
సాక్షి, అమరావతి: 2023–24 సీజన్‌కు సంబంధించి వైఎస్సార్ రైతు భరోసా పథకానికి కొత్తగా అర్హత పొందినవారు, గతంలో అర్హత కలిగి లబ్ధి పొందని భూ యజమాన రైతులు, అటవీ భూసాగుదారులు ఈ నెల 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ చేవూరు హరికిరణ్ తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గత నాలుగేళ్లుగా ఈ పథకం ద్వారా మే నెలలో తొలి విడత పెట్టుబడి సాయం విడుదలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందన్నారు.
ఇందుకోసం అర్హత పొందినవారు సమీప ఆర్బీకేల్లో వ్యవసాయ సహాయకులను సంప్రదించాలని సూచించారు. తమ దరఖాస్తులను రైతు భరోసా పోర్టల్‌లో అప్‌లోడ్ చేసుకునేందుకు ఈ నెల 3 వరకు గడువునివ్వగా 90,856 మంది భూ యజమానులు, 6,632 మంది అటవీ భూసాగుదారులు కొత్తగా దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. వీరితో పాటు 2022–23లో రైతు భరోసా కింద లబ్ధి పొందేందుకు అర్హత కలిగిన రైతుల జాబితాలను సామాజిక తనిఖీల్లో భాగంగా ఈ నెల 12 నుంచి ఆర్బీకేల్లో ప్రదర్శిస్తున్నామని చెప్పారు.
అర్హుల జాబితాలో ఎవరైనా అనర్హులున్నట్టుగా గుర్తించినట్లయితే వెంటనే వ్యవసాయ శాఖ సిబ్బంది దృష్టికి తీసుకురావచ్చన్నారు. అలాగే అర్హతలు ఉండి ఇంకా దరఖాస్తు చేసుకోనివారు ఎవరైనా ఉంటే ఈ నెల 15 నుంచి 18 వరకు అవకాశం కల్పిస్తున్నట్టు చెప్పారు. దీన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.
గతేడాది లబ్ధి పొందిన వారు మళ్లీ దరఖాస్తు చేయనవసరం లేదని తెలిపారు. వారికి ఈ ఏడాది కూడా యధావిధిగా రైతు భరోసా సాయం అందుతుందన్నారు. గతేడాది లబ్ధి పొంది ప్రస్తుతం మరణించినట్లైతే వారి భార్య లేదా భర్త నామినీగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. భూమికి సంబంధించిన పత్రాలు, ఆధార్ కార్డు, ఇతర ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.