
సాక్షి, విజయవాడ: అక్రమ మద్యం కేసులో ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మే 13న బాలాజీ గోవిందప్పను అరెస్ట్ చేయగా ఆయన 117 రోజులుగా జైల్లో ఉన్నారు. మే 16న ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలను సిట్ అరెస్ట్ చేయగా 113 రోజులుగా జైల్లో ఉన్నారు.
కాగా, వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సిట్ భేతాల కథలు ఇక చెల్లవని.. కోర్టులో న్యాయమే జరుగుతుందన్నారు. ‘‘లేని లిక్కర్ స్కాంని ఉన్నట్టు చూపించే ప్రయత్నం సిట్ చేసింది. ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం వాంగ్మూలాలతో కేసు నడిపించాలని చూస్తున్నారు. అరెస్టు అయినవారెవరి మీదా సిట్ సాక్ష్యాలు చూపించలేక పోయింది. కేవలం భేతాళ కథలతోనే ఇప్పటిదాకా కేసును నడిపారు. లేని లిక్కర్ స్కాంని ఉన్నట్టు చూపించే ప్రయత్నం చేస్తున్నారు’’ అని మనోహర్‌రెడ్డి అన్నారు.
బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయరెడ్డిలకు ఈ రోజు బెయిల్ వచ్చింది. సహ నిందితుల వాంగ్మూలాలతోనే అరెస్టులు జరుగుతున్నాయి. ఇది సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధం. సిట్ దర్యాప్తు అంతా బెదిరింపులతోనే సాగుతోంది. తాజాగా సజ్జల భార్గవ, అనిల్‌రెడ్డిల పేర్లను కూడా ఇరికించే ప్రయత్నం సిట్ చేస్తోంది. అసలు బ్యాంకు ఖాతాలు కూడా లేని భార్గవ మనీరూటింగ్ ఎలా చేస్తారు?. సిట్ చెప్పే భేతాల కథలు ఏవీ కోర్టు ముందు నిలపడవు’’ అని మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు.