మేత ధర పెంచితే ఊరుకోం | Andhra Pradesh aqua farmers oppose steep hike in shrimp feed prices | Sakshi
Sakshi News home page

మేత ధర పెంచితే ఊరుకోం

May 16 2026 3:56 AM | Updated on May 16 2026 3:56 AM

Andhra Pradesh aqua farmers oppose steep hike in shrimp feed prices

సమావేశంలో పాల్గొన్న అప్సడా, ఏఏబీసీ ప్రతినిధులు, అధికారులు

తయారీదారులకు తెగేసి చెప్పిన ఆక్వా రైతుల ప్రతినిధులు 

వాడివేడిగా అప్సడా, ఆక్వా సలహా కమిటీ సమావేశం

ధర పెంచకపోతే వ్యాపారం చేయలేమన్న తయారీ సంస్థలు 

గ్రామాల్లో తిరగలేకపోతున్నామన్న అప్సడా ప్రతినిధులు 

కీలక సమావేశానికి మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు డుమ్మా  

సీఎం చంద్రబాబు సమక్షంలో చర్చించాక ధరల పెంపుపై తుది నిర్ణయం

సాక్షి, అమరావతి: మేత ధరలు పెంచితే ఊరుకునే ప్రసక్తే లేదని ఆక్వా రైతు సంఘాల నేతలు తేల్చి చెప్పారు. అర్ధ రూపాయి పెంచినా సహించబోమని స్పష్టం చేశారు. అప్సడా (ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఆక్వాకల్చర్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ) అనుమతి లేకుండా, ఏ ఒక్కరితోనూ చర్చించకుండా ఫిబ్రవరిలో టన్నుకు రూ.4 వేలు పెంచారని, మళ్లీ ఇప్పుడు పెంచితే ఏ విధంగా బతకాలని నిలదీశారు. రొయ్య మేత ధరల పెంపు వ్యవహారంపై సచివాలయంలో శుక్రవారం అప్సడా, ఆక్వా రైతుల సలహా కమిటీ (ఏఏబీసీ) సమావేశం వాడివేడిగా జరిగింది. కీలకమైన ఈ భేటీకి మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గైర్హాజరయ్యారు. ఆక్వా రైతులు, రైతు సంఘాల ప్రతినిధులను కాదని అప్సడా, ఏఏబీసీ సభ్యులతోనే ఈ సమావేశం నిర్వహించాలని భావించారు.

కానీ క్షేత్ర స్థాయిలో వచి్చన ఒత్తిళ్లతో శుక్రవారం ఉదయం ఆక్వా సాగు జిల్లా రైతు సంఘాల నేతలకు ఫోన్‌ చేసి సమావేశానికి హాజరు కావాల్సిందిగా కోరారు. కృష్ణా, ఉభయగోదావరి జిల్లాలకు చెందిన ఆక్వా రైతు ప్రతినిధులు పాల్గొన్న ఈ సమావేశం మత్స్యశాఖ స్పెషల్‌ సీఎస్‌ బుడితి రాజశేఖర్‌ అధ్యక్షతన జరిగింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. తొలుత ఫీడ్‌ తయారీ సంస్థల ప్రతినిధులు మాట్లాడుతూ అంతర్జాతీయంగా ముడి సరుకుల ధరలు 30 శాతం మేర పెరిగాయని, అత్యధికంగా ఫిష్‌ మీల్‌ టన్నుకు రూ.17 వేల మేర పెరిగిందన్నారు.

కిలో మేత ఉత్పత్తికి రూ.4 విద్యుత్‌కే ఖర్చు చేయాల్సి వస్తోందన్నారు. దేశీయంగా 3.5 లక్షల టన్నుల ఫిష్‌ మీల్‌ ఉత్పత్తి అవుతుండగా, విదేశాలకు 2 లక్షల టన్నుల వరకు ఎగుమతి అవుతుందన్నారు. ఈ కారణంగానే దేశీయ అవసరాలకు ఫిష్‌ మీల్‌ను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకోవల్సి వస్తుందని వివరించారు. సోయాబీన్‌ ధరలు కూడా పెరగడంతో ఉత్పత్తి వ్యయం పెరిగిందని చెప్పుకొచ్చారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో టన్నుకు రూ.12 వేల నుంచి రూ.14 వేల చొప్పున పెంచేందుకు అనుమతి కోరామన్నారు. రైతులపై ఒకేసారి భారం పడకూడదని వెనామీ ఫీడ్‌పై రూ.8,430, టైగర్‌ ఫీడ్‌పై రూ.10,520 వరకు పెంపు ప్రతిపాదన చేశామన్నారు. కనీసం ఆక్వా రైతుల మాదిరిగానే ఫీడ్‌ తయారీదారులకు సబ్సిడీపై విద్యుత్‌ సరఫరా చేస్తే భారం తగ్గుతుందని చెప్పారు.

‘సిబా’ అధికారులపై రైతుల మండిపాటు
సిబా (సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్రాకిష్ వాటర్‌ ఆక్వాకల్చర్‌) అధికారులు ఫీడ్‌ తయారీదారులకు వంత పాడుతూ ఫీడ్‌ తయారీ సంస్థలపై రైతులు అపోహతో ఉన్నారని, వాళ్లకో ఫీడ్‌ మిల్లు అప్పగిస్తే దాంట్లో సాధకబాధకాలు అర్థమవుతాయని చెప్పడంతో వారిపై రైతులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రైతుల కష్ట నష్టాలు మీకేం తెలుసని, సిబా పనితీరు అధ్వానంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్సడా కో వైస్‌ చైర్మన్‌ ఆనం వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ రైతులు క్రమశిక్షణా యుతంగా లేరని, నీటి నిర్వహణ సక్రమంగా నిర్వహించకుండా కలుíÙతం చేస్తున్నారని, ఈ కారణంగానే వైరస్‌లు సోకుతున్నాయని అన్నారు. ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్స్‌ కంపెనీ ఏర్పాటు చేసుకోవాలని సూచించినా రైతులు పట్టించుకోలేదన్నారు. దీనిపై రైతు ప్రతినిధులు మండిపడ్డారు.

అన్నింటికి రైతులను తప్పు పట్టడం సరికాదని రైతు నేతలు హితవు పలికారు. ముడి సరుకుల ధరలు తగ్గినప్పుడు ఫీడ్‌ ధరలు తగ్గించేందుకు ఒక్క ఫీడ్‌ కంపెనీ కూడా ముందుకు రాలేదన్నారు. ఫిష్‌ మీల్‌ ఎగుమతులను నిలిపివేస్తే, దిగుమతి చేసుకోవల్సిన అవసరం ఉండదని, సోయాబీన్‌ ధరలను సాకుగా చూపొద్దని అన్నారు. ఫీడ్‌ ధర ఒకేసారి భారీగా పెంచడం వల్ల గ్రామాల్లో తిరగలేకపోతున్నామని, రైతుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని అప్సడా ప్రతినిధులు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. రైతు సంఘాలు, ఫీడ్‌ తయారీదారుల ప్రతిపాదనలను రెండు రోజుల్లో సీఎం చంద్రబాబు సమక్షంలో చర్చించి, ఆమోదయోగ్యమైన నిర్ణయానికి వద్దామని ఆనం సూచించా రు. సమావేశంలో మత్స్యశాఖ కమిషనర్‌ రామ్‌శంకర్‌ నాయక్‌ పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement