
విజయవాడ: దసరా పండుగ నాడు... నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం దారకానిపాడులో జరిగిన కాపు యువకుడు తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు దారుణ హత్య కేసును నీరుగార్చేందుకు టీడీపీ పెద్దలు కుట్ర చేస్తున్నారనే వాదనకు మరింత బలం చేకూర్చింది హోంమంత్రి అనిత ప్రకటన. ఆర్థిక లావాదేవీల కారణంగానే తిరుమలశెట్టి లక్ష్మీనాయుడిని హత్య చేశారని అనిత వ్యాఖ్యానించడంపై కాపు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తన్నాయి.
హత్య జరిగిన 17 రోజుల తర్వాత ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన అనిత.. ఆపై ఆర్థిక లావాదేవీలే కారణమని స్టేట్‌మెంట్ ఇచ్చారు. దీనిపై కాపు సంఘాలు భగ్గుమంటున్నాయి. హత్య జరిగిన 17 రోజులకి పరామర్శకి రావడమే కాకుండా ఈ తరహాలో వ్యాఖ్యానించడాన్ని కాపు సంఘాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి.

కమ్మకొక న్యాయం.. కాపు బిడ్డకి మరొక న్యాయమా? అంటూ కాపు సంఘ నాయకులు ప్రశ్నిస్తున్నారు. కేసును తప్పుదోవ పట్టించే విధంగా హోంమంత్రి వ్యాఖ్యలు ఉన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఈ హత్య కేసుపై స్పందించకపోవడాన్ని కూడా వారు నిలదీస్తున్నారు. జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టిని పంపి నగదు ఇవ్వడంపై విమర్శలు చేస్తున్నారు.
ఇదొక మారణకాండ..
నెల్లూరులో జరిగింది మారణకాండ అని కాపు సామాజిక వర్గానికి చెందిన వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. ముగ్గురిపై ఉద్దేశపూర్వకంగా కారుతో హత్యాయత్నం చేశారన్నారు. ప్రమాదం అని చిన్న కేసు నమోదు చేశారని, బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకూ పోరాడతామని స్పష్టం చేశారు. పరామర్శించడానికి వస్తే పోలీసులు ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు అంబటి