వెంకటగిరి మున్సిపాలిటీలో ఏసీబీ దాడులు 

ACB raids in Venkatagiri Municipality Andhra Pradesh - Sakshi

పట్టణ ప్రణాళికా విభాగంపై ఫిర్యాదు మేరకు తనిఖీలు 

సిబ్బంది వద్ద అనధికారిక నగదు రూ.45వేలు గుర్తింపు 

వెంకటగిరి(తిరుపతి జిల్లా): వెంకటగిరి మున్సిపల్‌ కార్యాలయంలో పట్టణ ప్రణాళిక, రెవెన్యూ వంటి పలు విభాగాల్లో సోమవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. తిరుపతి ఏసీబీ అడిషనల్‌ ఎస్పీ దేవప్రసాద్, డీఎస్పీ జనార్ధన్‌నాయుడు నేతృత్వంలో ఐదుగురు సీఐలు, 15 మంది సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. సాయంత్రం 4.30 గంటల సమయంలో ఏసీబీ బృందం మున్సిపల్‌ కార్యాలయంలో అడుగుపెట్టింది.

పట్టణ ప్రణాళిక, రెవెన్యూ సెక్షన్లలో రికార్డులను అధికారులు తనిఖీ చేశారు. ఆయా విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బందిని పూర్తిస్థాయిలో విచారించారు. తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఇతరులను ఎవరినీ లోపలికి అనుమతించలేదు. రాత్రి పొద్దుపోయే వరకూ తనిఖీ చేశారు. మంగళవారం కూడా తనిఖీలు కొనసాగించాలని అధికారులు నిర్ణయించినట్లు  సమాచారం. 

14400 కు ఫిర్యాదుతోనే తనిఖీలు.. 
వెంకటగిరి మున్సిపాలిటీ టౌన్‌ప్లానింగ్‌ (పట్టణ ప్రణాళిక) విభాగంపై 14400, వెబ్‌సైట్‌లో వచ్చిన ఫిర్యాదు ఆధారంగా తాము తనిఖీలు నిర్వహించినట్లు తిరుపతి ఏసీబీ అడిషనల్‌ ఎస్పీ దేవప్రసాద్‌ తెలిపారు. ఆదరణ పథకం లబ్ధిదారుల వద్ద కట్టించుకున్న నగదులో రికార్డ్‌ అసిస్టెంట్‌ పెంచలయ్య వద్ద రూ.14,000 తక్కువగా ఉన్నట్లు, పన్నులు వసూళ్లకు సంబంధించి ఉండాల్సిన నగదులో రూ.25,000 తక్కువగా ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు.

పలు విభాగాల్లోని అధికారుల వద్ద అనధికారికంగా మరో రూ.45,000 నగదు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. మున్సిపాలిటీ రికార్డులను పరిశీలించి నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని వివరించారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top