గణతంత్ర ‘వెలుగులు’

విద్యుత్ దీపాలతో ప్రకాశిస్తున్న సీఎం క్యాంప్ కార్యాలయం, అసెంబ్లీ
ముస్తాబైన ఇందిరా గాంధీ స్టేడియం
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్న గవర్నర్
హాజరు కానున్న సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: 74వ గణతంత్ర దిన వేడుకలకు ఏపీ సచివాలయం, శాసన సభ, శాసన మండలి భవనాలు ముస్తాబయ్యాయి. శాసన సభ భవనంతో పాటు రాష్ట్ర సచివాలయంలోని ఐదు బ్లాక్‌లను విద్యుత్ దీపాలతో అలంకరించారు. మరోవైపు గణతంత్ర వేడుకల సందర్భంగా తాడేపల్లిలోని సీఎం వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయం విద్యుత్ కాంతులతో వెలుగులు విరజిమ్ముతోంది. ప్రజలను ఈ దృశ్యాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
గణతంత్ర వేడుకలకు సర్వం సిద్ధం
సాక్షి, అమరావతి /సాక్షి ప్రతినిధి, విజయవాడ: గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ గురువారం ఉదయం 9 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.
శకటాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలను తిలకిస్తారు. ఈ వేడుకల్లో సీఎం వైఎస్ జగన్, పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొంటారు. కాగా, స్టేడియంలో ఏర్పాట్లను గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌పీ సిసోడియా బుధవారం పరిశీలించారు. సాయంత్రం 4.30 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్ ఇచ్చే హైటీ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు.