
అబద్ధాల గోడలతో అడ్డగోలుగా భేతాళ కథలు అల్లిన సిట్..
వాటిని నిజం చేయడానికి అనుబంధ కథలతో తంటాలు
బలవంతంగా ‘164 స్టేట్‌మెంట్’ ఇప్పించి, అప్రూవర్లుగా మార్చే ప్రయత్నం
ఆపై ఇష్టం వచ్చిన కథలను బలవంతంగా చెప్పించే తంతు
అసలు స్కామే జరగనిచోట స్కాం జరిగినట్లు బురదజల్లే పన్నాగం
దీనికితగినట్లుగా ఈనాడు, ఎల్లో మీడియా తానతందాన
సిట్ వేధిస్తోందని స్వయంగా హైకోర్టును ఆశ్రయించిన వాసుదేవరెడ్డి
తర్వాత ప్రలోభపెట్టి, బెదిరించి అప్రూవర్‌గా మార్చిన సిట్
వాస్తవానికి రాజ్ కేసిరెడ్డి–ఎంపీ కేశినేని చిన్ని వ్యాపార భాగస్వాములు
పొరపాటున కూడా ఈ విషయాన్ని ప్రస్తావించని ఎల్లో మీడియా
ఇప్పుడు కొత్తగా వైఎస్ జగన్ సమీప బంధువుల మీద మరో భేతాళ కథ
బురదజల్లే క్రమంలో... వైఎస్ అనిల్‌రెడ్డి పీఏ విచారణ అంటూ సిట్ కొత్త డ్రామా
భేతాళ కుట్రలతో రిటైర్డ్ అధికారులు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, వికాట్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప అరెస్టు
సాక్షి, అమరావతి: కుట్రలు... పన్నాగాలు... బెదిరింపులు... వేధింపుల మధ్య... అబద్ధపు వాంగ్మూలాలు... తప్పుడు సాక్ష్యాలతో మద్యం అక్రమ కేసును నడిపిస్తోంది ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్). కక్షసాధింపే లక్ష్యంగా... దెబ్బతీయడమే ఉద్దేశంగా... అబద్ధాల పునాదులపై అడ్డగోలుగా భేతాళ కథలు అల్లింది. వాటిని నిజం చేయడానికి అనుబంధ కథలతో నానాతంటాలు పడుతోంది. తాజాగా అక్రమ కేసులో ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, అంతర్జాతీయ సిమెంట్ కంపెనీ వికాట్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పలకు బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనం.
చార్జిషీట్ కాపీలు, పెన్‌డ్రైవ్ రూపంలో డాక్యుమెంట్ల లిస్ట్ ఇవ్వడం మినహా తాము అడిగిన లోపాలను సరిదిద్దలేదని న్యాయస్థానం పేర్కొనడాన్ని బట్టి... సిట్‌ది ఎంత భేతాళ కుట్రనో స్పష్టం అవుతోంది. కాగా, మద్యం అక్రమ కేసులో సిట్ మొదటినుంచి ఇదే ధోరణిలో వ్యవహరిస్తోంది. లేని స్కాంను ఉన్నట్లుగా చూపేందుకు కిందామీద పడుతోంది. ఎల్లో మీడియాకు లీకులిస్తూ రక్తి కట్టిస్తోంది.
మద్యం అక్రమ కేసులో అరెస్టు చేసినవారితో బలవంతంగా వారికి కావాల్సినట్లు ‘164 స్టేట్‌మెంట్’ ఇప్పించి, అప్రూవర్లుగా మార్చే ప్రయత్నం యథేచ్ఛగా సాగించింది. ఆపై వారితో ఇష్టం వచ్చిన కథలను బలవంతంగా చెప్పించే తంతు నడిపించింది. ఇక్కడ సిట్ ఎంత అన్యాయంగా, దారుణంగా వ్యవహరించింది అంటే... అసలు కుంభకోణమే లేనప్పటికీ బురదజల్లడమే లక్ష్యంగా అక్రమ కేసులను నమోదు చేసింది. ఇదే అదనుగా... అందుకు తగినట్లుగా ఈనాడు, ఎల్లో మీడియా తానతందాన అంటూ బరితెగించి కథనాలు వండివార్చడం మొదలుపెట్టాయి.
అసలు వ్యాపార భాగస్వాములు వారే...!
రాజ్ కేసిరెడ్డి... గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో కొనసాగిన పలువురు సలహాదారుల్లో ఒకరు. అంతమాత్రానికే మద్యం అక్రమ కేసులో ముడిపెట్టింది సిట్. వాస్తవానికి రాజ్ కేసిరెడ్డి... విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని (శివనాథ్)లే వ్యాపార భాగస్వాములు. ఈ విషయం ఆధారాలతో బయటకు వచ్చింది కూడా. ఇక కేశినేని చిన్ని మంత్రి నారా లోకేశ్ బినామీ అని అందరికీ తెలిసిందే. కానీ, ఎల్లో మీడియా మాత్రం పొరపాటున కూడా మాటమాత్రంగానైనా ఈ విషయాన్ని ప్రస్తావించదు. ఉద్దేశపూర్వకంగానే విస్మరిస్తూ... కళ్లున్న కబోదిలా ప్రవరిస్తూ ఉంటుంది. గత ప్రభుత్వంపై మాత్రం యథేచ్ఛగా బురదజల్లుతూ తన కపట బుద్ధిని బయటపెట్టుకుంటోంది.
‘అప్రూవర్ కుట్ర’లతో...
అక్రమ కేసు కుతంత్రంలో ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి, పూర్వ ఉద్యోగి సత్య ప్రసాద్‌లను తీవ్రంగా వేధించి మరీ అబద్ధపు వాంగ్మూలం నమోదు చేయించింది కూటమి ప్రభుత్వం. వారి ద్వారా అప్రూవర్ కుట్రకు కూడా తెగించింది. వాస్తవానికి వాసుదేవరెడ్డిని అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని సిట్ అధికారులు తీవ్రంగా వేధించారు. ఆయన డెప్యుటేషన్ ముగిసినా ప్రభుత్వం రిలీవ్ చేయకుండా అడ్డుకుంది.
కుటుంబసభ్యులను భయభ్రాంతులకు గురిచేసింది. దీంతో ముందస్తు బెయిల్ కోరుతూ మూడుసార్లు హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం వెంటాడి వేధించింది. వారు చెప్పినట్లు వింటే అప్రూవర్‌గా మారుస్తామంది. చివరకు సిట్ చెప్పినట్టుగా వాసుదేవరెడ్డి అబద్ధపు వాంగ్మూలం ఇచ్చారు. ఆ వెంటనే ఆయనను రిలీవ్ చేసి కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది.
» బెవరేజెస్ కార్పొరేషన్ చిరుద్యోగులు సత్యప్రసాద్, అనూష సహా పలువురు ఔట్ సోర్సింగ్ సిబ్బందిని వేధించి బలవంతంగా అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయించింది. ఇలా ఇచ్చేందుకు సమ్మతించనివారిపై సిట్ ప్రతాపం చూపింది.
» కట్టుకథలను మించిన భేతాళ కథలతో కుతంత్రాలు పన్నిన సిట్... ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలను అరెస్టు చేసింది. నిజానికి మద్యం విధానం ఫైలు అసలు సీఎంవోకు రాదు. కానీ, సిట్ తన కపట ఉద్దేశాలతో ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలను మద్యం అక్రమ కేసులో ఇరికించింది. ఇక బాలాజీ గోవిందప్ప అంతర్జాతీయ సిమెంట్ కంపెనీ వికాట్ డైరెక్టర్. ఆయనకు అసలు మద్యం విధానంతో సంబంధమే లేకపోయినా, భేతాళ కుట్రలు పన్ని లక్ష్యంగా చేసుకుంది.
కుతంత్రాలు పటాపంచలవడంతో.. కొత్త కట్టుకథలతో...
అసలు లేని మద్యం కుంభకోణంలో అనేక కుతంత్రాలకు పాల్పడిన ప్రభుత్వం పలుసార్లు తలబొప్పి కట్టించుకుంది. హైదరాబాద్ శివారు వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యానికి చెందిన ఫాంహౌస్‌లో రూ.11 కోట్లు దొరికాయంటూ హడావుడి చేసింది. ఈ విషయమై నంబర్లుతో సహా నోట్ చేయాలని కోర్టు నిలదీసేసరికి ఎల్లో మీడియా సాయంతో ఇంకో భేతాళ కుట్ర అల్లింది. అదే రోజు... మరోచోట రూ.కోట్ల నగదు లభ్యమైందని.. అదంతా మద్యం సొమ్మేనని ముడిపెట్టింది.
» వెంకటేష్‌నాయుడు తన ఫోన్‌లో చిత్రీకరించిన వీడియో ఇదిగో అంటూ ఎల్లో మీడియాకు లీకులిచ్చింది. ఇప్పుడు మాజీ సీఎం వైఎస్ జగన్ సమీప బంధువుల మీద మరో భేతాళ విక్రమార్క కథను అల్లుతోంది. వైఎస్సార్ కుటుంబం, గత ప్రభుత్వంపై బురదజల్లే క్రమంలో... వైఎస్ జగన్ సోదరుడు వైఎస్ అనిల్‌రెడ్డి పాత్ర ఉందంటూ ఆయన పీఏను విచారించే పేరుతో సిట్ కొత్త డ్రామా నడిపిస్తోంది. దీనిపై ఎల్లో మీడియాలో రకరకాల లీకులిస్తూ బురదజల్లుతోంది. అసలు అనిల్ రెడ్డి ఏపీలోనే ఉండరు. అయినా ఆయన పాత్రపై అసత్యాలు ప్రచారం చేసేందుకు తాపత్రయపడుతోంది. ఈకేసులో అన్నీ అభూత కల్పనలే లక్ష్యంగా సిట్ విచారణ సాగుతోందనడానికి ఇదే ప్రత్యక్ష నిదర్శనం.