ఎర్ర మిరపకాయల గుత్తి.. బ్రిటిషర్ల హడల్‌..

Alluri Sitarama Raju 125th Birth Anniversary: Red Chillies Bunch, Arrow  - Sakshi

రంపచోడవరం: ఆంగ్లేయుల అకృత్యాలపై విల్లంబులు ఎక్కుపెట్టిన విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు సాగించిన మహోజ్వల సాయుధ పోరాటం ఎప్పటికీ స్ఫూర్తిదాయకమే. ఈ పోరాటంలో భాగంగా ఆయన సారథ్యంలో గిరిజన వీరులు బ్రిటిష్‌ పోలీస్‌స్టేషన్లపై వరస దాడులు చేశారు. దాడులు చేయడంలో అల్లూరి తెగింపే వేరు. ముందుగానే దాడులు చేస్తున్నట్లు బ్రిటిష్‌ సైన్యానికి హెచ్చరిక సందేశం పంపేవారు. కాగితంపై రాసిన ఆ సందేశాన్ని బాణానికి గుచ్చి, దానిపై ఎర్ర మిరపకాయల గుత్తి తగిలించేవారు. ఎర్ర మిరపకాయల గుత్తితో పోలీస్‌స్టేషన్‌ వద్ద బాణం నాటుకొంటే చాలు.. బ్రిటిష్‌ సైనికులు హడలెత్తిపోయేవారు.  


పైడిపుట్ట వద్ద నివాసం 

బ్రిటిష్‌ అధికారుల నిరంకుశ చర్యలకు వ్యతిరేకంగా విప్లవాగ్నిని రగిలించిన సీతారామరాజు.. అడ్డతీగల మండలం పైడిపుట్ట వద్ద కొంతకాలం నివాసం ఉన్నారు. 1922లో ప్రస్తుత అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కృష్ణదేవీపేట పోలీస్‌స్టేషన్‌పై దాడి చేశారు. అక్కడి ఆయుధాలను కొల్లగొట్టి దాడి చేసినట్లు సమయం తెలుపుతూ ఉత్తరం ఉంచారు. కొద్ది రోజుల్లోనే రాజవొమ్మంగి పోలీస్‌ స్టేషన్‌పై దాడి చేశారు. ఈ దాడికి తర్వాత కొంత సమయం తీసుకోవడంతో తమకు సీతారామరాజు భయపడ్డాడని బ్రిటిష్‌ అధికారులు ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో అడ్డతీగల మండలం పైడిపుట్ట వద్ద ఆయన గిరిజనులతో సమావేశమయ్యారు. అడ్డతీగల పోలీస్‌స్టేషన్‌పై దాడి చేస్తున్నట్లు 1922 అక్టోబర్‌ 10న బాణానికి మిరపకాయ గుత్తి ఉంచి సందేశం పంపించారు. 


అడ్డతీగల స్టేషన్‌పై దాడి చేసేందుకు గుర్రం మీద తేనెలమంగిలోని తెల్లమద్ది చెట్టు వద్దకు రాత్రి చేరుకుని వ్యుహం రచించారు. 1922 అక్టోబర్‌ 15న దాడి చేసి ఆయుధాలు కొల్లగొట్టారు. స్టేషన్‌పై దాడి చేసినట్లు లేఖ ఉంచారు. ఆ తర్వాత నాలుగు రోజుల వ్యవధిలోనే అక్టోబర్‌ 19న రంపచోడవరం పోలీస్‌స్టేషన్‌పై కూడా అల్లూరి దాడి చేశారు.


అల్లూరి సీతారామరాజు బ్రిటిష్‌ వారిపై తిరుగుబాటు చేసేందుకు రంగం సిద్ధం చేసుకునే సమయంలో అనేక గ్రామాల్లో గిరిజనులతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో రంపచోడవరానికి సమీపంలోని రంప గ్రామాన్ని ఆయన సందర్శించారు. అక్కడ గిరిజనులతో సమావేశమయ్యారు. 1880లో జరిగిన రంప పితూరి గురించి మాట్లాడారు. గిరిజనులతో సమావేశం అనంతరం రంప జలపాతంలో స్నానం చేసి.. రంపలోని కొండపై, కొండ దిగువన శివాలయాల్లో పూజలు చేసి వెళ్లిపోయారు. (క్లిక్: అచంచల దేశభక్తునికి జాతి నీరాజనాలు)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top