Sakshi News home page

కొత్తగా... 850 ఎంబీబీఎస్‌ సీట్లు

Published Tue, Dec 12 2023 5:59 AM

Andhra Pradesh to add five Medical Colleges adding 750 MBBS seats - Sakshi

సాక్షి, అమరావతి : వచ్చే విద్యా సంవత్సరం నుంచి మరో 850 వైద్య సీట్లను అందుబాటులోకి తెచ్చేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ విద్యా సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ఐదు నూతన వైద్య కళాశాలలను ప్రారంభించడం ద్వారా 750 సీట్లను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని ప్రతి ప్రాంతానికి సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు చేరువ చేయడంతో పాటు, మన విద్యార్థులకు వైద్య విద్యావకాశాలు పెంచేలా ఏకంగా 17 కొత్త కళాశాలలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న విష­యం తెలిసిందే.

2024–25 విద్యా సంవత్సరం నుంచి పాడేరు, పులివెందుల, ఆదో­ని, మార్కాపురం, మదనపల్లె వైద్య కళాశాలలను ప్రభుత్వం ప్రారంభించనుంది. ఐదు చోట్ల వైద్య విధాన పరిషత్‌ ఆస్పత్రులను బోధనాస్పత్రులుగా అభివృద్ధి చేయడంతో పాటు, వైద్య కళాశాలలకు 222, బోధనాస్పత్రికి 484 చొప్పున 3,530 పోస్టులను మంజూరు చేశారు. ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ దాదాపు పూర్తయింది. వసతుల కల్పన వేగంగా కొనసాగుతోంది. ఒక్కోచోట 150 చొప్పున 750 సీట్ల కోసం నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌(ఎన్‌ఎంసీ)కు దరఖాస్తు చేశారు.

మరోవైపు అనంతపురం వైద్య కళాశాలలో 50, నెల్లూరు, శ్రీకాకుళం కళాశాలల్లో ఒక్కో చోట 25 చొప్పున 50 ఎంబీబీఎస్‌ సీట్ల పెంపునకు దరఖాస్తు చేశారు. ప్రస్తుతం అనంతపురంలో 150, శ్రీకాకుళంలో 175, నెల్లూరులో 175 సీట్లున్నాయి. కాగా, ఒక్కో చోట 200 ఎంబీబీఎస్‌ సీట్లకు అనుగుణంగా బోధనాస్పత్రుల్లో పడకలు, వైద్యులు, సిబ్బంది, ఇతర వనరులున్నాయి. దీంతో 200 సీట్లను పెంచేలా ఎన్‌ఎంసీకి దరఖాస్తు చేశారు. నూతన వైద్య కళాశాలలతో పాటు, అనంత, శ్రీకాకుళం, నెల్లూరు కళాశాలల్లో ఎన్‌ఎంసీ బృందం త్వరలో ఇన్‌స్పెక్షన్‌కు రానుంది.    

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా..  
ప్రతి కొత్త జిల్లాకు ఒక వైద్య కళాశాల ఉండే­లా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం రూ.8,480 కోట్లతో 17 కొత్త వైద్య కళాశాలలను ఏర్పా­టు చేస్తోంది. తద్వారా ఏకంగా 2,550 ఎంబీబీఎస్‌ సీట్లను అందుబాటులోకి తెస్తోంది. ఈ నేపథ్యంలో వందేళ్ల చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఈ విద్యా సంవత్సరంలో ఐదు కళాశాలలను ప్రారంభించడం ద్వారా 750 ఎంబీబీఎస్‌ సీట్లను అందుబా­టులోకి తెచ్చారు. వచ్చే విద్యా సంవత్సరం మరో ఐదు కళాశాలలు ప్రారంభించడం ద్వారా ఒక్కో చోట 150 చొప్పున 750 సీట్లు సమకూరనున్నాయి. ఇక మిగిలిన ఏడు వైద్య కళాశాలలను 2025–26 విద్యా సంవత్సరంలో ప్రారంభించేలా ప్రణాళికలు రచించారు.

నిబంధనలకనుగుణంగా వనరులు   
ఐదు కొత్త కళాశాలలను ప్రారంభించడానికి వీలుగా అన్ని విధాలా సిద్ధమవుతున్నాం. ఇప్పటికే ఐదు చోట్ల అసిస్టెంట్, అసోసియేట్‌ ప్రొఫెసర్, ప్రొఫెసర్లు, ఇతర పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టాం. కళాశాలలు, బోధనాస్పత్రుల్లో ఎన్‌ఎంసీ నిబంధనలకనుగుణంగా ఏపీఎంఎస్‌ఐడీసీ వనరులు సమకూరుస్తోంది. ఎన్‌ఎంసీ బృందం తనిఖీలకు రావాల్సి ఉంది.   – డాక్టర్‌ నరసింహం, డీఎంఈ

Advertisement

What’s your opinion

Advertisement