ్రీహరి, ఎలక్ట్రానిక్స్‌లో కే ఈశ్వర్, మొబైల్‌ అప్లికేషన్‌ డెవలప్‌మెంట్‌ విభాగంలో లావణ్య సాయికుమార్, మొబైల్‌ రోబోటిక్స్‌లో శ్రీనివాస్, పవన్‌కుమార్‌ బంగారు పతకాలను కైవసం చేసుకున్నారు. డిజిటల్‌ కన్‌స్ట్రక్షన్‌ వర్క్‌ విభాగంలో వాణీప్రియాంక, మొబైల్‌ అప్లికేషన్‌ డెవలప్‌మెంట్‌లో వెంకటరెడ్డి, రోబో సిస్టమ్‌ ఇంటిగ్రేషన్‌లో రవి వంశీకృష్ణ, జగదీష్‌ వెండి పతకాలు సాధించారు. ఐటీ సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్స్‌ ఫర్‌ బిజినెస్‌లో జె.సాయిరిషితశ్రీ,, యోగాలో చల్లా శంకర్‌ కాంస్య పతకాలు, ఐటీ నెట్‌వర్క్‌ సిస్టం అడ్మినిస్ట్రేటర్‌ విభాగంలో వై.లహరి, రిఫ్రిజిరేషన్‌ అండ్‌ ఎయిర్‌ కండిషనింగ్‌లో పి.వేణుగోపాలరావు, రోబో సిస్టం ఇంటిగ్రేషన్‌లో రవితేజ, జాహ్నవి మెడాలియన్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ప్రత్యేక పురస్కారాలు అందుకున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top