రాష్ట్రంలో అమెరికా సంస్థ భారీ పెట్టుబడులు

American company huge investments in Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: దుబాయ్‌ ఎక్స్‌పో–2020లో పెట్టుబడులను ఆకర్షిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా గురువారం పేరెన్నికగన్న మరో రెండు సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది. అలాగే, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో భాగస్వామ్యం కావల్సిందిగా మరో సంస్థకు ఆహ్వానం పలికింది. ప్రధానంగా అల్యూమినియం కాంపోజిట్‌ ప్యానల్స్‌ను తయారుచేసే అమెరికాకు చెందిన అలుబాండ్‌ గ్లోబల్‌ సంస్థ రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. రూ.1,500 కోట్ల పెట్టుబడితో అల్యూమినియం కాయిల్స్, ప్యానల్‌ తయారీ యూనిట్‌ను ఈ సంస్థ ఏర్పాటుచేయనుంది.

దుబాయ్‌ ఎక్స్‌పోలో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, పరిశ్రమలు–పెట్టుబడుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికల్‌ వలవన్‌ సమక్షంలో ఏపీ ఈడీబీ సీఈఓ జవ్వాది సుబ్రమణ్యం, అలుబాండ్‌ గ్లోబల్‌ చైర్మన్‌ షాజి ఎల్‌ ముల్క్‌లు గురువారం సాయంత్రం దుబాయ్‌లో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసి పరస్పరం మార్చుకున్నారు. ఈ యూనిట్‌ ద్వారా ప్రత్యక్షంగా 200 మందికి ఉపాధి లభించనుందని, దీని ఏర్పాటుకు 150 ఎకరాల భూమిని ప్రభుత్వం సమకూర్చనున్నట్లు మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు. 

షరాఫ్‌ గ్రూపుతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం    

రెండు లాజిస్టిక్‌ పార్కులకు కూడా..
షిప్పింగ్, లాజిస్టిక్, సప్లై చైన్‌ రంగాల్లో విస్తరించి ఉన్న షరాఫ్‌ గ్రూపు కూడా రాష్ట్రంలో పోర్టు ఆథారిత సేవల రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. రూ.500 కోట్ల పెట్టుబడితో రెండు లాజిస్టిక్‌ పార్కులను అభివృద్ధి చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలో గిడ్డంగులు, శీతల గిడ్డంగులు, ప్యాకింగ్‌ యూనిట్లు, డిస్‌ప్లే యూనిట్లు, సరుకు రవాణాకు తగిన రైల్‌ సైడింగ్‌ వంటి సౌకర్యాలతో ఈ లాజిస్టిక్‌ పార్కులను అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ మేరకు దుబాయ్‌ తాజ్‌బే హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో ఏపీ ఈడీబీతో షరాఫ్‌ గ్రూపు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంవల్ల ప్రత్యక్షంగా 700 మందికి, పరోక్షంగా 1,300 మందికి ఉపాధి లభించనుందని మంత్రి మేకపాటి వివరించారు. వారం రోజుల నుంచి జరుగుతున్న ఆంధ్రా పెవిలియన్‌ కార్యక్రమంలో ఇప్పటివరకు ఆరు పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదిరాయి.

ఫుడ్‌ పార్కుల్లో భాగస్వాములు కండి..
ఇక వ్యవసాయ రంగాన్ని పెద్దఎత్తున్న ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతులకు మంచి ధర లభించాలన్న ఉద్దేశ్యంతో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమకు పెద్దపీట వేస్తున్నారని, ఇందులో భాగస్వామ్యం కావాల్సిందిగా అలానా గ్రూపును మేకపాటి కోరారు. గల్ఫ్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌ను పరిశీలించిన మంత్రి.. అలానా గ్రూపు స్టాల్‌ను సందర్శించి ఆ సంస్థ చైర్మన్‌ ఇర్ఫాన్‌ అలానాతో సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ పార్లమెంటు పరిధిలో ఒక ఫుడ్‌ పార్కును అభివృద్ధి చేస్తోందని వీటిలో భాగస్వామ్య కావాల్సిందిగా కోరారు.

ఇప్పటికే అలానా గ్రూపు కాకినాడ సమీపంలో మాంసం శుద్ధిచేసే యూనిట్‌ను రూ150 కోట్లతో ఏర్పాటుచేయడమే కాకుండా కర్నూలు జిల్లా ఆదోని వద్ద మరో యూనిట్‌ను ఏర్పాటుచేయడానికి ఇప్పటికే ప్రతిపాదనలు పంపింది. మంత్రి మేకపాటి ఆహ్వానం మేరకు రంజాన్‌ మాసం తర్వాత రాష్ట్ర పర్యటనకు వస్తానని ఇర్ఫాన్‌ అలానా హామి ఇచ్చారు. ఈ సందర్భంగా అలానా గ్రూపు ఉత్పత్తి చేస్తున్న వివిధ ఆహార ఉత్పత్తులు, వాటిని ఏయే దేశాలకు ఎగుమతి చేస్తున్నారన్న అంశాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత అబుదాబీ ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీతో మంత్రి మేకపాటి సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులు, వాణిజ్య అవకాశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు జుల్ఫీ రావ్జీ, ఏపీఐఐసీ చైర్మన్‌ మెట్టు గోవిందరెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్, తదితరులు పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top