‘ఉపాధి’లో ఏపీనే ఫస్ట్‌

Amid Covid Crisis AP Government Created Employment To Needy People And Stand At No 1 Position - Sakshi

గత మూడు నెలల్లో రూ.3,613 కోట్లు కూలీగా చెల్లింపు 

ఇప్పటికీ రోజుకు 40 లక్షల మందికి పనులు

42 లక్షల కుటుంబాలకు 16.7 కోట్ల పని దినాలు

  తరచూ సీఎం జగన్‌ సమీక్షల వల్ల లక్ష్యానికి మించి పనులు 

అత్యధికంగా పనులు కల్పించడంలో దేశంలో ఏపీనే ఫస్ట్‌    

సాక్షి, అమరావతి:  ‘ఈ కరోనా కష్టాలలో ప్రభుత్వం దయ చూపించకపోయి ఉంటే మా బతుకులు ఏమి అయి ఉండేవో’ అని ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం నేకునాంబాద్‌ గ్రామానికి చెందిన మానుకొండ సుబ్బారత్నం (49) అంటున్నాడు. ఇతని కుటుంబం తమకున్న 70 సెంట్ల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ.. అదనంగా ఇంట్లో కుట్టు మిషన్‌ పెట్టుకొని పని దొరికనప్పుడు టైలరింగ్‌ చేసుకుంటూ, మిగిలిన రోజులలో కూలి పనులు చేసుకుంటుంది. ఇద్దరు పిల్లలు చదువుకుంటున్నారు. ఆ చిన్నపల్లెటూరిలో మాములు రోజుల్లోనే టైలరింగ్‌ ద్వారా నెలకు నాలుగు వేల ఆదాయం దాటేది కాదు. కరోనా కాలంలో టైలరింగ్‌ జరగడమే లేదు. వ్యవసాయ పనులు తగ్గిపోయాయి. ఈ స్థితిలో ప్రభుత్వం కల్పించే ‘ఉపాధి’ పనులే దిక్కు అయ్యాయి. సుబ్బారత్నం భార్య మోకాళ్ల నొప్పులతో కూలీ పనులు చేసే పరిస్థితిలో లేదు. దీంతో అతనొక్కడే ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు 40 రోజుల పాటు పని చేసి, రూ.9,203 సంపాదించుకున్నాడు. దీనికి తోడు రైతు భరోసా పథకం ద్వారా రూ.5,500 అందింది. ఈ గ్రామంలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో మే 12వ తేదీ నుంచి దాదాపు నెల రోజుల పాటు ప్రభుత్వం కూలీ పనులు కూడా నిలిపివేసింది. మొత్తంగా ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి ఇప్పుటి వరకు మొత్తం 9 వారాల పాటు ఆ గ్రామంలో ప్రభుత్వం పనులు కల్పించింది. తద్వారా దాదాపు 271 కుటుంబాలు సరాసరిన రూ.8,586 చొప్పున సంపాదించుకున్నాయి. ఈ ఒక్క గ్రామంలోనే ప్రభుత్వం రూ.23.27 లక్షలు కూలీలకు వేతనంగా చెల్లించింది.  

నెల రోజులుగా నిత్యం 40 లక్షల మందికి పని 
రాష్ట్రంలో ప్రస్తుతం ప్రతి రోజూ దాదాపు 40 లక్షల మంది కూలీలు ప్రభుత్వం కల్పించే పనులకు హాజరవుతున్నారు. గత నెల రోజులుగా ఇదే సంఖ్యలో కూలీల హాజరు ఉందని అధికార వర్గాలు తెలిపాయి. గత మూడు నెలల్లో గ్రామాల్లో పని కావాలి.. అని అడిగిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం పనులు కల్పించింది. ఇందుకోసం రూ.3,613.35 కోట్లను కూలి రూపంలో చెల్లించింది. కరోనా రెండో విడత విజృంభణతో గత మూడు నెలల్లో పట్టణాలు సహా గ్రామాల్లో చాలా చోట్ల ప్రజలు బయటకు రావాలంటేనే భయపడిపోయారు. అలాంటి పరిస్థితులలో కూలీల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఈ మూడు నెలల్లో మొత్తం 16.7 కోట్ల పనిదినాలు కల్పించింది. తద్వారా 42.43 లక్షల కుటుంబాలు లబ్ధి పొందాయి. అనంతపురం, విజయనగరం, ప్రకాశం వంటి జిల్లాల్లో ప్రతి చోటా కోటిన్నర పనిదినాల పాటు పనులు కల్పించగా.. మరో 7 జిల్లాల్లో కోటికి పైబడి పనిదినాల్లో పనులు కల్పించింది.   

దేశంలోనే ఫస్ట్‌.. 
ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ప్రభుత్వ పరంగా కూలీ పనులు కల్పించడంలో దేశంలోనే మన రాష్ట్రం మొదటి స్థానం దక్కించుకుంది. గ్రామీణ పేదలకు ప్రభుత్వ పరంగా పనుల కల్పనలో మన రాష్ట్రం తర్వాత మధ్యప్రదేశ్‌ రెండో స్థానంలో ఉండగా.. రెండు రాష్ట్రాల మధ్య భారీ వ్యత్యాసమే ఉంది. మన రాష్ట్రం 16.7 కోట్ల పనిదినాలు గత మూడు నెలల కాలంలో  కల్పిస్తే.. రెండో స్థానంలో ఉన్న మధ్యప్రదేశ్‌ ఇదే సమయంలో 11.23 కోట్ల పనిదినాలను మాత్రమే కల్పించింది. కరోనా కారణంగా గ్రామాల్లో పేదల జీవనోపాధికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతి 15 రోజులకొకసారి నిర్వహించే స్పందన సమీక్షలో ప్రత్యేకించి జిల్లా కల్లెక్టర్లతో స్వయంగా సమీక్షిస్తున్నారు. ఇందులో భాగంగా జూన్‌ ఆఖరు నాటికి 16 కోట్ల పనిదినాలు లక్ష్యంగా నిర్ణయించుకోగా, 16.7 కోట్ల పనిదినాల పాటు పేదలకు పనులు కల్పించడం విశేషం.

మూడు నెలలుగా పేదలకు కల్పించిన పనిదినాల సంఖ్య (లక్షల్లో)

జిల్లా                        పనిదినాలు
అనంతపురం           196.20 
విజయనగరం          185.15 
ప్రకాశం                    163.30 
విశాఖపట్నం           140.23 
శ్రీకాకుళం                140.10 
పశ్చిమగోదావరి       124.15 
తూర్పుగోదావరి      123.03 
కృష్ణా                      122.36 
గుంటూరు              111.18 
కర్నూలు                102.45 
వైఎస్సార్‌               94.49 
చిత్తూరు                 91.18 
నెల్లూరు                 63.88 

మొత్తం                1,657.7 

గత ఎనిమిది రోజులుగా రోజు వారీ పనులకు హాజరవుతున్న కూలీల సంఖ్య (లక్షల్లో)

రోజు                   కూలీలు

21–06–2021        42.46 
22–06–2021       42.59 
23–06–2021       42.30 
24–06–2021       40.85 
25–06–2021       41.47 
26–06–2021       41.83 
28–06–2021       37.15 
29–06–2021       37.48 

రాష్ట్రంలో గత 8 ఏళ్లలో ఏప్రిల్‌–జూన్‌ మధ్య పేదలకు పనులు కల్పన

ఆర్థిక సంవత్సరం        కల్పించిన పని దినాలు 
2014–15                        9.34 కోట్లు  
2015–16                       10.44 కోట్లు  
2016–17                       11.14 కోట్లు  
2017–18                       12.97 కోట్లు  
2018–19                       12.31 కోట్లు  
2019–20                       12.06 కోట్లు  
2020–21                       15.10 కోట్లు  
2021–22                       16.70 కోట్లు

రాష్ట్రం                          పేదలకు కల్పించిన పని దినాలు 
ఆంధ్రప్రదేశ్‌                  16.70 కోట్లు  
మధ్యప్రదేశ్‌                   11.97 కోట్లు
తెలంగాణ                       9.30 కోట్లు   
ఒడిషా                             7.05 కోట్లు   
బీహార్‌                             7.01 కోట్లు   
చత్తీస్‌గఢ్‌                       6.68 కోట్లు  
రాజస్థాన్‌                        5.98 కోట్లు   
పశ్చిమ బెంగాల్‌             5.30 కోట్లు   
తమిళనాడు                   5.13 కోట్లు  
ఉత్తరప్రదేశ్‌                   4.68 కోట్లు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top