అక్టోబర్‌ 6 నుంచి ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలు

Admissions In IIT And NIT And IIIT From October 6th - Sakshi

సాక్షి, అమరావతి: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎన్‌ఐటీ), ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐఐఐటీ), తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ అక్టోబర్‌ 6 నుంచి ప్రారంభం కానుంది. ఈ సంస్థల్లో బీఈ, బీటెక్‌ కోర్సుల్లో సీట్ల భర్తీకి జాయింట్‌ సీట్‌ అలొకేషన్‌ అథారిటీ (జోసా) శుక్రవారం అర్ధరాత్రి కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల చేసింది. జేఈఈ మెయిన్‌ రెండో విడత (సెప్టెంబర్‌) ఫలితాలు అదే రోజు విడుదలైన సంగతి తెలిసిందే. 

ఈ నెల 21 నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్‌ అడ్మిట్‌ కార్డులు
► జేఈఈ మెయిన్‌లో మెరిట్‌లో నిలిచిన 2.50 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక చేస్తారు. ఈ నెల 27న ఐఐటీ– ఢిల్లీ ఈ పరీక్షను నిర్వహించనుంది. 
► అడ్మిట్‌ కార్డులను ఈ నెల 21 నుంచి 27 వరకు  https:// jeeadv.ac.in నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 
► అడ్వాన్స్‌డ్‌ పరీక్షను రాష్ట్రంలో అమలాపురం, అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుడ్లవల్లేరు, గూడూరు, గుంటూరు, కడప, కాకినాడ, కంచికచర్ల, కావలి, కర్నూలు, మచిలీపట్నం, మార్కాపూర్, మైలవరం, నరసరావుపేట, నెల్లూరు, ఒంగోలు, పుత్తూరు, రాజమహేంద్రవరం, సూరంపాలెం, తాడేపల్లిగూడెం, తిరుపతి, తిరువూరు, విజయవాడల్లో నిర్వహిస్తారు.
► ఈ నెల 29న ప్రొవిజినల్‌ ఆన్సర్‌ ‘కీ’ని విడుదల చేస్తారు. 
► ఫైనల్‌ ఆన్సర్‌ ‘కీ’ని అక్టోబర్‌ 5న  https://jeeadv.ac.inలో పెట్టి.. అదే రోజు ర్యాంకుల జాబితాను ప్రకటిస్తారు.
► బీఆర్కిటెక్చర్‌కు అభ్యర్థులు ప్రత్యేకంగా ఆర్కిటెక్చర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ రాయాలి. అక్టోబర్‌ 5, 6 తేదీల్లో ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలి. అక్టోబర్‌ 8న ఈ పరీక్ష నిర్వహిస్తారు. 

జోసా ప్రవేశాల షెడ్యూల్‌ ఇలా..
ఈసారి ఆరు విడతల కౌన్సెలింగ్‌ ద్వారా 23 ఐఐటీలు, 32 ఎన్‌ఐటీలు, 26 ఐఐఐటీలు, మరో 30 ఇతర సంస్థలు కలిపి మొత్తం 111 జాతీయ విద్యాసంస్థల్లోని సీట్లను భర్తీ చేస్తారు. మొదట విడత సీట్ల కేటాయింపు కంటే ముందు రెండుసార్లు నమూనా కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తారు. దీనివల్ల అప్పటికే ఆప్షన్లు నమోదు చేసుకున్న వారు ఎక్కడ సీటు వస్తుందో తెలుసుకోవచ్చు. దాన్ని అనుసరించి అభ్యర్థులు తమ ఆప్షన్లు మార్చుకునేందుకు అవకాశం కల్పిస్తారు. సీట్లు పొందినవారు స్వయంగా వెళ్లి ఆయా విద్యా సంస్థల్లో రిపోర్ట్‌ చేయనవసరం లేదు. కరోనా దృష్ట్యా ఆన్‌లైన్‌లోనే ప్రక్రియంతా పూర్తి చేసేలా మార్పులు చేశారు. 

ముఖ్య తేదీలు:  
జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు.. 
ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌: సెప్టెంబర్‌ 12
రిజిస్ట్రేషన్‌ ముగింపు: సెప్టెంబర్‌ 17
ఫీజు చెల్లింపు తుది గడువు: సెప్టెంబర్‌ 18

కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ తేదీలు ఇలా..
అక్టోబర్‌ 5: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు
అక్టోబర్‌ 6 నుంచి:  జోసా కౌన్సెలింగ్‌ రిజిస్ట్రేషన్‌
అక్టోబర్‌ 16: మొదటి విడత సీట్ల కేటాయింపు
అక్టోబర్‌ 21: రెండో విడత సీట్ల కేటాయింపు
అక్టోబర్‌ 26: మూడో విడత సీట్ల కేటాయింపు
అక్టోబర్‌ 30: 4వ విడత సీట్ల కేటాయింపు
నవంబర్‌ 3:  5వ విడత సీట్ల కేటాయింపు
నవంబర్‌ 7: 6వ విడత సీట్ల కేటాయింపు

ఏపీ నుంచి ముగ్గురికి 100 ఎన్‌టీఏ స్కోర్‌
కాగా.. జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో ఆలిండియా స్థాయిలో 100 ఎన్‌టీఏ (నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ) స్కోర్‌ సాధించిన వారిలో రాష్ట్రం నుంచి ముగ్గురు చోటు దక్కించుకున్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లికి చెందిన లండా జితేంద్ర,  విశాఖపట్నానికి చెందిన వైఎస్‌ఎస్‌ నరసింహనాయుడు, గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన తడవర్తి విష్ణు శ్రీ సాయి శంకర్‌లు ఈ ఘనత సాధించారు. వీరే కాకుండా 100 స్కోర్‌ సాధించిన ఆర్‌.శశాంక్‌ అనిరుధ్‌ (కడప), రొంగల అరుణ సిద్ధార్థ్‌ (తూర్పుగోదావరి) ఏపీకి చెందిన వారే అయినా హైదరాబాద్‌లో పరీక్ష రాయడంతో ఆ రాష్ట్ర కోటాలోకి చేరారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top