
సీరియల్ నంబర్లతో పాటు పూర్తి స్థాయిలో నోట్ల పంచనామా చేయాలని దర్యాప్తు అధికారికి కోర్టు స్పష్టీకరణ
దర్యాప్తు అధికారిని పిలిపించిన ఏసీబీ ప్రత్యేక కోర్టు
సీజ్ చేసిన డబ్బును ఇప్పటికే బ్యాంకులో జమ చేశామని వెల్లడి
అయితే డిపాజిట్ చేసిన స్లిప్పును చూపాలని కోరిన కేసిరెడ్డి న్యాయవాది
అరగంటలో తెస్తానని వెళ్లి ఎంతకూ తిరిగి రాని అధికారి
కోర్ట్ సమయం ముగిసినా పత్తా లేక పోవడంతో విసిగిపోయిన న్యాయస్థానం
ఏదో తేడా ఉందని ప్రాథమికంగా నిర్ధారించుకున్న కోర్టు
ఆ డబ్బును ఇతర నోట్లతో కలపకుండా వేరుగా ఉంచాలని ఎస్‌బీఐ మాచవరం బ్రాంచ్‌కు ఆదేశం
సాక్షి, అమరావతి: మద్యం అక్రమ కేసులో సిట్ అడ్డంగా దొరికిపోయింది. ప్రధాన నిందితుడు రాజ్ కేసిరెడ్డికి చెందిన డబ్బు అంటూ సిట్ అధికారులు రంగారెడ్డి జిల్లాలోని ఓ ఫాంహౌస్‌లో జప్తు చేసిన రూ.11 కోట్లపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ ఏసీబీ కోర్టు శనివారం కీలక ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకులో డిపాజిట్ చేసే ముందు ఆ రూ.11 కోట్లకు పూర్తి స్థాయిలో పంచనామా నిర్వహించాలని సిట్ దర్యాప్తు అధికారిని ఏసీబీ కోర్టు ఆదేశించింది.
ప్రతీ నోటుపై ఉన్న సీరియల్ నెంబర్‌ను రికార్డ్ చేయాలని స్పష్టం చేసింది. ఒకవేళ డబ్బును సిట్ ఇప్పటికే డిపాజిట్ చేసి ఉంటే, ఆ మొత్తాన్ని ఇతర కరెన్సీ నోట్లతో కలపకుండా వేరుగా ఉంచాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాచవరం బ్రాంచ్‌ను కోర్టు ఆదేశించింది. తాము తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు ఆ నోట్లను వేరుగానే ఉంచాలని తేల్చి చెప్పింది. ఈ మేరకు ఏసీబీ కోర్టు న్యాయాధికారి పి.భాస్కరరావు ఉత్తర్వులు జారీ చేశారు.
వాస్తవానికి రూ.11 కోట్ల జప్తు వ్యవహారంలో సిట్ అడ్డంగా దొరికిపోయింది. ఈ డబ్బు కేసిరెడ్డిదేనని సిట్ చెప్పగా, ఆ డబ్బుతో తనకు ఎలాంటి సంబంధం లేదని కేసిరెడ్డి ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాక 2024 ఎన్నికలకు ముందే ఈ రూ.11 కోట్లను దాచిపెట్టినట్లు సిట్ చెబుతోందని, ఆ కరెన్సీ నోట్లు ఏ సంవత్సరానివో నిగ్గు తేలాలంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) రికార్డులను పరిశీలించాలని ఆయన కోర్టును కోరారు. రూ.11 కోట్ల కరెన్సీ నోట్లపై ఉన్న సీరియల్ నెంబర్లను రికార్డ్ చేసేందుకు ఓ అడ్వొకేట్ కమిషనర్‌ను నియమించాలని కోరుతూ రాజ్ కేసిరెడ్డి తాజాగా ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు శనివారం విచారణ జరిపింది.
బ్యాంక్‌లో డిపాజిట్ చేసి ఉంటే స్లిప్ చూపమనండి..
కేసిరెడ్డి తరఫు న్యాయవాది శెట్టిపల్లి దుష్యంత్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, ఆ కరెన్సీ నోట్లపై ఉన్న సీరియల్ నెంబర్లను వీడియోగ్రఫీ చేసి, దాని ఫుటేజీని కోర్టు ముందుంచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. తమకున్న సమాచారం మేరకు ఆ రూ.11 కోట్లను సిట్ ఇప్పటి వరకు బ్యాంకులో జమ చేయలేదన్నారు. ఆ నోట్లపై ఉన్న సీరియల్ నెంబర్ల విషయంలో పిటిషనర్ అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో, ఆ నోట్లను సిట్ తారుమారు చేసే అవకాశం ఉందన్నారు.
సిట్‌పై తమకు ఏ విధమైన నమ్మకమూ లేదన్నారు. దీంతో డబ్బు డిపాజిట్ చేశారా? లేదా? అన్న విషయాన్ని నిర్ధారించుకునేందుకు కోర్టు సిట్ దర్యాప్తు అధికారి (ఐవో)ని పిలిపించింది. కోర్టు ముందు హాజరైన దర్యాప్తు అధికారి తాము రూ.11 కోట్లను బ్యాంకులో డిపాజిట్ చేసేశామని చెప్పారు. ఈ సమయంలో దుష్యంత్ జోక్యం చేసుకుంటూ, సిట్‌ను నమ్మలేమని, ఒకవేళ రూ.11 కోట్లను డిపాజిట్ చేసి ఉంటే డిపాజిట్‌కు సంబంధించిన బ్యాంక్ స్లిప్పును చూపించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
బ్యాంక్ స్లిప్పును 5 నిమిషాల్లో వాట్సాప్ ద్వారా తెప్పించుకోవచ్చన్నారు. డిపాజిట్ చేసిన డబ్బును వేరుగా ఉంచేలా బ్యాంకును ఆదేశించాలని ఆయన కోరారు. దీంతో దర్యాప్తు అధికారి అర్ధగంటలో డిపాజిట్ స్లిప్పును తీసుకొస్తానని వెళ్లారు. గంటలు గడిచినా కూడా ఆ అధికారి తిరిగి రాలేదు.
ఆయన పత్తా లేకుండా పోవడంతో కోర్టు ఈ మొత్తం వ్యవహారంలో ఏదో తేడా ఉందన్న ప్రాథమిక నిర్ణయానికి వచ్చింది. దర్యాప్తు అధికారి రాకపోవడంతో డిపాజిట్ చేసిన డబ్బును వేరుగా ఉంచాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాచవరం బ్రాంచ్ అధికారులను ఆదేశించింది. అలాగే డిపాజిట్ చేసిన నోట్ల పంచనామా చేయాలని దర్యాప్తు అధికారిని ఆదేశించింది.