
గోవిందప్ప, ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలకు మంజూరు చేసిన ఏసీబీ కోర్టు
డీఫాల్ట్ బెయిల్ రాకుండా ఉండేందుకు అసంపూర్ణ చార్జిషీట్ దాఖలు చేయడం రాజ్యాంగ విరుద్ధం
డీఫాల్ట్ బెయిల్ అన్నది ప్రాథమిక హక్కే కాకుండా.. చట్టబద్ధమైన హక్కు అని సుప్రీంకోర్టు చెప్పింది
సంపూర్ణ చార్జిషీట్ లేకుండా 60/90 రోజులకు మించి రిమాండ్ పొడిగించడానికి వీల్లేదు
సిట్ దాఖలు చేసిన చార్జిషీట్, అనుబంధ చార్జిషీట్‌లో 21 లోపాలను గుర్తించి సవరించాలని కోరాం
చార్జిషీట్ కాపీలు, పెన్‌డ్రైవ్ రూపంలో డాక్యుమెంట్ల లిస్ట్ ఇవ్వడం మినహా మేం అడిగిన లోపాలను సరిదిద్దలేదు
ప్రతి నిందితునికి వేర్వేరుగా చార్జిషీట్ దాఖలు చేసి బెయిల్‌ను అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధం
నేరాన్ని పరిగణనలో తీసుకోకుండా నిందితుల రిమాండ్ పొడిగించడం సాధ్యం కాదు.. ఏసీబీ కోర్టు స్పష్టీకరణ
మిథున్‌రెడ్డికి మధ్యంతర బెయిల్
ఇటీవల సుప్రీంకోర్టు రీతూ చాబ్రియా కేసులో స్పష్టమైన తీర్పు ఇచ్చింది. దర్యాప్తు పూర్తి చేయకుండానే దాఖలు చేసిన అసంపూర్ణ చార్జిషీట్... సీఆర్‌పీసీ సెక్షన్ 167(2) ప్రకారం నిందితుడికి లభించే డిఫాల్ట్ బెయిల్ హక్కును దూరం చేయలేదని తేలి్చచెప్పింది. డిఫాల్ట్ బెయిల్ చట్టబద్ధ హక్కు మాత్రమే కాక రాజ్యాంగంలోని అధికరణం 21 ప్రకారం ప్రాథమిక హక్కు కూడా అని సుప్రీం పేర్కొంది.
ప్రతి నిందితుడికి వేర్వేరుగా చార్జిషీట్‌లు దాఖలు చేసి డిఫాల్ట్ బెయిల్ హక్కును అడ్డుకోవాలనుకునే తీరు చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం కూడా అని తెలిపింది. ఇలాంటి చర్యలు నిందితుడి ప్రాథమిక హక్కు అయిన స్వేచ్ఛను హరిస్తాయని చెప్పింది. అసంపూర్ణ లేదా పలు భాగాలుగా చార్జిషీట్ దాఖలు చేయడం ద్వారా రాజ్యాంగం ప్రసాదించిన ఈ హక్కును కాలరాయలేరని కూడా సుప్రీంకోర్టు చెప్పింది.
– ఏసీబీ కోర్టు
అనుమతులు.. ఆమోదం లేకుండా ముందుకెళ్లలేం..
ప్రస్తుత కేసులో ప్రాథమిక చార్జిషీట్, అనుబంధ చార్జిషీట్ విషయానికి వస్తే 48 మందిని నిందితులుగా పేర్కొన్నారు. వీరిలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు. ప్రాథమిక చార్జిషీట్‌ను 16 మందిపై మాత్రమే దాఖలు చేశారు. మరో ముగ్గురిపై అనుబంధ చార్జిషీట్ వేశారు. ఇంకా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్‌ఎస్‌ఎల్) నివేదికలు రాలేదు. ఆ నివేదికల్లో ఏమున్నదో తెలియకుండా, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ లేదా 19 ప్రకారం అనుమతులు, ఆమోదం పొందకుండా ప్రభుత్వ ఉద్యోగులపై కేసును ముందుకు తీసుకెళ్లడం సాధ్యం కాదు...
ప్రి కాగ్నిజెన్స్ దశలో కస్టడీ పొడిగించలేం
చట్ట ప్రకారం నేరాలను కోర్టు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందే తప్ప నిందితులను కాదు. సీఆర్‌పీసీ సెక్షన్ 309(2) ప్రకారం నేరాన్ని పరిగణనలోకి తీసుకోకుండా నిందితుల రిమాండ్ పొడిగించడం సాధ్యం కాదు. కేసు ఇంకా ప్రి కాగ్నిజెన్స్ దశలోనే ఉంది. ఈ పరిస్థితుల్లో సెక్షన్ 167(2) ప్రకారం 90 రోజులు దాటిన తరువాత నిందితుల కస్టడీ పొడిగించడానికి అనుమతి లేదు. అందువల్ల నిందితులకు సీఆర్‌పీసీ సెక్షన్ 167(2) కింద బెయిల్ మంజూరు చేయడం తప్ప మరో మార్గం లేదు
–ఏసీబీ కోర్టు తీర్పు
సాక్షి, అమరావతి: మద్యం అక్రమ కేసులో విజయవాడ ఏసీబీ కోర్టు శనివారం రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. రిటైర్డ్ అధికారులు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పలకు బెయిల్ రాకుండా అడ్డుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సాగించిన ప్రయత్నాలను పటాపంచాలు చేసింది. ఈ ముగ్గురికీ బెయిల్ ఇచ్చింది. చార్జిషీట్ దాఖలు చేసిన నేపథ్యంలో వీరికి ఏసీబీ కోర్టు డీఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా పలు షరతులు విధించింది.
పాస్‌పోర్టులను ఇప్పటికే జప్తు చేయకుంటే, విడుదలైన మూడు రోజుల్లో వాటిని స్వాధీనం చేయాలని ఆదేశించింది. ముగ్గురూ రూ.లక్ష చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని సూచించింది. కోర్టు అనుమతి లేకుండా దేశం దాటి వెళ్లొద్దని, తమ నియంత్రణలోని లేని పరిస్థితుల్లో తప్ప మిగిలిన అన్నివేళల్లో కోర్టు విచారణలకు హాజరై తీరాలని స్పష్టం చేసింది.
తదుపరి పర్యవేక్షణ నిమిత్తం మొబైల్ ఫోన్‌ను యాక్టివ్‌లో ఉంచాలని పేర్కొంది. సాక్షులను గాని, సహ నిందితులను కలవడానికి వీల్లేదని ఆదేశించింది. ఎలాంటి నేరపూరిత చర్యలకు పాల్పడరాదని, షరతులను ఉల్లంఘిస్తే వెంటనే బెయిల్ రద్దవుతుందని వెల్లడించింది. ఈ మేరకు న్యాయాధికారి పి.భాస్కరరావు శనివారం తీర్పు వెలువరించారు.
⇒ రీతూచాబ్రియా వర్సెస్ సీబీఐ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా గోవిందప్ప, ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ఏసీబీ కోర్టు తన తీర్పులో పేర్కొంది. డిఫాల్ట్ బెయిల్ రాకుండా చేసేందుకు అసంపూర్ణ చార్జిషీట్ దాఖలు చేయడం రాజ్యాంగంలోని అధికరణ 21కు విరుద్ధమని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని గుర్తుచేసింది. అంతేకాక, సీఆర్‌పీసీ సెక్షన్ 167(2) కింద డిఫాల్ట్ బెయిల్ అన్నది ప్రాథమిక హక్కే కాక చట్టబద్ధమైనది కూడా అని సర్వోన్నత న్యాయస్థానం చెప్పిందని ఏసీబీ కోర్టు తెలిపింది. సంపూర్ణ చార్జిషీట్ లేకుండా 60/90 రోజులకు మించి రిమాండ్ పొడిగించడానికి వీల్లేదని కూడా సుప్రీం స్పష్టం చేసిందని పేర్కొంది.
అసంపూర్ణ దర్యాప్తు ఆధారంగా దాఖలు చేసే చార్జిషీట్‌కు చట్టబద్ధత లేదు
‘‘సిట్ దాఖలు చేసిన మొదటి చార్జిషీట్, తర్వాత వేసిన అనుబంధ చార్జిషీట్‌ను ఈ కోర్టు పరిశీలించింది. మొత్తం 21 లోపాలను గుర్తించి మూడు రోజుల్లో సవరించాలని ఆగస్టు 23న స్పష్టం చేశాం. చార్జిషీట్ కాపీల దాఖలు, పెన్ డ్రైవ్ రూపంలో డాక్యుమెంట్ల జాబితా ఇవ్వడం మినహా మిగిలిన లోపాలను సిట్ సరిదిద్దలేదు.
మేం లేవనెత్తిన అభ్యంతరాలనే కాక పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనల సమయంలో చార్జిషీట్‌లో పలు ఇతర అంశాలను ఎత్తిచూపారు. ఈ నేపథ్యంలో డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలా వద్దా అన్నదాన్ని చార్జిషీట్ దాఖలు చేశారా? లేదా? అన్న కోణంలో చూడకూడదు. దర్యాప్తు మొత్తం నిర్ణీత గడువులో పూర్తయిందా? లేదా? ఆ దర్యాప్తు పూర్తయిన తర్వాత మాత్రమే చార్జిషీట్ దాఖలైందా?
లేదా? అన్నదే పరిశీలించాల్సి ఉంటుంది. ప్రాథమిక లేదా అసంపూర్ణ దర్యాప్తు ఆధారంగా చార్జిషీట్ దాఖలు చేయడం చట్టబద్ధం కాదు. ఇది నిందితుడు డిఫాల్ట్ బెయిల్ పొందే చట్టబద్ధ హక్కుకు అడ్డంకిగా మారకూడదు. ఇదే విషయాన్ని ఆకుల రవితేజ కేసులో హైకోర్టు గతంలోనే స్పష్టం చేసింది.
⇒ ‘‘రోజువారీగా మరికొంత మంది నిందితుల విషయంలో సిట్ సోదాలు కొనసాగిస్తోంది. దర్యాప్తు ఇప్పటికీ కొనసాగుతోంది. అవినీతి జరిగిన మొత్తంగా ఆరోపిస్తున్న రూ.3,570.87 కోట్లలో కేవలం రూ.40 కోట్ల వరకు మాత్రమే స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన మొత్తాల వివరాలు తెలియాల్సి ఉంటుంది. ఈ కారణాలతో నిందితులపై నమోదైన నేరాలను విచారణకు స్వీకరించే పరిస్థితిలో ఈ కోర్టు లేదు’ అని ఏసీబీ కోర్టు తన తీర్పులో వివరించింది.
చార్జిషీట్‌ను విచారణకు స్వీకరించనప్పుడు రిమాండ్ పొడిగించలేరు..
గోవిందప్ప, ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలు జూలై, ఆగస్టు నెలల్లో రెండుసార్లు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. దీంతో ఇటీవల ఏసీబీ కోర్టులో డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లు వేశారు. వీరి తరఫున సీనియర్ న్యాయవాదులు తప్పెట నిరంజన్‌రెడ్డి, వినోద్‌కుమార్ దేశ్‌పాండే, పాపెల్లుగారి వీరారెడ్డి, తప్పెట నాగార్జునరెడ్డి, శెట్టిపల్లి దుష్యంత్‌రెడ్డి, చంద్రగిరి విష్ణువర్ధన్‌లు వాదనలు వినిపించారు.
సిట్ చార్జిషీట్‌పై ఏసీబీ కోర్టు పలు అభ్యంతరాలను లేవనెత్తిందని, చార్జిషీట్‌ను విచారణకు స్వీకరించని నేపథ్యంలో పిటిషనర్లకు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయాలని కోరారు. మరోవైపు చార్జిషీట్‌ను విచారణకు స్వీకరించనప్పుడు సీఆర్‌పీసీ సెక్షన్ 167(2) కింద రిమాండ్‌ను పొడిగించే ఆస్కారం లేదని తెలిపారు. సెక్షన్ 309 ప్రకారం రిమాండ్ పొడిగింపు చట్ట విరుద్ధం అవుతుందని పేర్కొన్నారు.
ఏసీబీ కోర్టు లేవనెత్తిన అభ్యంతరాలను సిట్ అధికారులు నివృత్తి చేయలేదని తెలిపారు. అభ్యంతరాలను సరిచేయకుండా, రిమాండ్‌ను పొడిగించాలంటూ సిట్ అధికారులు యాంత్రికంగా కోర్టులో మెమోలు దాఖలు చేస్తూ వస్తున్నారని చెప్పారు. దీనిని సిట్ తోసిపుచ్చుతూ బెయిల్ ఇవ్వొద్దంటూ గట్టిగా వాదనలు వినిపించింది.
100 రోజులకు పైగా జైల్లో ముగ్గురు
గత ప్రభుత్వ మద్యం విధానంలో అవకతవకలు జరిగాయంటూ సీఐడీ నిరుడు సెప్టెంబరు 23న ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. అనంతరం ఈ అక్రమ కేసులో రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు నిమిత్తం సిట్‌ను ఏర్పాటు చేసింది. దర్యాప్తు జరిపిన సిట్... రాజ్ కేసిరెడ్డి, దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి, దొడ్డా సత్యప్రసాద్, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, వేణుంబాక విజయసాయిరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, కాల్వ ధనుంజయరెడ్డి, పెళ్లకూరు కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్ప, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితో పాటు మొత్తం 48 మందిని నిందితులుగా చేర్చింది.
⇒ ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, గోవిందప్పలు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. వాటిని కొట్టివేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడ విచారణ పెండింగ్‌లో ఉండగానే, సిట్ అధికారులు ఈ ఏడాది మే 13న బాలాజీ గోవిందప్పను అరెస్ట్ చేశారు. 117 రోజులుగా ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.
⇒ కృష్ణమోహన్‌రెడ్డి, ధనుంజయరెడ్డి మే 16న అరెస్టయ్యారు. వీరు 113 రోజులుగా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. మద్యం అక్రమ కేసులో ఈ ముగ్గురి పాత్రపై సిట్ చార్జిషీట్ దాఖలు చేసింది.