హృదయం పదిలం

38 lakh heart disease sufferers in Andhra Pradesh - Sakshi

‘స్టెమి’ కార్యక్రమానికి వైద్య ఆరోగ్య శాఖ సన్నద్ధం 

హృద్రోగ బాధితులకు సత్వర చికిత్స 

రాష్ట్రంలో 38 లక్షల మంది గుండె జబ్బు బాధితులు 

సాక్షి, అమరావతి: సకాలంలో వైద్య సేవలు అందించడం ద్వారా హృద్రోగ మరణాలను నియంత్రించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. గోల్డెన్‌ అవర్‌లో చికిత్స అందిస్తే  ప్రాణాపాయ పరిస్థితిని తప్పించవచ్చు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఎస్‌.టి. ఎలివేషన్‌ మయోకార్డియల్‌ ఇన్‌ఫార్‌క్షన్‌ (స్టెమీ) కార్యక్రమాన్ని అమలు చేసేలా  వైద్య, ఆరోగ్య శాఖ ప్రణాళిక రూపొందించింది.

సాధారణ పరిభాషలో స్టెమీ అంటే గుండె రక్తనాళాలు 100 శాతం పూడుకుపోవడంతో వచ్చే గుండెపోటు. ఇలాంటి సందర్భాల్లో ఆరు గంటల్లోగా లక్షణాలను గుర్తించి పూడికను కరిగించే చికిత్స (థ్రాంబోలైసిస్‌ ఇంజక్షన్‌) అందిస్తే ప్రాణాలను కాపాడవచ్చు. రాష్ట్రంలో సంభవిస్తున్న మొత్తం మరణాల్లో 32.4 శాతం హృదయ సంబంధిత వ్యాధులే కారణం.

38 లక్షల మందికి పైగా గుండె జబ్బు బాధితులున్నారు. నాన్‌ కమ్యూనికబుల్‌ డిసీజెస్‌ (ఎన్‌సీడీ)లో గుండె జబ్బులు అగ్రస్థానంలో ఉంటున్నాయి. ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న సీఎం జగన్‌ వీటిపై దృష్టి సారించారు. ‘ఫ్యామిలీ డాక్టర్‌’ ద్వారా బీపీ, షుగర్, ఇతర ఎన్‌సీడీ బాధితుల ఆరోగ్యంపై నిరంతర ఫాలోఅప్‌ ఉంచాలని ఆదేశించారు.  

హబ్‌ అండ్‌ స్పోక్‌ విధానంలో.. 
హబ్‌ అండ్‌ స్పోక్‌ విధానంలో ‘స్టెమీ’ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. 26 జిల్లాల్లో క్యాథ్‌ల్యాబ్‌ సౌకర్యం కలిగిన ఆస్పత్రులను హబ్‌గా అభివృద్ధి చేసి జిల్లా, ఏరియా ఆస్పత్రులను స్పోక్స్‌గా తీర్చిదిద్దుతారు. రాష్ట్రంలో ఎనిమిది ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో ఇప్పటికే క్యాథ్‌ల్యాబ్‌ సౌకర్యం ఉండగా మిగిలిన చోట్ల కూడా అందుబాటులోకి తేనున్నారు. డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో క్యాథ్‌ల్యాబ్‌ సౌకర్యం ఉన్న ఆస్పత్రులను హబ్స్‌గా నోటిఫై చేస్తారు.

హబ్‌లో కార్డియాలజీ, యాంజియోప్లాస్టీ సదుపాయాలు, శిక్షణ పొందిన వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారు. స్పోక్స్‌గా వ్యవహరించే ఏరియా, జిల్లా ఆస్పత్రుల్లో జనరల్‌ ఫిజీషియన్, స్టాఫ్‌ నర్సులు, ఇతర వైద్య సిబ్బంది సేవలందిస్తారు. ఛాతీ నొప్పి, గుండె పోటు సంబంధిత లక్షణాలతో ఆస్పత్రులకు వచ్చే వారికి అత్యవసర వైద్య సేవలు అందించేలా సదుపాయాలు సమకూరుస్తారు.

ఐసీయూ సెట్టింగ్‌తో (కరోనరీ కేర్‌ యూనిట్‌), ఎలక్టో కార్డియోగ్రామ్‌ (ఈసీజీ), కార్డియోవర్టర్, థ్రాంబోలైసిస్‌ థెరపీ నిర్వహించడానికి అవసరమైన మందులు, ఇతర సదుపాయాలు ఉంటాయి. బాధితులను అత్యవసరంగా పెద్దాస్పత్రులకు తరలించేందుకు వీలుగా 108 అంబులెన్స్‌ అందుబాటులో ఉంటాయి. ఇందులోనూ ఈసీజీ సౌకర్యం ఉంటుంది. 

సేవలు ఇలా..
ఏరియా, జిల్లా ఆస్పత్రులకు ఛాతీ నొప్పి, ఇతర గుండెపోటు లక్షణాలతో వచ్చిన వారికి వెంటనే టెలీ ఈసీజీ తీస్తారు. రిపోర్టు హబ్‌లో ఉండే కార్డియాలజిస్ట్‌కు వెళుతుంది. దీన్ని పరిశీలించి గుండె రక్తనాళం ఎంత శాతం పూడుకుపోయింది? వెంటనే థ్రాంబోలైసిస్‌ అవసరమా? అనే అంశాలను కార్డియాలజిస్ట్‌ నిర్ధారిస్తారు. స్పోక్‌ కేంద్ర వైద్యుడిని అప్రమత్తం చేసి అవసరం మేరకు ‘థ్రాంబోలైసిస్‌’ ఇంజక్షన్‌ ఇస్తారు. దీంతో రోగి ప్రాణాపాయ పరిస్థితి నుంచి బయటపడతాడు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హబ్‌/సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులకు తరలిస్తారు.  

రెండు నెలల్లో..  
స్టెమీ కార్యక్రమాన్ని రెండు నెలల్లో అన్ని చోట్లా ప్రారంభించేలా చర్యలు చేపట్టాం. వైద్యులు, సిబ్బందికి ప్రోటోకాల్‌పై ప్రత్యేక శిక్షణ ఇస్తాం. స్పోక్‌ ఆస్పత్రులకు స్టెమీ కిట్స్‌ పంపిణీ చేస్తాం. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. దీంతో గోల్డెన్‌ అవర్‌లో బాధితులకు సత్వర వైద్యం లభిస్తుంది.    
– ఎం.టి.కృష్ణబాబు, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి  

తిరుపతిలో ఇప్పటికే అమలు.. 
స్టెమీ కార్యక్రమాన్ని గత రెండున్నరేళ్లుగా తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో వైద్య ఆరోగ్య శాఖ అమలు చేస్తోంది. తిరుపతి, చిత్తూ­రు, రాజంపేట, వైఎస్సా­ర్‌ జిల్లాల్లోని ప్రభుత్వ ఆస్పత్రులు రుయా ఆస్పత్రిలోని హబ్‌కు అనుసంధానమై గుండెపోటు బాధితులకు సత్వర వైద్య సేవలు అందిస్తున్నాయి. ఇప్పటి వరకూ వంద మందికిపైగా ప్రాణాలను కాపాడామని రుయా మెడిసిన్, కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్‌ మునీశ్వరరెడ్డి తెలిపారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top